84 వేల ఎకరాలు ఏమైనట్టు? | KCR slams lord lands department officials | Sakshi
Sakshi News home page

84 వేల ఎకరాలు ఏమైనట్టు?

Jul 15 2014 4:42 AM | Updated on Aug 15 2018 9:20 PM

దేవుడి భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు... కళ్లు మూసుకున్నారా.. మీ నిర్లక్ష్యం వల్లే కదా.. వేల ఎకరాలు కబ్జా అయింది.

* దేవాదాయశాఖపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
* దేవుడిమాన్యాలు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారు ?
* ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి

 
 సాక్షి, హైదరాబాద్: ‘దేవుడి భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు... కళ్లు మూసుకున్నారా.. మీ నిర్లక్ష్యం వల్లే కదా.. వేల ఎకరాలు కబ్జా అయింది. వాటిని కాపాడలేనప్పుడు దేవాదాయశాఖకు కమిషనర్, ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు, అసలు దేవాదాయశాఖ చట్టాలుండి లాభమేంటి’ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దేవాదాయశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాపై కొన్ని రోజులుగా తీవ్రంగా స్పందిస్తున్న కేసీఆర్ తాజాగా దేవాలయ భూములపై దృష్టి సారించారు.
 
 ఈ మేరకు ఆయన సోమవారం దేవాదాయశాఖ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి కమిషనర్ జ్యోతిలను పిలిపించి చర్చించారు. గతంలో మం త్రులు దేవాదాయశాఖను పూర్తిగా విస్మరించడం, అధికారుల అవినీతి ఫలితంగా దేవుడి భూములు అన్యాక్రాంతమయ్యాయి. తెలంగాణలో దేవాదాయశాఖకు దాదాపు 84 వేల ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. వీటిల్లో చాలావరకు లీజులు, ఇతరత్రా వినియోగంలో ఉండ గా, ఖాళీగా ఉన్నవాటిల్లో దాదాపు 17 వేల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. దీన్ని  సీఎం తీవ్రంగా తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో  ఆలయాలవారీగా పూర్తి సమాచారం తన ముందుంచాలని ఆదేశించారు.
 
 
 దేవాలయాల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వచ్చారని, కనీసం దేవుడి భూములను కాపాడుకోవాలనే స్పృహ కూడా ఎందుకు లేదో తనకర్థం కావడంలేదని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏ గుడి పరిధిలో ఎంత భూమి ఉందో తెలుసా అంటూ ప్రశ్నించారు. దీంతో ఇన్‌ఛార్జి కమిషనర్ జ్యోతి ఆయనకు దేవాలయాల ఆస్తుల గురించి వివరించారు. దేవాదాయశాఖ నిర్వహిస్తున్న రికార్డుల్లో ఇప్పటికీ కొన్ని భూముల వివరాలు నమోదు కాలేదని, రెవెన్యూ విభాగంతో సరైన సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని ఆమె వివరించారు. రికార్డుల్లో దేవాలయ భూములుగా స్పష్టంగా పేర్కొనకపోవడాన్ని ఆసరా చేసుకుని కొందరు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారని చెప్పారు. రెండు విభాగాల మధ్య సమన్వయం తెచ్చి దేవుళ్ల స్థలాలను కాపాడాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఆ భూములకు సంబంధించి గుళ్లకు పట్టాదారుపాసుపుస్తకాలు అందించాలన్నారు.
 
 త్వరలో ధార్మిక పరిషత్తు ఏర్పాటు...
 ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికా రులను ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి వెంకటేశ్వరరావుకు సూచించారు. దేవాలయ కమిటీలను పరిషత్తు పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement