ఇక పదవుల పందేరం

KCR and Working President KTR Is Expected To Complete The Process Of Forming Committees Within Third Week - Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో మొదటి దశగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడంతో అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 27వ తేదీన ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గత నెల 27వరకు కొనసాగినా అదనపు సమయం ఇచ్చి ఈనెల 10వ తేదీతో ముగించారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 50వేల చొప్పున మొత్తం 6లక్షల సభ్యత్వాలు చేయించాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంకాగా ఇందులో జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో లక్ష్యాన్ని దాటి 80వేల సభ్యత్వాలు పూర్తి చేశారు. మిగిలిన నియోజక వర్గాల్లోనూ లక్ష్యాన్ని చేరుకోగా.. పలుచోట్ల లక్ష్యాన్ని మించి పూర్తి చేసినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు పూర్తి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లో డివిజన్‌ కమిటీల నియామకానికి పార్టీ అగ్రనాయత్వం సమాయత్తమవుతోంది.

ఇప్పటికే కసరత్తు
సభ్యత్వ నమోదులో ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన వారు ఇప్పటికే కమిటీలపై ప్రాథమిక సమాచారాన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు అందజేశారు. సభ్యత్వ నమోదులో సమర్థవంతంగా వ్యవహరించిన వారికే కమిటీల్లో స్థానం కల్పించనున్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా మొదటి దశ సభ్యత్వ నమోదు విజయవంతం కావడంతో రెట్టింపు ఉత్సాహంతో కమిటీల ఏర్పాటుకు అగ్ర నాయకత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సభ్యత్వ నమోదులో పనితీరే గీటురాయిగా కమిటీలతో పాటు నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఈ మేరకు పదవులపై ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు గ్రామ, మండల స్థాయి నాయకుల నుంచి సేకరించిన అభిప్రాయాలను సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన నేతలు అధిష్టానానికి నివేదిక రూపంలో అందజేశారు. అయితే, కమిటీలతో పాటు పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రతిపాదనలే కీలకం కానున్నాయి.

దసరా నాటికి జిల్లా పార్టీ కార్యాలయాలు
జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాలను భవనాలు నిర్మించాలన్న లక్ష్యంతో జూన్‌ 24న శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్‌లో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు సంబంధించి తప్ప మిగిలిన అన్నిచోట్ల భూమి పూజలు నిర్వహించారు. ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు జిల్లాకో ఇన్‌చార్జిని నియమించారు. ఈ మేరకు త్వరితగతిన పూర్తయ్యేలా గుళాళీ దళనేత, సీఎం కేసీఆర్‌.. పార్టీ కార్యాలయాల మ్యాపులు, నిధులను కూడా అందజేశారు. వరంగల్‌ రూరల్‌ మినహా మిగ తా జిల్లాలో పనులు జరుగుతుండగా మంత్రి దయాకర్‌రావు పనులను పలుమార్లు పరిశీలిం చి వేగంగా జరిగేలా చూస్తున్నారు.

సీనియర్లకు ప్రాధాన్యం
సభ్యత్వ నమోదు విజయవంతం కావడంతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై కమిటీలు, పార్టీ పదవులకు ప్రాతిపాదించాల్సిన వారిపై మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు ఇతరత్రా కారణాలతో అవకాశం దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని నాయకత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఈనెల మూడో వారంలోగా పూర్తి చేయాలని అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్లకు కమిటీలు, నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా వుండగా త్వరలోనే మున్పిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనుండగా.. అర్బన్, బూత్, డివిజన్‌ కమిటీల నియామకానికి త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు జరుగుతోంది. గ్రామ, మండల, బూత్, డివిజన్, బస్తీ కమిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్మిక, విద్యార్ధి తదితర అనుబంధ కమిటీలను ఈ నెల మూడో వారంలోగా నియమించేందుకు నేతలు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులు మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top