కాచబోయిండు.. మల్లెబోయిండు!

Kakatiya era stone inscription found in Mahabubabad - Sakshi

తాజాగా వెలుగుచూసిన కాకతీయుల శిలాశాసనం

మహబూబాబాద్‌ జిల్లా గుడితండాలో గుర్తింపు

గణపతిదేవుడి కాలం నాటిదిగా నిర్ధారణ

‘రాజగజకేసరి’గా గణపతి దేవుడు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కాకతీయుల కాలం నాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. సంస్కృత, తెలుగు భాషలో ఉన్న ఈ శాసనం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుడితండాలో ఉన్న రాజరాజేశ్వర ఆలయంలో వెలుగుచూసింది. జిల్లాకు చెందిన ఔత్సాహిక పరిశోధకుడు అరవింద్‌ ఆర్యా ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం గణపతిదేవుడి కాలానికి చెందినదిగా ప్రాథమికంగా గుర్తించారు.

ఆధారాలివే..
ఆలయ మండపంలోని స్తంభంపై ఓ వైపు సంస్కృతం, మరోవైపు తెలుగులిపి ఉంది. సంస్కృతంలో 18 , తెలుగులో 4 పంక్తులు ఉన్నాయి. ఈ శాసనాన్ని పరిశీలిస్తే కాకతీయుల కాలం నాటిది అనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న పాకాల శాసనంలో ఉన్నట్లే ఇందులోని 12, 13 పంక్తుల్లో ‘అస్మాద్యన్నహి రాజగజకేసరి విభ్రమం గణపత్యవనీంద్రస్యా’అని ఉంది. ఈ శాసనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గ్రామ దేవాలయ స్తంభం మీద గుర్తించిన కాకతీయుల శాసనానికి నకలుగా ఉంది.

14వ పంక్తి నుంచి 18వ పంక్తి వరకు ఉన్న 5 పంక్తులు గుండాల, పాలంపేట, హన్మకొండ, పరకాల, ఘన్‌పూర్‌లోని శాసనాలకు ప్రతిలా ఉన్నాయి (వరంగల్‌ జిల్లా శాసన సంపుటి–శాసనాల సంఖ్యలు 78, 79, 80, 81, 82). ఈ గుడితండాతో పాటు మిగిలిన 5 చోట్ల కూడా ఇదే శాసన భాగం ఉండటం ఇది కాకతీయుల కాలం నాటిదని నిర్ధారిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే చరిత్రకారులు గుర్తించిన పాకాల శాసనంలోని 160వ పంక్తిలో, 200వ పంక్తిలో గుడితండా దేవాలయానికి తూర్పున ఉన్న చెరువును ‘మౌద్గల్య తీర్థ’మంటారని ఉంది. 175, 176, 18, 188, 208వ పంక్తులలో రామనాథదేవర ప్రస్తావన ఉంది.

ఇందుకు తగ్గట్లే శాసనంలో మొదటివైపు దేవాలయ దైవం రామనాథున్ని సంస్కృతంలో స్తుతిస్తూ శ్లోకాలున్నాయి. గుడితండా శాసనం రెండోవైపు రామనాథదేవరకు కాపులైన కాచబోయడు, మల్లెబోయలిద్దరు (కాచబోయిండు మల్లెబోయిండు రామనా) అరువణం (పాల గుండిగ, గిన్నె), దీపాలకు నేయి పోస్తున్నారని ఉంది. గుండాల, పాలంపేట, హన్మకొండ, పరకాల, ఘణపూర్‌ శాసనాల్లో ఉన్నట్లే ఈ శాసనంలో కూడా సంవత్సర, మాస, దినాలు పేర్కొనలేదు. లిపిలో ‘త’అక్షరం కొత్తగా కనిపించింది. గుడితండా శాసనంలో గణపతిదేవుడిని ‘రాజగజకేసరి’గా పేర్కొన్నారు. దీంతో ఇది గణపతిదేవుడి కాలంలో వేయించినట్లు భావిస్తున్నారు.

ఆలయ విశేషాలు.. .
రాజరాజేశ్వరాలయం త్రికూటాలయమైనా ప్రస్తుతం రెండు దేవాలయాలు మిగిలాయి. మూడో గుడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించట్లేదు. రాజరాజేశ్వరాలయానికి గర్భగుడి, అంతరాలయాలున్నాయి. అంతరాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, వారికి ఇరువైపుల చామర గ్రాహులున్నారు. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా పెద్ద కలశాలు చెక్కి ఉన్నాయి. ద్వారం ముందు సోపానశిల పెద్దదిగా ఉంది. అంతరాళంలో వినాయకుడి విగ్రహం ఉంది. మూడువైపుల విస్తరించి అర్థ మండపం, రంగమండపాలతో, 16 స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు. పశ్చిమ ముఖద్వారముంది.

ప్రస్తుతం రాజరాజేశ్వరాలయంగా పిలుస్తున్న ఈ గుడిని కాకతీయుల కాలంలో రామనాథ దేవాలయమని పిలిచేవారని శాసనంలో ఉంది. మూడు శివలింగాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం పూజలందుకుంటున్న శివలింగమొకటి, భగ్నమైన లింగమొకటి కనిపిస్తున్నాయి. 4 అడుగుల విస్తీర్ణం, లింగంతో రెండున్నర అడుగుల ఎత్తున్న గుండ్రని పానవట్టం మూడు సోపానాలు ఉన్నాయి. పూజలందుకుంటున్న శివలింగం పానవట్టం ఐదుసోపానాలతో ఉంది. దేవాలయ ప్రాంగణంలో వీరభద్రుని శిల్పం ఉంది. గుడిప్రాంగణంలోనే ద్వారానికి బయట ప్రత్యేకమైన అధిష్టాన పీఠం మీద వేంకటేశ్వరుని విగ్రహం ఉంది. దేవాలయప్రాంగణంలో రెండు ఆంజనేయ విగ్రహాలున్నాయి.

                                                         గుడిలో ఉన్న స్తంభంపై శిలాశాసనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top