జస్టిస్‌ కె.రామస్వామి కన్నుమూత | Justice Ramaswamy passes away | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ కె.రామస్వామి కన్నుమూత

Mar 7 2019 3:05 AM | Updated on Mar 7 2019 3:05 AM

Justice Ramaswamy passes away - Sakshi

జస్టిస్‌ రామస్వామి (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కె.రామస్వామి (87) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా ముగ్గరు పిల్లలున్నారు. భార్య శ్యామలాదేవి గతంలోనే కన్నుమూశారు. కుమారుడు శ్రీనివాస్‌ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. మొదటి కుమార్తె జ్యోతి న్యూయార్క్‌లో ఎస్‌బీఐ ఏజీఎంగా... రెండో కుమార్తె జయ ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూయార్క్‌లో ఉన్న కుమార్తె గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకునే అవకాశముంది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జస్టిస్‌ రామస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. న్యాయవర్గాల్లో జస్టిస్‌ రామస్వామికి ఎంతో గొప్ప పేరుంది. 

న్యాయమూర్తుల సంతాపం.. 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదాద్చారు. న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రచౌహన్, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కోదండరాం, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్, సుప్రీంకోర్టు జస్టిస్‌ సయ్యద్‌ షా మహ్మద్‌ ఖాద్రీలు, రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చంద్రయ్య, జస్టిస్‌ ఈశ్వరయ్య తదితరులు కూడా జస్టిస్‌ రామస్వామి భౌతికాయం వద్ద నివాళులర్పించారు. 

భీమవరం నుంచి ఢిల్లీ వరకు
1932 జూలై 13న జన్మించిన జస్టిస్‌ కె.రామస్వామి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం డబ్ల్యూజీబీ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆంధ్రా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1962 జూలై 9న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో మంచి నైపుణ్యం సాధించిన ఆయన 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 1974లో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా విధులు నిర్వర్తించారు.1981–82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 1982 సెప్టెంబర్‌ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్‌ నుంచి ఇంటర్నేషనల్‌ జూరిస్ట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989 అక్టోబర్‌ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులుగా నియమితులయ్యారు. 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement