జీవనభృతికి మళ్లీ మెలిక | Jivanabhrtiki bent again | Sakshi
Sakshi News home page

జీవనభృతికి మళ్లీ మెలిక

Apr 14 2015 3:22 AM | Updated on Sep 2 2018 3:34 PM

జీవనభృతికి మళ్లీ మెలిక - Sakshi

జీవనభృతికి మళ్లీ మెలిక

బీడీ కార్మికుల జీవన భృతికి సర్కారు మరో మెలిక పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికురాలిగా నమోదు కాని కారణంగా భృతిని పొందలేకపోయిన వారి కోసం మరోసారి...

  • మారిన నిబంధనలు..
  • పీఎఫ్ తప్పనిసరి..
  • యాభై ఏళ్ల లోపు వారికే..
  • కోరుట్ల: బీడీ కార్మికుల జీవన భృతికి సర్కారు మరో మెలిక పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికురాలిగా నమోదు కాని కారణంగా భృతిని పొందలేకపోయిన వారి కోసం మరోసారి సర్వేకు సిద్ధమవుతున్న తరుణంలోనే నిబంధనలు మార్చింది.
     
    గతంలో బీడీ కార్మిక భృతికి ఎంపిక నిబంధనలను మారుస్తూ కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బీడీ కార్మికులకు తప్పని సరిగా పీఎఫ్ ఉండడంతో పాటు, యాభై ఏళ్లలోపు వయస్సు ఉండాలని నిర్దేశించింది.  
     
    తాజా దరఖాస్తులు 1.20 లక్షలు


    సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మొదటి విడత బీడీ కార్మిక భృతి కోసం అర్హులను ఎంపిక చేశారు. అయితే, పీఎఫ్ ఉండి.. అన్ని అర్హతలున్నా, సమగ్ర సర్వేలో నమోదు కాని కారణంగా తమకు బీడీ కార్మిక భృతి అందలేదని ఆందోళన వ్యక్తమైంది. దీంతో బీడీ కార్మికులు భృతి కోసం మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో బీడీ కార్మిక భృతి కోసం కరీంనగర్ జిల్లాలో 44 వేలు, ఆదిలాబాద్‌లో 8 వేలు, మెదక్‌లో 13 వేలు, నిజామాబాద్‌లో 48 వేలు, వరంగల్‌లో 6 వేల మంది దరఖాస్తులు వచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన సర్వే.. ఎంపిక కోసం ఈనెల 7న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో ఎంఎస్ 38 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
     
    పీఎఫ్‌తో పాటు యాభై ఏళ్లలోపు వారైతేనే

    గతంలో బీడీ కార్మికుల పీఎఫ్‌తో సంబంధం లేకుండా.. బీడీ కార్మికురాలిగా నమోదై.. సర్వేలో బీడీలు చుడుతున్నట్లు తేలిన వారికి భృతి మంజూరు చేశారు. ఈసారి మాత్రం బీడీ కార్మిక భృతి కోసం పీఎఫ్ తప్పనిసరి చేశారు. 28 ఫిబ్రవరి 2014లోపు బీడీ కార్మికురాలు పీఎఫ్ నమోదు చేసుకుని ఉండాలి. దీంతో పాటు యాభై ఏళ్ల లోపు వయసున్న వారికే బీడీ కార్మిక భృతి మంజూరు చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మొదటి విడతలో పీఎఫ్ లేని వారికి బీడీ కార్మిక భృతి ఇవ్వడంతో చాలా మంది పీఎఫ్ లేని బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా బీడీ కార్మిక భృతి మంజూరు చేశారు. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో తమకు రెండో విడత సర్వేలోనూ బీడీ కార్మిక భృతి అందని ద్రాక్షే అవుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement