'స్వతంత్ర' వీరులు

Independents Contest In Telangana Election,Mahabubnagar - Sakshi

పరిస్థితులు అనుకూలించక కొందరు..రాజకీయ పార్టీ అండ వద్దని మరికొందరు

ఉమ్మడి జిల్లాలో పలువురు స్వతంత్రులుగా గెలుపు

కొన్నిచోట్ల బోణీ చేయలేకపోయిన ఇండిపెండెంట్లు 

ఎన్నికలంటేనే పెద్ద తతంగం.. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలనుకునే వారు రెండు, మూడేళ్ల ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. నియోజకవర్గవ్యాప్తంగా పర్యటించడం.. కార్యకర్తలు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం.. మంచీచెడు చూసుకోవడం వంటివి చేస్తూ కేడర్‌పై పట్టు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇదంతా పూర్తయ్యాక తీరా ఎన్నికల వేళ పార్టీ టికెట్‌ వస్తుందో, లేదో తెలియదు! అప్పటికప్పుడు కొత్త నేతలు వస్తే సమీకరణాల నేపథ్యంలో వారికే టికెట్‌ దక్కొచ్చు. ఇదే జరిగితే రెండు, మూడేళ్ల కష్టం నీళ్ల పాలైనట్లే. అధిష్టానాల నుంచి భవిష్యత్‌పై స్పష్టమైన హామీ వస్తేనే అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ కొందరు పోటీకి దూరంగా ఉంటుండగా.. మరికొందరు మాత్రం గెలుపు ఖాయమనే భావనతో పోటీకి సై అంటుంటారు. ఇంకా మరికొందరు ఏదో పార్టీ నుంచి పోటీకి దిగడం ఇష్టం లేక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతుంటారు.

సాక్షి,మహబూబ్‌నగర్: ఎన్నికల వేళ అన్ని పార్టీల్లోనూ మార్పులు, చేర్పులు జరగడం సహజమే. ఈ సందర్భంగా పార్టీ టికెట్‌ ఆశించిన వారికి దక్కకపోవచ్చు. టికెట్‌పై ఆశలే లేని వారికి అవకాశం దక్కొచ్చు. ఈ నేపథ్యంలో తప్పక గెలుస్తామనే నమ్మకం ఉన్న వారు, పార్టీ ప్రకటించిన అభ్యర్థి కంటే తనకే బలం ఎక్కువమని నమ్మే వారే కాకుండా.. పార్టీ టికెట్‌పై పోటీచేయడం ఇష్టం లేని పలువురు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో పలువురు స్వతంత్రులుగా రంగంలోకి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇక మరికొందరికి మాత్రం పరాజయమే ఎదురైంది.

నమ్మకంతో బరిలోకి.. 

కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి...
1967 ఎన్నికల్లో బి.నర్సింహారెడ్డి, 1972 ఎన్నికల్లో కె.రంగదాసు స్వతంత్రులుగా ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన జూపల్లి కృష్ణారావు 2004 ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఇంతలోనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నిరంజన్‌రెడ్డికి టికెట్‌ దక్కింది. దీంతో జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగగా విమానం గుర్తుపై గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కకపోవడం గమనార్హం. అయితే, వీరిద్దరు కూడా ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీకి దిగుతుండటం మరో విశేషం. జూపల్లి ఆ తర్వాత 2009లో మళ్లీ కాంగ్రెస్‌ నుంచి, 2012, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన గెలిచారు. అంటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రికార్డు జూపల్లి పేరిట నమోదై ఉంది.

నాగర్‌కర్నూల్‌ లో
1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు బ్రహ్మారెడ్డి, రామస్వామి ఇద్దరు కూడా ఇండిపెండెంట్లు గానే గెలిచారు. ఆ తర్వాత 1867 ఎన్నికల్లో వీఎన్‌.గౌడ్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం ఆయన 1972, 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీకి దిగి గెలిచారు. కాగా, నాగం జనార్దన్‌రెడ్డి 2009 ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేయడంతో 2012లో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నాగం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి గెలిచారు. అప్పట్లో నాగం తరఫున ప్రచారానికి కేసీఆర్‌ కూడా రావడం విశేషం.

జడ్చర్ల నియోజవర్గానికి..
1962, 1967లో జరిగిన ఎన్నికల్లో కొత్త కేశవులు, లక్ష్మీనర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఆ తర్వాత మరెవరు స్వతంత్రులకు కూడా ఇక్కడ విజయం దక్కలేదు. మక్తల్‌ నియోజకవర్గం ద్విసభ్య స్థానంగా ఉన్నప్పుడు 1957లో జరిగిన ఎన్నికల్లో ఒకరు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందగా.. బన్నప్ప ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌ స్థానానికి 1962 లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిఎం.రాంరెడ్డి 3,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2004 ఎన్నికల్లో పులి వీరన్న 19,282 ఓట్ల మెజార్టీతో, 2009 ఎన్నికల్లో రాజేశ్వర్‌రెడ్డి 5,275 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థులుగానే గెలిచారు.

గద్వాల నియోజకవర్గానికి..
1957లో జరిగిన ఎన్నికల్లో డీకే.సత్యారెడ్డి ఇండిపెండెంట్‌గా అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత ఆయనే 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక సత్యారెడ్డి కుమారుడు, డీకే.భరతసింహారెడ్డి 1994 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీకి దిగిన ఆయన ప్రత్యర్థి సమరసింహారెడ్డి సొంత సోదరుడే కావడం విశేషం. మధ్యలో 1967లోనూ ఇక్కడి నుంచి ఉప్పల గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1962లో వెంకట్‌రెడ్డి, 1967లో ద్యాప గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఆ తర్వాత 1994లో ఎడ్మ కిష్టారెడ్డి సైతం ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.

రెండుసార్లు ఒక్కరే.. 
2009లో కనుమరుగైన అమరచింత నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి ఓ రికార్డు ఉంది. ఈ నియోజకవర్గానికి 1952 నుంచి 2004 వరకు మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 1962, 1967లో జరిగిన ఎన్నికల్లో అమరచింత సంస్థానానికి చెందిన రాజవంశీయుడు రాజాసోంభూపాల్‌ ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించారు. అయితే, రాజ వంశీయుడు కావడంతో సహజంగానే అన్ని పార్టీల వారు తమ పార్టీ తరఫున పోటీకి దిగాలని కోరారు. కానీ ఏ పార్టీని ఎంచుకున్నా.. మరో పార్టీని తిరస్కరించినట్లవుతుందని.. అది మంచి పద్ధతి కాదనే భావనతో రాజాసోంభూపాల్‌ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఈ మేరకు ఆయన విజయం సాధించారు. ఇక మూడో సారి 1972లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరఫున పోటీకి దిగి విజయం సాధించారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి 1957లో జరిగిన ఎన్నికల్లోనూ డి.మురళీధర్‌రెడ్డి స్వతంత్రఅభ్యర్థిగానే విజయం సాధించారు. అంటే ఒక్క నియోజకవర్గం నుంచే ఇద్దరు స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం.. ఒక్కరే రెండు సార్లు సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. 
 
స్వతంత్రులు.. ఆ నలుగురు 
మహబూబ్‌నగర్, వికారాబాద్‌ జిల్లాలో కలగలిసి ఉన్న కొడంగల్‌ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ల పరంగా ఓ రికార్డు నమోదై ఉంది. ఈ నియోజకవర్గంలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడమే ఈ రికార్డు. 1962 ఎన్నికల్లో రుక్మారెడ్డి, 1967లో అచ్యుతరెడ్డి, 1972లో నందారం వెంకటయ్య, 1978లో గుర్నాథ్‌రెడ్డి స్వతంత్రులుగా బరిలోకి దిగి గెలిచారు. ఇందులో గుర్నాథ్‌రెడ్డి ఆ తర్వాత 1983, 1989, 1999, 2004లో కాంగ్రెస్‌ నుంచి గెలవగా.. నందారం వెంకటయ్య 1985లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, దేవరకద్ర, అచ్చంపేట, వనపర్తి, నారాయణపేట నియోజకవర్గాల నుంచి స్వతంత్రులెవరికీ ఇంత వరకు విజయం దక్కలేదు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top