ప్రతీ కుక్కకో లెక్క! | Identification Chip for Street Dogs In Hyderabad | Sakshi
Sakshi News home page

కుక్కకో లెక్క!

Jul 27 2018 12:15 PM | Updated on Sep 4 2018 5:53 PM

Identification Chip for Street Dogs In Hyderabad - Sakshi

గచ్చిబౌలి: గ్రేటర్‌లో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కుక్కకాటు కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో శునకాల సంఖ్యను తగ్గించేందుకు, సకాలంలో వ్యాక్సినేషన్లు వేసేందుకు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారు లు ఓ ఆలోచనకు వచ్చారు. వీధి కుక్కలకు ఐడెంటిఫికేషన్‌ చిప్‌ అమర్చితే మెరుగైన ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ... కుక్కల బెడద తగ్గేందుకు అవకాశముంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 

ఒక్కో దానికి రూ.100–150 ఖర్చు...  
ఐడెంటిఫికేషన్‌ చిప్‌ను కుక్క చర్మంలోకి పంపిస్తారు. దీనికి జీపీఎస్‌ విధానం అనుసంధానం చేసి ఉంటుంది. దీని ద్వారా కుక్క ఎక్కడ తిరుగుతుందో తెలుసుకోవచ్చు. అదే విధంగా కుక్కకు యాంటీ బర్త్‌ కంట్రోల్‌(ఏబీసీ) చేశా రా? లేదా? అని, రెగ్యులర్‌ ఏఆర్‌వీ (యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌) చేశారా? లేదా? అనే విష యాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇవి చేయని పక్షంలో ఏబీసీ, ఏఆర్‌వీ చేయొచ్చు. బంజారాహిల్స్‌లోని డాక్టర్‌ విజయలక్ష్మి పెట్‌ క్లినిక్‌లో పెంపుడు శునకాలకు ఈ చిప్‌ను అమరుస్తున్నారు. ఇదే తరహాలో జీహెచ్‌ఎంసీలోనూ చేపట్టాలనే ఉద్దేశంతో దీనిపై అధికారుల్లో చర్చ జరిగింది. ఒక్కో కుక్కకు చిప్‌ను అమర్చేందుకు రూ.100 నుంచి రూ.150 ఖర్చవుతుందని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారులు పేర్కొంటున్నారు. కుక్కకు ఏబీసీ చేసిన తర్వాతే చిప్‌ అమరుస్తారు.

కుక్క పిల్లలకు వ్యాక్సినేషన్‌ చేసిన తర్వాత చిప్‌ అమర్చి వదిలేయొచ్చు. చిప్‌ ద్వారా దాని వయస్సు తెలుసుకోవచ్చు. 8నెలల వయస్సు వచ్చే సరికి జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం సిబ్బంది దానికి ఏబీసీ చేస్తారు. ఏడాదికోసారి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్‌ చేసే అవకాశం ఉంటుంది. 

పెట్స్‌ పెరిగాయ్‌..  
బ్లూక్రాస్‌ స్వచ్ఛంద సంస్థ లెక్కల ప్రకారం శేరిలింగంపల్లి వెస్ట్‌ జోనల్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి, మూసాపేట్‌ తదితర సర్కిళ్లలో 2017 మార్చి నాటికి 81,058 వీధి కుక్కలు ఉండగా, 2018 నాటికి 77,831 తగ్గాయి. చిప్స్‌ అమర్చితే వీటి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.  ఇక ఈ జోన్‌లో 2017–18లో 3,571 పెంపుడు శునకాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 707 పెట్స్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 2018–19లో వీటి సంఖ్య 3,681కి పెరిగింది. 

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి..  
జీహెచ్‌ఎంసీ పరిధిలో పెంపుడు కుక్కలకురిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అనే నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయినప్పటికీ కొందరు  యజమానులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. అవసరమైనప్పుడు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు, ఇతర రాష్ట్రాలకు పెట్స్‌ను తీసుకెళ్లేందుకు రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుంది. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్‌ పెట్‌ క్లినిక్స్‌లలో వాక్సినేషన్‌ షెడ్యూల్‌ బుక్, పొరుగువారు ఇచ్చే ఎన్‌ఓసీ ప్రతులను జతపరిచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

రోడ్లపైకి వస్తే జరిమానా...  
పెంపుడు కుక్కలు రోడ్లపైకి వచ్చి మల, మూత్ర విసర్జన చేస్తే ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా దాని యజమానికి రూ.10 వేలు జరిమానా విధిస్తాం. ఇరుగుపొరుగు, ఇతరులు ఎవరైనా ఫిర్యాదు చేసినా ఈ మొత్తం కట్టాల్సిందే. పెట్స్‌కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వీటికి చిప్స్‌ను అమర్చే ప్రక్రియ ప్రైవేట్‌ క్లినిక్‌లు చేపడుతున్నాయి. వీధి కుక్కలకు అమర్చాలనే దిశగా
జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.– డాక్టర్‌ రనజిత్,వెటర్నరీ ఆఫీసర్, వెస్ట్‌ జోనల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement