వందేళ్ల తరువాత కుండపోత వర్షం

Hyderabad Rains Break Old Record, Water Logging In Many Areas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరాన్ని భారీ వర్షం వణికించింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన కుంభవృష్టి వర్షానికి మహా నగరం వణికిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయింది. ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 101 ఏళ్ల తరువాత కుండపోత వర్షం పడటంతో నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు జలంతో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటిలో ద్విచక్రవాహనాలు మునిగిపోగా, కార్లు అద్దాల వరకు మునిగాయి.

చదవండి: సిటీలో కుండపోత.. అర్ధరాత్రి దాకా ట్రాఫిక్‌ జామ్‌ 

1918 డిసెంబర్‌ తర్వాత  హైదరాబాద్‌లో మళ్లీ ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. నిన్న రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్ తిరుమలగిరిలో అత్యధికంగా 12.1, ఉప్పల్‌లో 12 సెం.మీల వర్షం కురిసింది. అలాగే అల్వాల్, కాప్రా, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, మెహిదీపట్నం, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్‌పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ముసాపేట్, ఉప్పల్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మరోవైపు నాచారం పోలీస్‌ స్టేషన్‌, సికింద్రాబాద్‌ లాలాగూడ రైల్వే ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది.

రికార్డు స్థాయిలో భారీ వర్షం: మేయర్‌
హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం పడిందని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపడుతోందని తెలిపారు. నగరంలో సహాయక చర్యలను పర్యవేక్షించిన ఆయన... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

నగరంలో ట్రాఫిక్‌ జామ్‌...
నగరంలో భారీ వర్షం నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రాఫిక్ జాం ఏర్పడింది. రాత్రి కురిసిన వర్షంతో రోడ్లు దెబ్బ తినడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయానే స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే వాహనాలతో రోడ్లు అన్నీ కిక్కిరిసి పోయాయి.హైటెక్ సిటీ వెళ్లే వాహనాలతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కిలోమీటర మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

పొంగిన ప్యాట్నీ నాలా...
కాగా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు బురదమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బేగంపేట్‌లోని ప్యాట్నీ నాలా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితిలో ఉండిపోయారు. ప్యాట్నీ నాలా పొంగడంతో ఆ ప్రభావం స్థానికంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లపై పడింది. నాలాలో చెత్త, ప్లాస్టిక్ సామాగ్రి భారీగా పేరుకుపోవడంతో వరద నీరు స్థానికంగా ఉన్న కాలనీని ముంచెత్తింది.

మైత్రీ నగర్‌ జలమయం
నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ మీర్‌పేట్‌లోని మైత్రీనగర్‌ జలమయమైంది. రోడ్డుపై మోకాల్లోతు నీరు చేరడంతో  స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి కూడా నీరు చేరిందని, సామగ్రి మొత్తం తడిచిపోయిందని  స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వర్షపు నీరు
మహా నగరంలో కుండపోత వర్షంతో హుస్సేన్ సాగర్‌కు భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. 514 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. నగరంలోని చెరువులకు కూడా భారీగా నీరు చేరుతోంది.

మునిగిపోయిన కోళ్లఫారమ్‌
మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి కోళ్ల ఫారమ్‌ మునిగిపోయింది. దీంతో ఫారమ్‌లోని కోళ్లన్ని మృత్యువాత పడ్డాయి. వర్షపు నీరు ఫారమ్‌లోకి చేరడంతో.. ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఫారమ్‌ యజమాని లబోదిబోమంటున్నారు. సుమారు 5 వేల కోళ్లు చనిపోయినట్లు తెలిపాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోళ్ల ఫారమ్‌ యజమాని కోరుతున్నారు.  ఇక భారీ వర్షానికి మల్కాజ్‌గిరిలోని పలు కాలనీలన్నీ నీట మునిగాయి.  ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

(వర్ష బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్ దృశ్యాల కోసం... క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top