గోదావరికి వరద పోటు

Huge Flood water to Godavari - Sakshi

రామన్నగూడెం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ  

తాలిపేరు, ఎల్లంపల్లి నుంచి లక్ష క్యూసెక్కుల చొప్పున నీరు దిగువకు

సాక్షి, భూపాలపల్లి/చర్ల/రామగుండం: భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. గోదావరి తీర ప్రాంతంలోని మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. కాళేశ్వరం వద్ద గురువారం  గోదావరి వరద 8.8 మీటర్లకు చేరింది. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మంగపేట, ఏటూరునాగారం మండలా ల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద ప్రవాహం 8.5 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి నీటిమట్టం 8.96 మీటర్లకు చేరుకుంది. మండలంలోని రాంనగర్, లంబాడీతండాలకు వెళ్లే రహదారులు వరదతో నిండిపోయాయి. దేవాదుల పంప్‌హౌస్‌ వద్ద గోదా వరి ప్రవాహం 84 మీటర్ల ఎత్తున వెళ్తోంది.

ఇప్పటికే దేవాదుల మోటార్లను అధికారులు నిలిపివేశారు. తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయి. వరద కొనసాగితే కాఫర్‌డ్యాంకు ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. వరద  చేరడంతో వరి, మిర్చి పంటలు మునిగాయి. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం 13.16 మీటర్లకు చేరుకుంది. వాజేడు, గుమ్మనదొడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూసూరు ఎడ్జర్లపల్లి గ్రామాల మధ్యన గుండ్లవాగు వంతెన పైకి వరద చేరడంతో దూలాపురం, బాడువా, కాసారం ప్రాంతాల్లో సుమారు 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరో రెండు మీటర్ల మేర ప్రవాహం పెరగవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు.  

తాలిపేరుకు 17 గేట్లు ఎత్తివేత 
తాలిపేరు ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరు తోంది. దీంతో గురువారం 17 గేట్లను పూర్తిగా (16 అడుగులు) ఎత్తి 1,40, 200 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరుకు మరింతగా వరదనీరు వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రాజెక్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు. డీఈ జె.తిరుపతి, ఏఈ వెంకటేశ్వరరావు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

ఎల్లంపల్లి 20 గేట్లు ఎత్తివేత..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 20 గేట్లను ఎత్తి 1.07 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 19.06 టీఎంసీల వరద నీరు నిల్వ ఉందన్నారు. 

తెగిన తుపాకులగూడెం బ్యారేజ్‌ కాఫర్‌డ్యాం 
ఏటూరునాగారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండల పరిధి తుపాకులగూడెం బ్యారేజీ రక్షణ కోసం నిర్మించిన కాఫర్‌డ్యాం గోదావరి వరదకు గురువారం రాత్రి తెగిపోయింది. బ్యారేజీ ప్రాంతంలో ఉన్న 11 పిలర్లలోకి వరద నీరు రాకుండా కాఫర్‌ డ్యాం (మట్టికట్ట)ను అడ్డుగా నిర్మించారు. ఎగువ ఉన్న ఇంద్రావతి, ఎల్లంపల్లి వరద ఎక్కువ కావడంతో మట్టికట్ట తెగిపోయి నీరు పిలర్లు మునిగే స్థాయికి చేరుకుంది. క్రమక్రమంగా ఒర్లిపోయిన మట్టికట్టకు పెద్ద గండి పడింది.

బొగత సందర్శన మరో మూడు రోజులు బంద్‌ 
వాజేడు: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం సందర్శనను మరో మూడు రోజులపాటు నిలిపివేశారు. ఇప్పటికే ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు నిలిపివేశారు. మళ్లీ వర్షాలు పెరగడంతో జలపాతం ఉధృతి ప్రమాదస్థాయికి చేరింది. దీంతో పర్యాటకులను బొగత సందర్శనకు అనుమతివ్వడం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top