దక్షిణాదిలో హిందీని విస్తృతం చేయాలి

Hindi should be expanded in the south - Sakshi

హిందీ సంస్థాన్‌ భవన శంకుస్థాపనలో కేంద్ర సహాయ మంత్రి సత్యపాల్‌  

హైదరాబాద్‌: జాతీయ భాష హిందీని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్ర మానవ వనరుల సహాయమంత్రి సత్యపాల్‌ సింగ్‌ అన్నారు. బోయిన్‌పల్లిలో కేంద్రీయ హిందీ సంస్థాన్‌ నూతన భవన నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. హిందీ భాష నేర్చుకోవడానికి అత్యంత సులువుగా ఉండటంతోపాటు ఇతర భారతీయ, విదేశీ భాషలనూ నేర్చుకోవడంలోనూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హిందీ భాషను దక్షిణాదిలోనూ విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థాన్‌ భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న చొరవ తీసుకోవాలన్నారు.  

కేంద్ర సంస్థలకు స్థలమిచ్చేందుకు సిద్ధం 
రాష్ట్రంలో నిర్మించనున్న కేంద్ర సంస్థల కార్యాలయాలు, ఇతర భవనాలకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన భాషలైన తెలుగు–ఉర్దూ పరస్పర తర్జుమాకు 66 మంది ట్రాన్స్‌లేటర్లను నియమించినట్లు చెప్పారు. అధికారిక కార్యకలాపాల నిర్వహణకు హిందీ–తెలుగు–ఉర్దూ తర్జుమాకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. 1976లో ప్రారంభమైన కేంద్రీయ హిందీ సంస్థాన్‌ ఆధ్వర్యంలో 16వేల మంది టీచర్లకు హిందీలో శిక్షణ ఇచ్చినట్లు సంస్థాన్‌ వైస్‌ చైర్మన్‌ కమల్‌ కిషోర్‌ గోయెంకా తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి, కేంద్రీయ హిందీ సంస్థాన్‌ డైరెక్టర్‌ నంద కిశోర్‌ పాండే, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top