
జిల్లాలో రహదారులకు మహర్దశ
జిల్లాలో రహదారులకు మహర్దశ కలగనుందని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు.
హన్మకొండ : జిల్లాలో రహదారులకు మహర్దశ కలగనుందని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారన్నారు. గత పదేళ్లుగా రోడ్ల పై తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. పనులను ఏడాదిగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. జిల్లాలో బీటీ రినివల్స్ పీఆర్ రోడ్లకు రూ.235 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో 1,716 కిలోమీటర్లు, 475 రోడ్లు బీటీ రినివల్ చేయనున్నట్లు చెప్పారు.
జాతీయ రహదారి 168 రాయగిరి నుంచి వరంగల్ ములుగు రోడ్డు కూడలి వరకు నిధులు మంజూరయ్యాయన్నారు. వరంగల్ నగర పరిధిలో రూ.5.15 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రతిపానలు సిద్ధం చేశారన్నారు. ప్రతి ఏటా 100 వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం సరిహద్దులో స్టీల్ ఫ్యాక్టరీ, జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరామన్నారు జోడేఘాట్‌లో గిరిజన విద్యాపీఠం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తిం చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కమిటీ వేసిందన్నారు. సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, గుడిమల్ల రవికుమార్, మరుపల్లి రవి, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, సైదిరెడ్డి, నయిముద్దీన్, శ్రీజానాయక్ పాల్గొన్నారు.