
భూములు సేకరించేంత వరకు వ్యవసాయం చేసుకోండి
రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ చట్టం ద్వారా భూములను సేకరించేంత వరకు పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం
రాజధాని రైతులకు
హైకోర్టు స్పష్టీకరణ
సీఆర్‌డీఏ చట్టం రద్దుకు నో
కృష్ణానదికి ఇరువైపులా బఫర్ జోన్ ప్రకటనకూ ససేమిరా
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ చట్టం ద్వారా భూములను సేకరించేంత వరకు పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి తమ భూములు కావాలనుకుంటే, వాటిని కొత్త భూ సేకరణ చట్టం కింద సేకరించాలి తప్ప, భూ సమీకరణ కింద కాదని, అలా కాని పక్షంలో కృష్ణానదికి ఇరువైపులా ఉన్న గ్రామాలను భూ సేకరణ నుంచి మినహాయించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ గుంటూరు, విజయవాడలకు చెందిన కొమ్మినేని చలపతిరావు, మరికొందరు రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.
‘రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు అత్యధికులు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే 32 వేల ఎకరాలకు పైగా సేకరించిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏ కొద్దిమంది భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోతే మొత్తం చట్టాన్నే రద్దు చేయాలా..?! అలాగే కృష్ణానదికి ఇరువైపులా నిర్మాణాలు చేపట్టకుండా బఫర్‌జోన్‌గా ప్రకటిస్తూ ఆదేశాలివ్వాలని అడుగుతున్నారు. అటువంటి ఆదేశాలు ఇవ్వలేం. మీరు (పిటిషనర్ల) లాండ్ ఫూలింగ్ కింద భూములు ఇవ్వకుంటే భూ సేకరణ ద్వారా సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. చట్ట ప్రకారం భూ సేకరణ చేసేంత వరకు మీ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సేకరిస్తున్న భూముల్ని అభివృద్ధి నిమిత్తం ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తే తప్పేముంది? ఇంత భారీ స్థాయి ప్రాజెక్టుకు ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం కూడా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామంతో జరుగుతున్నదే కదా. నదికి ఇరువైపులా నిర్మాణాలు వద్దంటున్నారు. మరి లండన్, పారీస్ నగరాలు ఉండేది నదితీరాల్లోనే కదా. మీరు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాల్లో ప్రజా ప్రయోజనాలు లేవు’ అని వ్యాఖ్యానించింది.