పొదుపు భేష్‌.. ఆరోగ్యమూ జాగ్రత్త

Health Awareness To dwcra Women In Nizamabad - Sakshi

డ్వాక్రా మహిళలకు ఆరోగ్య సూత్రాలు..!

జిల్లాలో 11 మండలాలు ఎంపిక

ఈ నెలలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్న ఐకేపీ

సాక్షి, ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలకు పొదుపు చేయడమే నేర్పించిన ఐకేపీ అధికారులు ఇకపై వారికి ఆరోగ్య సూత్రాలను నేర్పించనున్నారు. తీసుకునే ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు, పరిశుభ్రత పాటిస్తే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడో వారికి అవగాహన కల్పించనున్నారు. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అసలైన ఆనందం, సంతోషం ఉంటుందని చెప్పడానికి, సామాజిక పరివర్తనలో మా ర్పు తేవడానికి ఆరోగ్యం–పోషణ అనే కార్యక్రమాన్ని ఐకేపీ శాఖ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఒక గర్భిణీ తాను బిడ్డను ప్రసవించే వరకు, పుట్టిన బిడ్డ రెండు సంవత్సరాల వరకు పెరిగే వరకు మొత్తం వెయ్యి రోజుల ప్రాముఖ్యతను తెలియజెప్పనున్నారు. మొత్తం ఐదు అంశాలపై డ్వాక్రా మహిళలకు ప్రతీ నెలా వారి రెండవ సమావేశంలో ఐకేపీ సిబ్బంది అవగాహన కల్పిస్తారు. అయితే ఈ నెల నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఐకేపీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

11 మండలాలు ప్రాజెక్ట్‌గా..
జిల్లాలో 11 మండలాలను ప్రాజెక్టుగా తీసుకుని ఆ మండలాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య సూత్రాలను తెలుపనున్నారు. ఆ మండలాల్లో ఆర్మూర్, బోధన్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మాక్లూర్, మెండోరా, నవీపేట్, నిజామాబాద్‌ రూరల్, వేల్పూర్, ఎడపల్లి ఉన్నా యి. అయితే 11 మండలాలు కలిపి 787 వీవోలుండగా, 11,074 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఈ మొత్తం గ్రూపుల్లో 1,13,216 మంది మహిళా సభ్యులున్నారు. అయితే ఐకేపీ అధికారులు ముందుగా జిల్లా స్థాయిలో ఏపీఎంలు, సీసీలకు శిక్షణ ఇస్తారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో వీవోఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు
ప్రతీ నెలా డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తారు.

వెయ్యి రోజుల ప్రాముఖ్యత
మహిళ గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు రెండె సంవత్సరాలు నిండే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు తాగించాలి. ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలి. ఆరు నెలలు నిండగానే తల్లిపాలతో పాటు తగినంత అనుబంధ పోషకాహారం అందించాలి. ఇను ము ఎక్కువగా ఉన్న ఆహారం, అయోడీన్‌ ఉప్పు, టీకాలు, శిశు సంరక్షణలో పరిశుభ్రతను వివరిస్తారు.

పిల్లల పోషణకు పాటించే పద్ధతులు
పిల్లల పోషణకై వారికి అందించే ఆహారం, టీకాలు, వయసుకు తగ్గ అందించే పోషకాల గురించి అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం పెట్టాలి, ఆహారం ఎలా ఇవ్వాలి, పరిశుభ్రతను వివరిస్తారు. శిశువుకు సరైన పద్దతిలో ఆహారం ఇస్తున్న తల్లులకు ‘స్టార్‌’ అమ్మ పేరుతో కండువా కప్పి సత్కరిస్తారు.

చేతుల పరిశుభ్రత
అనేక రుగ్మతలకు అపరిశుభ్రమైన వాతావరణం, చేతు లు సరిగ్గా కడగకపోవడం కారణాలవుతున్నాయి. చేతు లు సరిగ్గా కడుక్కోకున్నా క్రీములు మానవ శరీరంలోకి వెళ్లి వ్యాదుల సంక్రమణకు దారి తీస్తాయి. ఇందుకు ప్రతీ రోజు అన్నం తినే ముందు, మలమూత్ర విసర్జన, ఆటలాడిన తరువాత సబ్బుతో లేదా బూడిదతో చే తులు కడుక్కోవాలని సూచనలు చేస్తారు. చేతులు కడగడం వల్ల అంటు రోగాల సంక్రమణ, అతిసారం, ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గిస్తుంది.

శుభ్రమైన సమతుల్యమైన ఆహారం..
రోజు వారీగా తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు, న్యూట్రిన్‌లు, శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకునే విధానంపై మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కల్తీకి గురయ్యే ఆహారాలేంటీ ఇతర వివరాలను తెలియజేస్తారు. గుడ్లు, కోళ్లు, పప్పులు, పండ్లు, వెన్న, కూరగాయలు తీసుకోవడం వల కలిగే లాభాలను వివరిస్తారు.

చెత్త నివారణ, పర్యావరణ పారిశుధ్యం
అనేక సమస్యలకు మూల కారణం చెత్తే. ఈ చెత్తను నిర్మూలించడానికి, పర్యావరణ పారిశుధ్యం కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభ్యులకు వివరిస్తారు. ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం, తడి, పొడి చెత్తను వేరు వేరుగా వేయడంపై అవగాహన కల్పిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top