సూర్యాపేట పోలీస్ కాల్పుల ఘటనలో మరో నిందితుడు అర్వపల్లి గుట్టలలో సంచరిస్తున్నాడనే సమాచారంతో
అర్వపల్లి: సూర్యాపేట పోలీస్ కాల్పుల ఘటనలో మరో నిందితుడు అర్వపల్లి గుట్టలలో సంచరిస్తున్నాడనే సమాచారంతో ఆదివారం గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు అర్వపల్లి గుట్టను జల్లెడపట్టాయి. గుట్టతో పాటు సీతారాంపురం, జాజిరెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సూర్యాపేట కాల్పుల దుండగులు ముగ్గురు ఇక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఈ దుండగులను ఉగ్రవాదులుగా అనుమానిస్తుండటంతో ముంబై ఏటీసీ, మధ్యప్రదేశ్ పోలీసులు కూడా ఇక్కడకు వచ్చి దర్గాతో పాటు సీతారాంపురం శివారులో కాల్పులు జరిగిన ప్రదేశాలను పరిశీలించి వెళ్లారు.
సూర్యాపేట డీఎస్పీ రషీద్, తుంగతుర్తి సీఐ గంగారాంలు అర్వపల్లి స్టేషన్‌లో ఇక్కడి పరిస్థితిపై సమీక్షించారు. దుండగులు సూర్యాపేట నుంచి అర్వపల్లికి ఆటోలో వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఏ ఆటోలో వచ్చారనే విషయమై ఆరా తీస్తున్నారు. పోలీసుల కూంబింగ్‌తో జనం ఇంకా భయంతోనే గడిపారు. కాగా అర్వపల్లి దర్గా ఖాదీం ఎండీ.మౌలానాను పోలీసులు స్టేషన్‌కు పిలిపించుకొని దర్గాకు వచ్చిపోయే వారి సమాచారాన్ని సేకరించారు. శుక్రవారం రాత్రి దర్గా వద్ద తలదాచుకున్న ఇద్దరు దుండగులు అక్కడికి ఎప్పుడు వచ్చారు, ఏమి చేశారనే విషయమై ఆరా తీశారు.