ముదురుతున్న గ్రానైట్‌ యుద్ధం

Granite War Between Bandi Sanjay And Gangula Kamalakar - Sakshi

మంత్రి గంగుల టార్గెట్‌గా బరిలోకి ఎంపీ సంజయ్‌

గవర్నర్‌కు ఫిర్యాదుతో సీన్‌లోకి వచ్చిన గ్రానైట్‌ వ్యాపారులు

కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న వరంగల్‌ మైన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌

రాజకీయ అంశంగా మారిన గ్రానైట్‌

సాక్షి, కరీంనగర్‌: ‘కరీంనగర్‌లో లక్షలాది మందికి ఉపాధిగా మారిన గ్రానైట్‌ పరిశ్రమ సంక్షోభంలో పడబోతుందా..? ఇప్పటికే చైనాలో మార్కెట్‌ లేక నష్టాల బాట పట్టిన వ్యాపారులు ఎనిమిదేళ్ల క్రితం నాటి సీనరేజీ ఫీజు, అపరాధ రుసుం రూ.729 కోట్లు చెల్లిస్తారా? ఇప్పటికే క్వారీ పరిశ్రమ నుంచి తప్పుకున్న క్వారీ యజమానుల జాబితాలోకి మిగతా వారు కూడా చేరుతారా..?’ గత కొద్ది రోజులుగా కరీంనగర్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఇలాంటి సందేహాలు రాకమానవు. కరీంనగర్‌ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన బండి సంజయ్‌కుమార్‌ గ్రానైట్‌ వ్యాపారంలో జరు గుతున్న అవకతవకలనే తొలి టార్గెట్‌గా భావించారు.

ఎనిమిదేళ్ల క్రితం నమోదైన రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్‌ను ఎగుమతి చేస్తున్న కారణంగా సీనరేజీ ఫీజుపై 5 రెట్ల అపరాధ రుసుం కింద వసూలు చేయాల్సిన రూ.749 కోట్లు సర్కారు ఖజానాకు జమ చేయడం లేదని పాత కేసును తెరపైకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ గనుల శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు. హైదరాబాద్‌ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడమే గాక, గురువారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి విచారణ జరిపించాలని కోరారు. దీంతో గ్రానైట్‌ యుద్ధం పతాక స్థాయికి చేరింది. మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగుల కమలాకర్‌ సోదరుడికి గ్రానైట్‌ వ్యాపారంతో  సంబంధాలున్నాయి.

ఆయనతోపాటు కరీంనగర్‌కు చెందిన సుమారు 300 మందికి గ్రానైట్‌ వ్యాపారంలో ప్రవేశం ఉంది. గత కొంతకాలంగా వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం 300 నుంచి 28 క్వారీలకు వ్యాపారం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పులిమీద పుట్రలా రూ.749 కోట్ల ఎగవేత అంశం తెరపైకి తేవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రాజ్యాంగ సంస్థలను కూడా సంజయ్‌ ఆశ్రయించడం గ్రానైట్‌ వ్యాపారులకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు పరిశ్రమను మూసివేసి బంద్‌ పాటించాలని నిర్ణయించడం గమనార్హం.

నోటీసులు జారీ చేసిన గనుల శాఖ
ఎంపీ సంజయ్‌ గ్రానైట్‌ వ్యాపారంలో ఎగవేతలపై సాగిస్తున్న పోరు నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ అప్రమత్తమైంది. వరంగల్‌ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డికి ఈ కేసును అప్పగించారు. ఆయనే స్వయంగా 2011 నాటి సీనరేజీ ఎగవేత, పెనాల్టీ విధింపు అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్‌ గనుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు క్వారీ యజమానులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. సుమారు 125 మందికి ఇప్పటికే నోటీసులు పంపించిన అధికారులు మిగతా వారికి కూడా సోమవారం వరకు పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రానైట్‌ వ్యాపారులు తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్‌ జిల్లా గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం మీడియా ముందుకు వచ్చి వేధింపులకు నిరసనగా మూడు రోజుల పాటు గ్రానైట్‌ పరిశ్రమ బంద్‌ పాటిస్తున్నట్లు తెలిపారు.  గ్రానైట్‌ పరిశ్రమ వల్ల 2లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని, రాజకీయ కక్షతో ఒక వ్యక్తి పరిశ్రమనే నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. తాము న్యాయబద్దంగా ప్రభుత్వానికి సీనరేజీ ఫీజు చెల్లించే వ్యాపారం చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

అసలెక్కడివీ రూ.749 కోట్లు
2011లో కరీంనగర్‌ నుంచి 8 రైల్వే యార్డుల ద్వారా 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు చైనాకు ఎగుమతి చేసేందుకు పంపించిన గ్రానైట్‌ బ్లాకులకు కాకినాడ పోర్టు వద్ద తనిఖీలు నిర్వహించిన గనుల శాఖ, ప్రభుత్వానికి రూ.125 కోట్ల సీనరేజీ ఫీజు చెల్లించకుండా రవాణా చేస్తున్నారని కేసు నమోదు చేసింది. గనుల శాఖ నిబంధనల ప్రకారం రాయల్టీ ఎగవేత కింద సీనరేజీ ఫీజు రూ.125 కోట్లతోపాటు పెనాల్టీగా + 5 రెట్లు నిర్ణయించారు. తద్వారా కరీంనగర్‌కు చెందిన 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీల ద్వారా గ్రానైట్‌ రవాణా చేసిన సుమారు 200 మంది క్వారీ యజమానులకు ఈ జరిమానా విధించడం జరిగింది. ఈ అంశంపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో గ్రానైట్‌ వ్యాపారులు చర్చలు జరిపారు.

గ్రానైట్‌ బ్లాకుల పరిమాణాల్లో తేడాలున్నాయని, క్వారీల వారీగా కొలతలు వేయాలని, కట్‌ చేసిన గ్రానైట్‌ రాయికి మార్కెట్‌ చేసే రాయికి మధ్య వ్యత్యాసం ఉంటుందని వాదనలు వినిపించారు. ఐదు రెట్లు అదనంగా కాకుండా 1+1 ప్రాతిపదికన అపరాధరుసుం చెల్లించేందుకు సిద్ధమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు కోర్టును కూడా ఆశ్రయించారు. కరీంనగర్‌కు చెందిన 200 మంది వ్యాపారులు భాగస్వామ్యంగా గల ఈ కేసును విచారించేందుకు గనుల శాఖ వద్ద సరైన యంత్రాంగం లేకపోవడం, ఇతర కారణాల వల్ల 2011 నాటి కేసు మూలన పడింది. సంజయ్‌ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అంశంపై యుద్ధమే ప్రకటించారు. గతంలో జరిగిన అవకతవకలను వేటినీ వదిలేది లేదని, కరీంనగర్‌లో గ్రానైట్‌ మాఫియా తయారైందని ఆయన బాహాటంగానే చెబుతున్నారు.

గంగుల కుటుంబం వ్యాపారంతో రాజకీయ రంగు
మంత్రి గంగుల కుటుంబానికి గ్రానైట్‌ వ్యాపారంతో సంబంధాలు ఉండడంతో వ్యాపారులు కూడా సహజంగానే ఆయనకు మద్దతుదారులుగా నిలిచారు. ఎగుమతి చేస్తున్న 8 క్వారీలకు చెందిన గ్రానైట్‌కు సంబంధించి సీనరేజీ ఫీజు చెల్లించలేదని సంజయ్‌ వాదన. ఈ 8 క్వారీలదే రూ.125 కోట్ల సీనరేజీ ఫీజు కాగా, పెనాల్టీ 625 కోట్లు కలిపి రూ.749 కోట్లు అని చెబుతున్నారు. కానీ 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీల ద్వారా కరీంనగర్‌లోని 200 క్వారీలకు చెందిన రాయి కాకినాడకు వెళ్లిందని అసోసియేషన్‌ సభ్యులు చెబుతున్నారు. గనుల శాఖ కూడా ఇప్పటికే 125 మందికి పైగా నోటీసులు జారీ చేసిందంటే 8 క్వారీల లెక్క సరికాదని అర్థమవుతోంది. గంగుల కుటుంబానికి చెందిన ఓ కంపెనీ పేరును పోలీన ఏజెన్సీ పట్టుబడిన ఎనిమిదింట ఉండడమే ఈ వివాదానికి కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top