జీహెచ్‌ఎంసీ టూ డైమెన్షన్‌ సర్వే.. | GHMC Conduct Two Dimensional Survey In Hyderabad | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ టూ డైమెన్షన్‌ సర్వే..

Nov 21 2019 8:25 AM | Updated on Nov 21 2019 8:25 AM

GHMC Conduct Two Dimensional Survey In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బల్దియా ఖర్చులు ఏటికేడాది పెరుగుతున్నాయి. అయితే, అనుకున్నంత ఆదాయం మాత్రం సమకూరడం లేదు. దీంతో ఖర్చులకు అనుగుణంగా రాబడిని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓ వైపు ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయడంతో పాటు మరోవైపు అన్ని భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్నును పొందేందుకు ‘2డీ’ (టూ డైమెన్షన్‌) సర్వే నిర్వహిస్తోంది. జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను ద్వారా దాదాపు రూ.1400 కోట్లు వసూలవుతున్నప్పటికీ, ఈ ఆదాయం ఇంకా  పెరిగేందుకు అవకాశముందని భావించిన అధికారులు అన్ని ఇళ్ల నుంచి వాస్తవ ఆస్తిపన్ను వసూలు చేసేందుకు శాటిలైట్‌ చిత్రాలను అనుసంధానం చేస్తున్నారు. ప్రతి భవనాన్ని ‘వీ మ్యాప్‌’ (వెక్టర్‌ మ్యాప్‌)తో జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నారు. సంబంధిత యాప్‌ను వినియోగిస్తూ బిల్‌ కలెక్టర్లతో     –
పాటు ఇతర సిబ్బంది డాకెట్ల వారీగా ఇళ్ల సర్వే చేపట్టారు.

సర్వే ప్రారంభానికి ముందు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించేందుకు, రోజుకు ఎన్ని ఇళ్లు సర్వే చేయవచ్చో అంచనాకు వచ్చేందుకు వారం క్రితం ఒకేరోజు దాదాపు 340 ఇళ్లను సర్వే చేశారు. అందులో 70 ఇళ్లకు వాస్తవంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువ పన్ను ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 10 ఇళ్లు అసలు ఆస్తిపన్ను జాబితాలో లేవు. మరో 17 ఇళ్ల విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికే పన్ను ఉంది. ఇలా మూడు విధాలా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువే వస్తోంది. శాంపిల్‌ డ్రైవ్‌లోనే దాదాపు 28 శాతం ఇళ్లు వాస్తవంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను చెల్లించడం లేదని గుర్తించారు. ఇలా అన్ని ఇళ్ల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను భారీ మొత్తంలో ఉండే అవకాశముండడంతో ఇళ్ల సర్వేపై దృష్టి పెట్టారు.  
 
ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వసూలు 
ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు కనీసం మూడో వంతు ఇళ్ల సర్వే పూర్తిచేసి.. ఆస్తిపన్ను రివైజ్‌ చేసి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అదనంగా వచ్చే పన్నుతో సహా వసూలు చేయాలని యోచిస్తున్నారు. సర్వే పేరిట ఆస్తిపన్ను వసూళ్లు ఆగకుండా ఉండేందుకు ఒకపూట వసూళ్లు, మరో పూట సర్వేలో పాల్గొనాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశించారు. అంతే కాకుండా సర్వే నిర్వహించినప్పటికీ, వెంటనే పెరిగిన ఆస్తిపన్ను విధించకుండా లక్ష్యం మేరకు మూడో వంతు ఇళ్ల సర్వే మొత్తం పూర్తయ్యాకే.. పెరిగే ఆస్తి పన్నును రివైజ్‌ చేయాలని సూచించారు. తద్వారా గతేడాది వసూలైన ఆస్తిపన్ను కంటే దాదాపు 20 శాతం అదనంగా వసూలు కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వేలో భాగంగా ఎక్కువ అంశాల్లోకి పోకుండా ప్రస్తుతానికి భవన వినియోగంలో తేడా (వ్యాపారానికి వినియోగిస్తూ నివాస ఆస్తిపన్ను చెల్లింపు), ఇంత వరకు ఆస్తిపన్ను జాబితాలోలేని ఇళ్లు, ప్లింత్‌ ఏరియా కంటే తక్కువ ఏరియాకు మాత్రమే పన్ను చెల్లిస్తున్న వివరాలు మాత్రమే తీసుకుంటున్నట్లు అడిషనల్‌ కమిషనర్‌(ఐటీ) సిక్తా పట్నాయక్‌ తెలిపారు.  
 

  • సర్వేలో భాగంగా ఎక్కువ ఆస్తిపన్ను వచ్చేందుకు అవకాశమున్న డాకెట్లలో తొలుత సర్వే చేపట్టనున్నారు. ఎక్కువ పన్ను వచ్చే వాణిజ్య భవనాలు అధికంగా ఉన్న ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా, తర్వాత పెద్ద భవనాలున్న ప్రాంతాలను ‘బి’ కేటగిరీగా, మిగతావాటిని ‘సి’ కేటగిరీగా గుర్తిస్తారు. తొలుత ‘ఎ’ కేటగిరీ ఎక్కువగా ఉన్న డాకెట్లలో సర్వే పూర్తి చేయనున్నారు. సర్వేలో భాగంగా బిల్‌ కలెక్టర్లు ఇళ్లను రెండు ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేస్తారు. అవి కార్యాలయంలోని ఉన్నతాధికారులకూ తెలుస్తాయి. 
  • జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో 15.93 లక్షల ఆస్తులు(ఇళ్లు/భవనాలు) ఉన్నాయి. వీటిలో 13.59 లక్షలు నివాస భవనాలు కాగా, వాణిజ్య జాబితాలో 2.06 లక్షలు ఉన్నాయి. నివాసం/వాణిజ్యం కలిసి ఉన్న భవనాలు దాదాపు 28 వేలు. సమగ్ర సర్వే పూర్తయితే వాణిజ్య కేటగిరీలో భవానాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పటి దాకా ఆస్తిపన్ను జాబితాలోకి ఎక్కని భవానాలు కూడా చేరి మొత్తం భవనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement