ఏరు మింగిన ఊరు | Sakshi
Sakshi News home page

ఏరు మింగిన ఊరు

Published Sun, Apr 22 2018 12:54 AM

Freshly detected Enthusiastic historian in researchers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంచి నాగరికత వర్ధిల్లిందనడానికి చిహ్నంగా నాణ్యమైన వస్తువుల జాడ ఉందక్కడ. బాగా కాల్చి రూపొందించిన ఇటుకలు, నగిషీలద్ది తయారుచేసిన కుండలు, ఇంటి అవసరాలకు కావాల్సిన పనిముట్లు, అలంకరణకు వాడే రంగురంగుల పూసలే దీనికి నిదర్శనం. అవన్నీ ఒకటి రెండు శతాబ్దాల కాలానివిగా తెలుస్తోంది. కానీ ఇప్పుడక్కడ ఆవాసం జాడలేదు. 

మంచి పనిమంతుడి చేతిలో ఉలి విన్యాసం చేయటంతో రూపొందిన అద్భుత శిల్పకళాతోరణం, దానిపై ఉన్న ద్వారపాలకుల శిల్పాలు సౌందర్యంగా కనువిందు చేస్తున్నాయంటే వాటిని రూపొందించిన వారి చాతు ర్యం ఎంత గొప్పదో అవగతమవుతోంది. ఆ పనితనం కాకతీయుల కాలంది. కానీ ఆ దేవాలయంలో దేవతామూర్తులు లేరు. వెరసి శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల వరకు ఆ ఊరు విలసిల్లిందని ఆధారాలతో స్పష్టంగా తెలుస్తోంది.  

మరి ఆ తర్వాత ఊరు ఏమైంది. ఉన్నట్టుండి కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది. జీవనాధారంగా చేసుకున్న యేరే ఆ ఊరిని మింగేసిందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. పర్యావరణంలో వచ్చిన మార్పులు, వాటి పరిణామాలపై మన దేశంలో పరిశోధనలు దాదాపు శూన్యం. భావి తరాలు మరోసారి ప్రకృతి బీభత్సాల బారిన పడకుండా గతానుభవాల నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు చాలాదేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. కానీ మనవద్ద ఇప్పటివరకు వాటి ఊసు లేదు. వానాకాలంలో మాత్రమే కాస్త నీటి జాడలుండే ఓ యేరు ఒకప్పుడు ఉగ్రరూపాన్ని  చూపిందని, దాని తాకిడికి ఊళ్లకు ఊళ్లు అంతరించాయని సిరిసిల్ల జిల్లాలోని  ఇల్లంతకుంట సమీపంలో ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు ప్రాథమిక ఆధారాలు గుర్తించారు. వందల ఏళ్లు మనుగడ సాగించిన ఊరు అంతరించటానికి మెరుపు వరదలే కారణమన్న సంగతి అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి.  

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బిక్క వాగు ఒడ్డున ఉన్న గాలిపల్లి–నరసక్కపేట మధ్య అంతరించిన ఊరును కొత్త తెలంగాణ చరిత్ర బృం దం తాజాగా గుర్తించింది. బృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, కరుణాకర్, చంటిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ అంతరించిపోయిన ఊరు జాడలు గుర్తించారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.. 

ఇక్కడున్న వాగును బిక్క వాగుగా పిలుస్తారు. ఒకటీ, రెండు శతాబ్దాల్లో జైనం, బౌద్ధం వర్ధిల్లింది. అప్పట్లో భిక్షువులు నీటి జాడ ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారు. భిక్షువుల ప్రాంతం కావటంతో అది భిక్షువుల వాగు, కాలక్రమంలో బిక్క వాగుగా మారింది. ఆలేరు సమీపంలోని బిక్కేరు కూడా ఇదేక్రమంలో పేరు సుస్థిరం చేసుకుంది. అక్కడ బౌద్ధారామాలు, స్థూపాలు వెలుగుచూశాయి. ఇదే క్రమంలో బిక్కవాగు వద్ద కూడా బౌద్ధం వర్ధిల్లి ఉంటుంది. తర్వాత కాకతీయుల కాలంలో హైందవం విలసిల్లింది. ఆ సమయంలో నిర్మితమైనట్టు భావిస్తున్న ఆలయం ఉంది. అది చిన్నగా ఉన్నా, ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన తోరణం అత్యద్భుతంగా ఉంది. చుట్టూ గోడలు శిథిలమయ్యాయి.

ఆలయంలో ఎటువంటి విగ్రహాలు కనబడటం లేదు. తోరణ ద్వారానికి రెండు వైపులా ద్వారపాలకుల విగ్రహాలు, వాటికి ఇద్దరేసి చామరగ్రాహిణులు, పరిచారికల శిల్పాలున్నాయి. పైభాగంలో లలాటబింబంగా గజలక్ష్మిమూర్తి ఉంది. అది చెన్నకేశవుడి ఆలయంగా సమీపంలోని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఆలయానికి ముందువైపు ఉన్న పొలాల్లో ఊరి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్న కాల్చి రూపొందించిన పెద్దపెద్ద ఇటుకలు, మట్టి కుండల ముక్కలు, పనిముట్లు, ఆయుధాల అవశేషాలు కనిపిస్తున్నాయి. వాగులో నీటి వనరు పుష్కలంగా ఉండటంతో అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేసుకుని జీవనం సాగించారు. ఉన్నట్టుండి దానికి మెరుపు వరదలు రావటంతో ఊరు ధ్వంసమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గాలిపల్లి గ్రామానికి ఇది చేరువగా ఉంది. పాత ఊరు ధ్వంసం కావటంతో ప్రస్తుత గ్రామం కాలక్రమంలో ఏర్పడింది. ఇక్కడ చారిత్రక అన్వేషణ జరిపితే వందల ఏళ్లనాటి విషయాలు, బౌద్ధ నిర్మాణాల జాడ కూడా తెలిసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement