దర్జాగా ఇసుక దందా

 Fearless Sand Mafia Transporting In Narayanpet - Sakshi

సాక్షి, మరికల్‌: అక్రమ ఇసుక వ్యాపారులు అధికారుల అండదండలతో పాలమూరు ఇసుక రావాణాకు తుట్లు పొడుస్తున్నారు. వారి కన్నుసన్నల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడులకు దిగుతున్నారు. మండలంలోని పూసల్‌పహాడ్‌ సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్‌ వాగులో జోరుగా అక్రమా ఇసుక రవాణా జరుగుతుంది. ట్రాక్టర్‌కు రూ.4500 నుంచి రూ.5వేల మధ్య ఇసుకను విక్రయిస్తుంటారు.

పూసల్‌పహాడ్‌ గ్రామంలోని పలువురు వ్యక్తులు అక్రమ ఇసుక వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అధికారులకు మామూళ్ల ముట్టచెబుతూ వారి దందాను దర్జాగా సాగిస్తున్నారు. దీంతో వారు ఆడిందే ఆట పాడిదే పాటగా మారింది. పూసల్‌పహాడ్‌ నుంచి మరికల్, మాధ్వార్, తీలేర్, పల్లెగడ్డ, తధితర గ్రామాలకు ఇసుక ఆర్డర్లు వస్తే చాలు అధికారులకు ఫోన్‌ కొట్టిన తర్వాతనే వాగులోకి ఇసుక కోసం ట్రాక్టర్లను తీసుకెళ్తారు. వారు కాదంటే ట్రాక్టర్‌ ముందుకు కదలదు. ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.3వేల చొప్పున అధికారులకు ఇస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపొవడంతో గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.  

అడ్డొచ్చిన వారిపై దాడులు  
కోయిల్‌సాగర్‌ వాగు నుంచి గుట్టు చప్పుడుగా ఇసుకను తరలిస్తున్న వారిని అడ్డుకుంటే వారు ఎంతటికైనా తెగిస్తారు. అడ్డుకున్న వారు ఎవరని చూడకుండా దాడులు చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఏడాది క్రితం అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న వీఆర్‌ఓ మైబన్నను చితకబాది ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఇసుక వ్యాపారంలో ఉన్న లాభాలకు అలవాటు పడ్డ కొందరు వ్యాపారులు ప్రస్తుతం కూడా వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

అసలే వర్షాలు లేక బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపోతున్న తరుణంలో కోయిల్‌సాగర్‌ వాగుల్లో నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం వల్ల వాగు పరివార ప్రాంతం సమీపంలో ఉన్న బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపొతుండటంతో ఇటీవల కొందరు రైతులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రైతులను సైతం విడిచిపెట్టకుండా దాడులు చేశారు.

తమ పై దాడులు చేశారు
కోయిల్‌సాగర్‌ వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యాపారులను అడ్డుకుంటే తమపై దాడులు చేసి గాయపర్చారు. తమ వ్యాపారానికి అడ్డు రావొద్దని భయపెట్టిస్తున్నారు. గ్రామంలో దర్జాగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. 
– ఆంజనేయులు, రాంరెడ్డి, పూసల్‌పహాడ్‌ 

చర్యలు తీసుకుంటాం
అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. పాలమూరు ఇసుక రవాణా కా కుండా దొడ్డిదారిన ఎవరైన సరే అక్రమంగా ఇసుక రవాణా చేస్తే సహించం. అక్రమంగా ఇసుక తరలించేందుకే వీలులేదు. తప్పనిసరిగా అనుమతి పొందాల్సిందే. అధికారులచే తనిఖీలు చేపడుతాం. ఇసుక వ్యాపారులతో అధికారులు డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.  
– నాగలక్ష్మి, తహసీల్దార్, మరికల్‌    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top