పరిహారం కాజేశారు..న్యాయం చేయండి.. | Family Commits Suicide Attempt in front of CM Camp Office | Sakshi
Sakshi News home page

పరిహారం కాజేశారు..న్యాయం చేయండి..

Jun 18 2019 8:13 AM | Updated on Jun 18 2019 8:13 AM

Family Commits Suicide Attempt in front of CM Camp Office - Sakshi

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు ఐలేష్, కుటుంబ సభ్యులు

పంజగుట్ట: పరిహారం విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ రైతు కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. భార్యా, బిడ్డలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించుకునేందుకు యత్నించగా సెక్యురిటీ సిబ్బంది వారిని అడ్డుకుని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు మాషమోని ఐలేష్‌ మాట్లాడుతూ .. 1979లో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం సర్వే నంబర్‌ 58లో ఉన్న భూదాన్‌ భూముల్లో 1458 ఎకరాలను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిందన్నారు. అందులో తమ కుటుంబానికి ఐదు ఎకరాలు కేటాయించారన్నారు. అయితే 2010లో సదరు సర్వే నంబర్‌లో భూమిని ప్రభుత్వం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌కు కేటాయించడంతో తాము భూమిని కోల్పోయినట్లు తెలిపాడు. భూమి కోల్పోయిన రైతులందరికీ ఎకరానికి రూ.5.40 లక్షల చొప్పున పరిహారం అందజేశారన్నాడు.

అయితే అప్పటి వీఆర్‌ఓ రాంరెడ్డి, తహసీల్దార్‌ విక్టర్, ఆర్డీఓ రాజేందర్, మరి కొంతమంది ఉద్యోగులు, భూదాన్‌ బోర్డు చైర్మన్‌ కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి తనకు రావల్సిన  పరిహారాన్ని కాజేశారని ఆరోపించాడు. దీనిపై అధికారులను నిలదీయగా సర్వే నంబరు తప్పు పడిందని, మరో ప్రాంతంలో భూమిని ఇస్తామంటూ సాకులు చెబుతూ గత కొన్నేళ్లుగా తమ చుట్టూ తిప్పుకుంటున్నారన్నాడు. ఇందుకుగాను దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో భూదాన్‌ బోర్డు రద్దు కావడంతో తాము ఏమీ చేయలేమంటూ సదరు అధికారులు చేతులెత్తేశారని తెలిపాడు. దీనిపై 2017 నవంబర్‌లో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌  చేసిన పోలీసులు బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు. తనకు న్యాయం చేయాలని పలువురు రాజకీయ నాయకులను, పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేదన్నారు. అంతేగాక తన ఇంటికి వచ్చిన వీఆర్వో రాంరెడ్డి లారీతో గుద్దించి చంపేస్తానని బెదిరించాడన్నారు. భూమి లేక ఉపాధి కరువై తన కుంటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందనన్నాడు.  జీవితంపై విరక్తి చెంది తన భార్య అనూరాధ, కుమార్తెలు అక్షిత (7), మణితేజ (6), వేణుతేజ (4)లతో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. వీఆర్వో రాంరెడ్డి, ఇతర అధికారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. పోలీసులు అతడిని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement