మళ్లీ ‘ఆరోగ్యశ్రీ’ 

Etela Rajender Says Health Networks In The State Have Called Off The Strike About Arogyasree - Sakshi

బకాయిల విడుదలకు మంత్రి ఈటల హామీ

ఆసుపత్రులకు ఇకపై ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని వెల్లడి

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో ఆసుపత్రుల ఎంవోయూను సరళీకరించేందుకుత్వరలో కమిటీ

నేటి నుంచి యథావిధిగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సమ్మె విరమించాయి. బకాయిల విడుదలకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం రాత్రి సచివాలయంలో మంత్రి ఈటలతో తెలంగాణ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం (తన్హా) ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. నిధుల విడుదలకు మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నామని డాక్టర్లు ప్రకటించారు. దీంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

చర్చల అనంతరం ఈటల మాట్లాడుతూ ఇకపై ప్రతి నెలా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సాధ్యమైన మేర బకాయిలు ఎక్కువగా లేకుండా చూస్తామన్నారు. గతంలో లాగా కాకుండా ఎప్పటికప్పుడు హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో హాస్పిటళ్లకు ఉన్న ఎంవోయూ వందల పేజీలతో గందరగోళంగా ఉందని, దీన్ని సరళీకరించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామన్నారు. వైద్య సేవల ప్యాకేజీలను కూడా సమీక్షిస్తామన్నారు.

అటు ఆసుపత్రులకు, ఇటు రోగులకు ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకం అన్నారు. ఆయుష్మాన్‌తో రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలకే వైద్యం అందే అవకాశముందని, తాము 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నామని తన్హా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒప్పందంలోని లొసుగులే సమస్యలకు దారి తీస్తున్నాయన్నారు. ఆయుష్మాన్‌ వద్దు, ఆరోగ్యశ్రీ ముద్దు అని ఈ సందర్భంగా రాకేశ్‌ వ్యాఖ్యానించారు.

బుధవారం నుంచి ప్రజలకు యథావిధిగా సేవలందిస్తామని తెలిపారు. ఇక పై తన్హా గౌరవ అధ్యక్షునిగా మంత్రి ఈటల ఉంటారని ఆయన ప్రకటించారు. ఐదు రోజులుగా రోగుల ఇక్కట్లు... ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌కు సంబంధించి బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఈ నెల 16 నుంచి తన్హా హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. అదేరోజు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ బకాయిల లెక్క తేలకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. సుమారు రూ. 1,200 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు తన్హా పేర్కొనగా బకాయిలు రూ. 600 కోట్లేనని ఆరోగ్యశ్రీ అధికారులు చెప్పడంతో చర్చలు అర్ధంతరంగానే ముగిశాయి. ఈ ప్రతిష్టంభన కారణంగా గత ఐదు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం నుంచి సోమవారం వరకూ ఐదు రోజులపాటు సమ్మె కొనసాగింది. వేల మంది రోగులు ఇబ్బంది పడ్డారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top