‘దిశ’ నిర్దేశం నగరం నుంచే!

DR Karthikeyan Special Story on Disha Case - Sakshi

‘సుప్రీం’ నియమించిన విచారణ కమిషన్‌లో కార్తికేయన్‌

గతంలో సిటీలోని సీఆర్పీఎఫ్‌ ఐజీగా పనిచేసిన వైనం

హైదరాబాద్‌ కేంద్రంగానే రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు

సాక్షి, సిటీబ్యూరో:దిశ’ కేసులో కీలక పరిణామమైన చలాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు గురువారం ముగ్గురు సభ్యులతో కూడిన ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌.వీఎస్‌ సిర్పుర్‌కార్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌. రేఖా బల్దౌతాలతో పాటు సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌లతో కూడిన ఈ బృందం హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తుందని, ఆరు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ట్రైమెన్‌ కమిషన్‌లో ఒకరైన కార్తికేయన్‌ గతంలో సిటీలోని సీఆర్పీఎఫ్‌ యూనిట్‌ ఐజీగా పని చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించారు. అప్పట్లో ఈ దర్యాప్తునూ హైదరాబాద్‌ కేంద్రంగానే నిర్వహించారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో మానవబాంబు థాను దుశ్చర్యకు రాజీవ్‌ గాంధీ మృతి చెందారు. అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్‌ భీష్మనారాయణ్‌ సింగ్‌ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ  కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆ నేపథ్యంలో ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించే బాధ్యతలను ఐపీఎస్‌ అధికారి డీఆర్‌ కార్తికేయన్‌కు అప్పగించారు. అప్పట్లో కార్తికేయన్‌ సెంట్రల్‌ సర్వీసెస్‌లో ఉండి చంద్రాయణగుట్ట కేంద్రంగా పని చేసే సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)కు నేతృత్వం వహిస్తున్నారు. 1991 మే 22న అప్పటి సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేపీఎస్‌ గిల్, సీబీఐ డైరెక్టర్‌ విజయకరణ్‌ ఆయనకు ఫోన్‌ చేసి, సిట్‌కు నేతృత్వం వహించమని కోరారు. అనంతరం కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడంతో కార్తికేయన్‌ బాధ్యతలు స్వీకరించారు.

సిట్‌ కోసం చెన్నైలోని ‘మల్లిగై’ భవనాన్ని తమిళనాడు ప్రభుత్వం కేటాయించినా కార్తికేయన్‌ మాత్రం హైదరాబాద్‌ను విడిచిపోవాలని భావించలేదు. అందుకే సీఆర్‌పీఎఫ్‌ హైదరాబాద్‌ ఐజీగా కొనసాగేలా ఉత్తర్వులు పొందారు. అంతే కాకుండా, రాజీవ్‌గాంధీని హత్య చేయడానికి రంగంలోకి దిగిన ఎల్‌టీటీఈ బృందం శ్రీలంకలో ఉన్న ఆ సంస్థ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌ అనుచర గణంతో ప్రైవేట్‌ రేడియోలకు సంబంధించిన వైర్‌లెస్‌ల ద్వారా సంప్రదింపులు జరిపేవారు. ఇవన్నీ పూర్తిగా కోడ్‌ భాషలో ఉండేవి. హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ పరారీలో ఉన్న కీలక నిందితులు శివరాసన్, శుభలను పట్టుకోవాలంటే వారు వినియోగిస్తున్న రేడియో స్టేషన్‌ ఉనికిని కనిపెట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సంస్థలతో పాటు హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ రీసెర్చ్‌ లేబొరేటరీస్‌కు చెందిన నిపుణులను చెన్నై తీసుకెళ్లారు. మరోపక్క రేడియో సిగ్నల్స్‌ను గుర్తించడానికి అవసరమైన హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ రిసీవర్‌లను సైతం హైదరాబాద్‌ నుంచే ఖరీదు చేసింది. 1991 మే లో సిట్‌కు సారథ్యం వహించిన తర్వాత కొన్ని నెలల పాటు హైదరాబాద్‌లోని తన కార్యాలయం, కుటుంబం వద్దకు రావడం మర్చిపోయిన కార్తికేయన్‌ ఆగస్టులో ఒకసారి వచ్చారు. అప్పుడే సిట్‌ బలగాలు శివరాసన్, శుభ తదితరుల ఆచూకీ కనుగొన్నాయి. చెన్నై సహా పలు ప్రాంతాల్లో తిరిగిన వీరు బెంగళూరు చేరుకున్నారు.

అక్కడి కోననకుంటెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రహస్య స్థావం ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై సిట్, ఎన్‌ఎస్‌జీ బలగాలు దాడికి ఉపక్రమించడంతో అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు కార్తికేయన్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయినా... నిందితులు సైనైడ్‌ వినియోగించడంతో సజీవంగా చిక్కలేదు. ఆ కేసు దర్యాప్తులో సిట్‌ వందల సంఖ్యలో భౌతిక సాక్ష్యాలను సేకరించింది. వీటిలో అనేకం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌)కు వచ్చాయి. వీటిని విశ్లేషించిన నిపుణులు చార్జ్‌షీట్‌ దాఖలుకు అవసరమైన నివేదికలు అందించారు. మరోపక్క మానవబాంబుగా మారి ఛిద్రమైపోయిన థాను శరీర భాగాలుగా అనుమానించిన తల, ఎడమ చేయి, రెండు తొడలు, కాళ్లు, మరికొన్ని చర్మపు ముక్కలను నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి పంపించారు. ఇక్కడి నిపుణులు పరీక్షలు పూర్తి చేసి అవి ఒకే వ్యక్తికి చెందినవిగా నిర్థారించారు. అనేక నివేదిక ఆధారంగా సిట్‌ అధికారులు 1992 మే 20న పది వేల పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ తతంగం మొత్తం పూర్తయ్యే వరకు కార్తికేయన్‌ హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్‌ ఐజీగానే ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top