పైసామే అడ్మిషన్‌..!

Demsnding Bribe In Engineering College Satavahana university - Sakshi

సాక్షి , శాతవాహనయూనివర్సిటీ(కరీంగనర్‌): ఇంజనీరింగ్‌ ప్రవేశాల తీరును చూస్తే ఇంజినీరింగ్‌ విద్య ఇంతకు దిగజారిందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఏ మాత్రం నాణ్యత ప్రమాణాలు చూడని కొందరు తల్లిదండ్రులు, విద్యార్థుల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతోంది. ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రవేశాల కోసం దిగజారుడుతనం ప్రదర్శించి ప్రవేశాలను ‘కొని’ తెచ్చుకుంటున్నాయని తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క అడ్మిషన్‌కు అభ్యర్థులకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తూ వీటితోపాటు రూ.10 వేలు నగదును కూడా నజరానాగా అందిస్తున్నట్లు దూమారం రేగుతోంది. కొన్ని కళాశాలలు ఎంసెట్‌ ఫలితాలు రాకముందు నుండే ఇంటర్‌ విద్యార్థుల కోసం గాలించి వివిధ రకాల ఆఫర్లను ఇచ్చి ప్రవేశాలు తీసుకొవాలని వ్యూహం పన్నాయి.

గత సంవత్సరం ప్రవేశాల కంటే ఈ సంవత్సరం ఎలాగైనా మెరుగైన విధంగా సీట్లు నింపుకోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచే రంగం సిద్ధం చేసుకొని ప్రత్యేకంగా ప్రవేశాల కోసం పీఆర్‌వోలు, మధ్యవర్తులు, అధ్యాపకులను కేటాయించుకొని అక్రమాలకు ఒక వ్యవస్థ ఏర్పర్చుకున్నాయి. వీరందరికీ ముందుగానే ప్రవేశానికి కొంత మొత్తం చొప్పున ముందుగానే డీల్‌ కుదుర్చుకున్నాయి. ఇంకేముంది వారు సంపాదనే ధ్యేయంగా విద్యార్థుల వేటలోపడి  కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన ఆఫర్లను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించి వారిని ప్రలోభపెట్టి అక్రమంగా ప్రవేశాలు సంపాదించుకుంటున్నాయని గత నాలుగు రోజులుగా సోషల్‌మీడియాల్లో, బయట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రవేశాల విషయంలో పలు ప్రైవేటు కళాశాలల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొనడంతో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రవేశాలు సంపాదించడం చూస్తుంటే ఇంజినీరింగ్‌ కోర్సు ఇంతటికి దిగజారిందా అని విద్యారంగ నిపుణులు వాపోతున్నారు.  

మొదటి విడతలో 46 శాతమే...
మొదటి విడత ఇంజినీరింగ్‌ ప్రవేశాల తీరును పరిశీలించినట్లయితే ఇంజినీరింగ్‌ కోర్సుకు డిమాండ్‌ తగ్గిందా అనే సందేహం  కలుగక మానదు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 46 శాతం సీట్ల భర్తీ జరగగా ఊహించని రీతిలో ప్రముఖ కళాశాలలకు కూడా షాక్‌ తగిలేలా సీట్ల కేటాయింపు జరిగింది. జిల్లా వ్యాప్తంగా 13 ఇంజినీరింగ్‌ కళాశాలలుండగా ఇందులో 2 ప్రభుత్వ కళాశాలలు, 11 ప్రవేట్‌ కళాశాలలున్నాయి. అన్ని కళాశాలల్లో కలుపుకొని 3,025 కన్వీనర్‌ కోటా సీట్లున్నాయి. కాగా మొదటి దశలో కోర్సుల వారిగా చూసినట్లయితే సివిల్‌ 368 సీట్లకు 125, సీఎస్‌ఈలో 777 సీట్లకు 707, ఈసీఈలో 882 సీట్లకు 368, ఈఈఈలో 662 సీట్లకు 146, మెకానికల్‌లో 336 సీట్లకు 43 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 3,025 సీట్లకు 1,389 సీట్లు భర్తీ కాగా 46 భర్తీ శాతం నమోదైంది. ఇందులో రెండు ప్రభుత్వ కళాశాలల్లో నూటికి నూరు శాతం సీట్ల భర్తీ జరుగగా 90 శాతం ఒక కళాశాల, 60–70 శాతం ఒక కళాశాల, 40–60 శాతం 03 కళాశాలలు, 30–40 శాతం 05 కళాశాలలు, 0–5 శాతం వరకు ఒక కళాశాలల్లో సీట్ల భర్తీ శాతాలు నమోదయ్యాయి.

పోటాపోటీగా ఆఫర్లు...
ఇంజినీరింగ్‌ రెండవ దశ సర్టిఫికెట్‌ స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి 26న వెరిఫికేషన్‌ ముగిసింది. మొదటి దశలో జిల్లాలోని కళాశాలల్లో నిరాశనే మిగిల్చినా పలు ప్రవేట్‌ కళాశాలలు రెండవ దశలో సీట్ల భర్తీ శాతాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకొని ఇష్టారాజ్యంగా ఆఫర్లు కుమ్మరిస్తున్నాయని తెలుస్తోంది. వెబ్‌ఆప్షన్లకు నేటి వరకు ఉండడంతో విద్యార్థుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. పోటాపోటీగా విద్యార్థుల వద్దకు వారి కళాశాలలు ఇస్తున్న ఆఫర్లు చెబుతూనే  ఒక కళాశాల మీద మరొక కళాశాల వారు ఆరోపణలు చేసుకోవడం జరుగుతోందని తెలిసింది. కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు మొదటి దశలో కూడా ప్రలోభాలతోనే ప్రవేశాలు ‘కొని’ తెచ్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది.

రెండద దశలో సైతం ఇలాంటి పద్ధతిలోనే ప్రవేశాలు సంపాదించుకోవడానికి ప్రణాళికతో పనిచేసినట్లు ప్రచారం. విద్యార్థులకు చాలా మంది ఏ కళాశాలలో బాగుంటుందో ఏ కళాశాలలో చేరాలనే విషయంలో స్పష్టత ఉండదు కాబట్టి వారి తల్లిదండ్రులు కళాశాలల చరిత్ర క్షుణ్ణంగా, స్వయంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలు, క్యాంపస్‌ ఇంటర్వూలు, అన్ని విషయాలు ఆయా కళాశాలల్లో చదువుతున్న సీనియర్లను అడిగి తెలుసుకొని చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కానీ మొదటి దశలో మెరుగ్గా ఉన్న కళాశాలలు వారి ప్రవేశాలు పోకుండా జాగ్రత్తపడగా , తక్కువ సీట్లతో నిరాశకు చెందిన వారు సీట్లు నిండడానికి వివిధ మార్గాలను ఆశ్రయించినట్లు సమాచారం. రెండవ దశ సీట్లు కేటాయింపు ఈ నెల 29న ఉండడంతో అదే రోజు ఏయే కళాశాలల ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయో తెలుస్తుంది.   

కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల పలు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు అడ్డదారిలో అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంటు దోచేయాలనే దురుద్దేశంతో విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తూ ఒక్కో అడ్మిషన్‌కు 10 వేల వరకు చెల్లిస్తున్నాయి. కళాశాలలోని వివిధ రకాల ఫీజులు, కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజుకు అదనంగా కావాల్సిన ఫీజును కళాశాలల వారే భరించుకొని విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకొని  ప్రవేశాలు చేపడుతున్నారు. బీటెక్‌ పూర్తయ్యే వరకు ఎలాంటి ఫీజులు అడగబోమని బాండ్లు కూడా ఇస్తున్నారు. అక్రమంగా ప్రవేశాలు చేపడుతున్న కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– సిరిశెట్టి రాజేశ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top