21 డేస్‌..ఫిక్స్‌!

Deamd To Approved In GHMC Building Constructions Approved - Sakshi

జీహెచ్‌ఎంసీలో ‘డీమ్డ్‌ టు అప్రూవ్డ్‌’

భవన నిర్మాణ అనుమతులు సరళతరం

తప్పనిసరిగా 21 రోజుల్లోనే అనుమతి

జాప్యం జరిగితే ‘అనుమతించినట్టే’ లెక్క  

సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో అధికారులు

త్వరలో రాష్ట్రమంతటా అమలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో నివసించే ప్రవీణ్‌రెడ్డి.. తన భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి ఇతడికి 21 రోజుల్లో అనుమతులు రావాలి. కానీ నలభై రోజులు దాటినా అప్రూవల్‌ మాత్రం రాలేదు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు నగర వ్యాప్తంగా వేలల్లోనే ఉన్నారు. 

భవన నిర్మాణానికి 21 రోజుల్లోనే అనుమతులు జారీ చేస్తున్నట్లు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఆ మేరకు జీఓ కూడా జారీ చేశారు. కానీ వాస్తవంగా గ్రేటర్‌లో అమలు కావడం లేదు. నిర్ణీత వ్యవధి (21 రోజులు)లోగా అనుమతి రాకుంటే.. అనుమతించినట్లే భావించవచ్చుననే (డీమ్డ్‌ టు అప్రూవ్డ్‌) నిబంధన ఉన్నా అదీ అమలు కావడం లేదు.   గ్రేటర్‌లో నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారి సమస్యను పరిష్కరించేందుకు  అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం 21 రోజుల్లో అనుమతి రానివారి దరఖాస్తుకు సంబంధించి అన్ని పత్రాలు, ప్లాన్‌ సక్రమంగా ఉంటే అనుమతించినట్టు (డీమ్డ్‌ టు అప్రూవ్డ్‌)గా పరిగణించే కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందస్తున్నారు. వాస్తవానికి భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ, తదితరమైనవి ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతున్నా.. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 21 రోజుల్లో అనుమతులు జారీ కావడం లేదు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోను ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 21 రోజుల్లోగా అనుమతి రానివారు ‘డీమ్డ్‌ టు అప్రూవ్డ్‌’ అవకాశాన్ని వినియోగించుకునేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు.

కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చాక.. 21 రోజుల్లోగా అనుమతి జారీ కాని పక్షంలో సిస్టమ్‌ నుంచే ‘ఆటోమేటిక్‌’గా మెసేజ్‌ వెళుతుంది. ‘నిర్ణీత వ్యవధిలోగా మీ దరఖాస్తు పరిష్కారం కాలేదు. డీమ్డ్‌ టు అప్రూవ్డ్‌ అవకాశాన్ని వినియోగించుకోదలచుకుంటున్నారా’.. అనే సందేశంతో మెసేజ్‌ వెళ్తుంది. అందుకు వారు ఆన్‌లైన్‌లో ‘అవును’ అని సమాధానమిస్తే నిర్ణీత ఫారం ప్రత్యక్షమవుతుంది. దాంట్లో తాను నిబంధనల మేరకు దరఖాస్తు చేసినట్లు, ప్లాన్, లాండ్‌యూజ్‌ తదితర విషయాలన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ప్రస్తుతం డీపీఎంఎస్‌ విధానంలో భాగంగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను స్వీకరిస్తుండగా, ప్లాన్‌లో ఏవైనా లోపాలుంటే తిరిగి సరిచేయాల్సి రావడంతో జాప్యం జరుగుతోంది. దాన్ని నివారించేందుకు కూడా ‘ప్రీ ఆటో డీసీఆర్‌’ ద్వారా ప్లాన్‌ను సబ్‌మిట్‌ చేయకముందే.. సిస్టమ్‌ నుంచే ప్లాన్‌ సక్రమంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌ అప్లికేషన్‌నూ అందుబాటులోకి తేనున్నారు. దాంతో, ప్లాన్‌ సరిగ్గా ఉన్నదీ, లేనిదీ దరఖాస్తు చేసేముందే తెలుసుకోవచ్చు.

గతంలోనూ ‘డీమ్డ్‌ టు అప్రూవ్డ్‌’ నిబంధన ఉన్నప్పటికీ, మాన్యువల్‌ పద్ధతిలో అనుమతులిచ్చే విధానం వల్ల అధికారులు ఆడింది ఆటగా సాగేది. డీమ్డ్‌ టు అప్రూవ్డ్‌  సదుపాయాన్ని వినియోగించుకునేందుకు నోటీసు ఇచ్చిన దరఖాస్తుదారుకు ప్లాన్‌ సరిగ్గా లేదనో, మరేదైనా పత్రం సమర్పించలేదనో తిరకాసు పెట్టేవారు. దాంతో ఆ నిబంధన అమలైన దాఖాలాల్లేవు. ప్రస్తుతం ప్లాన్‌లో లోపాలను కంప్యూటరే ముందుగా పసిగడుతుంది కనుక లోపాలున్నట్లు చెప్పడం కుదరదు. నిర్ణీత ఫారాన్ని భర్తీ చేశాక, అధికారులు రెండు మూడు రోజుల్లోగా పూర్తి ఫీజు చెల్లించాల్సిందిగా సమాచారం పంపిస్తారు. ఈ లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేస్తారు. ఫీజు చెల్లింపు జరగ్గానే అనుమతి జారీ అవుతుంది. దరఖాస్తు జాప్యానికి కారకుడైన అధికారికి రోజుకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించి జీతం నుంచి వసూలు చేస్తారు. సదరు  దరఖాస్తు వెంటనే మరో అధికారికి బదిలీ అవుతుందని, క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ఎస్‌.దేవేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.ఈ విధానం కేవలం జీహెచ్‌ఎంసీకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నట్టు వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top