కేసీఆర్‌ మారకపోతే.. గద్దెదించుతాం | CPM Leader Tammineni Veerabhadram Fires on CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మారకపోతే.. గద్దెదించుతాం

Mar 6 2017 3:55 AM | Updated on Aug 14 2018 11:02 AM

ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ వైఖరి మారకపోతే ప్రజా పోరాటాలు నిర్వహించి ఆయన్ను గద్దె దించుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

హాలియా/నిడమనూరు : ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ వైఖరి మారకపోతే ప్రజా పోరాటాలు నిర్వహించి ఆయన్ను గద్దె దించుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారం మండలంలోని ముకుందాపురం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిడమనూరు, హాలియాలో నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.

 హామీలను అమలు చేయని కేసీఆర్‌కు పరిపాలించే అర్హత లేదన్నారు. ప్రజలను చైతన్యం చేస్తూ సీపీఎం నిరంతరం సామాజిక ఉద్యమాలు చేస్తుందన్నారు. ఈ ఉద్యమాల్లో అన్ని పార్టీలనూ భాగ్యసామ్యులను చేస్తామన్నారు. సమాజంలో 93 శాతం ఉన్న ప్రజలను కాదని, కేవలం మూడు శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లోనే పాలనా పగ్గాలు ఉండడం సిగ్గుచేటన్నారు. సామాజిక చైతన్య పాదయాత్ర భయంతో సీఎం కేసీఆర్‌ నేడు కులాల వారీగా రుణాలను ఇస్తానని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.9800 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించిందని, ఇందులో రూ.7800కోట్లు మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్‌లకు రూ.వెయ్యి కోట్లు రవాణ, మరో రూ.వెయ్యి కోట్లు జలయజ్ఞం పాలు చేశారని వివరించారు.

 బీసీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకొచ్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం పాదయాత్రతో సీఎం కేసీఆర్‌లో వణుకు ప్రారంభమైందని, మార్చి 19న హైదరాబాద్‌లో నిర్వహించే ‘పొలికేక’ బహిరంగ సభ ఈ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం వస్తే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించాడని విమర్శించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కనీసం సాగునీరు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ (మాధవరెడ్డి ప్రాజెక్ట్‌) హైదరాబాద్‌కు తాగునీరు అందించే ప్రాజెక్ట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జాన్‌వెస్లీ, ఎంవీ.రమణరాజు, ఎండీ.అబ్బాస్, రమ, ఆశయ్య, శోభన్‌నాయక్, కొదమగుండ్ల నగేష్, రాజు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, చినపాక లక్ష్మినారాయణ, కత్తి లింగారెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, బాబూరావ్‌నాయక్, పొదిల శ్రీనివాస్, కుందూరు వెంకట్‌రెడ్డి, భగవాన్‌నాయక్, మువ్వా అరుణ్‌కుమార్, జవ్వాజి వెంకటేశం, కనకరాజ్‌సామ్యేల్, నసీరుద్దీన్, కోనాల శివయ్య, కత్తి శ్రీనివాసరెడ్డి, శంకర్‌నాయక్, కోమండ్ల గుర్వయ్య, వెంకన్న, నల్లమోతు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement