జబ్బు చిన్నది.. బిల్లు పే..ద్దది | Corporate hospitals Collecting too much of money in the name of Medical Tests | Sakshi
Sakshi News home page

జబ్బు చిన్నది.. బిల్లు పే..ద్దది

Apr 30 2018 1:36 AM | Updated on Oct 9 2018 7:52 PM

Corporate hospitals Collecting too much of money in the name of Medical Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటి నొప్పో.. కాలి నొప్పో.. కడుపు నొప్పో.. ఏదీ వచ్చినా భయంతో వెంటనే ఆస్పత్రికి పరిగెడతాం. రోగులకు ఉండే ఈ భయాన్నే కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. వైద్యులకు టార్గెట్లు విధించి అవసరం లేకపోయినా పరీక్షలు చేయిస్తున్నాయి. సాధారణ జ్వరం, తలనొప్పితో బాధపడుతూ వెళ్లినా సీబీపీ, సీయుఇ, ప్లేట్‌లెట్‌ కౌంట్స్, సీటీ, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు చేయిస్తున్నాయి. ఆ పరీక్షలను తమ ఆస్పత్రిలోనే చేయించుకోవాలంటూ మెలికపెడుతున్నాయి. అప్పటికే బయటి డయాగ్నస్టిక్స్‌లో పరీక్షలన్నీ చేయించుకున్నా.. ఆస్పత్రిలో మళ్లీ చేయించుకోవాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. ఓ సాధారణ డయాగ్నస్టిక్స్‌లో సీబీపీ (కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌)కి రూ.100 లోపే తీసుకుంటుండగా, కార్పొరేట్‌లో దాదాపు రూ.550 వరకు వసూలు చేస్తున్నారు.

ఇక ఛాతి ఎక్సరేకు రూ.150 ఖర్చవుతుండగా, కార్పొరేట్‌లో రూ.550 పైనే చార్జి చేస్తున్నారు. ఎంఆర్‌ఐ బ్రెయిన్‌ టెస్ట్‌కు నిమ్స్‌లో రూ.5,500 చార్జి చేస్తుండగా, కార్పొరేట్‌లో రూ.8,500 నుంచి రూ.12 వేల వరకు తీసుకుంటున్నారు. నిజానికి గత పదేళ్లతో పోలిస్తే నగరంలో డయాగ్నస్టిక్‌ సెంటర్ల సంఖ్యతో పాటు వైద్యపరికరాల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆ మేరకు వైద్య పరీక్షల ధరలు తగ్గకపోగా, మరింత పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఒకే టెస్టు..ఒకే యంత్రం.. కానీ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ధరల్లోనే వ్యత్యాసం కన్పిస్తోంది. ’రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ తాము మాత్రం ఏమి చేయగలం. ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్నాం. వారి నుంచి లక్షల్లో ప్యాకేజీలు తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని జూబ్లిహిల్స్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

రాయితీలు పొంది ఉచిత సేవలు విస్మరించారు... 
నగరంలోని పలు కీలక కార్పొరేట్‌ ఆస్పత్రులకు భూములను ప్రభుత్వమే సమకూర్చింది. మార్కెట్‌ ధరతో పోలిస్తే చాలా తక్కువకే వీటిని అప్పగించింది. ఇందుకు ప్రతిఫలంగా ఉపాధి, తక్కువ ఖర్చుకే మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు అప్పట్లో ఆయా ఆస్పత్రులు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే, తదితర మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. ఇలా రాయితీ పొందిన వారు ఆస్పత్రుల్లో 20 శాతం పేదలకు ఉచిత సేవలు అందించాల్సి ఉన్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. రోగ నిర్ధారణ ఖర్చులను నియంత్రించాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తోంది. 

నిజానికి ఆస్పత్రులతో పాటు రోగుల నిష్పత్తి, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్‌ వంటి యంత్రాల సంఖ్య పెరిగినప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు తగ్గాలి. కానీ గత పదేళ్లతో పోలిస్తే ఆస్పత్రుల నిర్వహణ వ్యయం రెట్టింపైంది. వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్‌ స్టాఫ్, టెక్నీషియన్ల వేతనాలు తదితర ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ వ్యయ భారాన్ని రోగులపై మోపక తప్పడం లేదు.    – తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ
 హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ 

మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు వైద్యాన్ని వైట్‌ కాలర్‌ వ్యాపారంగా మార్చేశాయి. ఎంబీబీఎస్‌ సీటు కోసం, కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వహణకు చేస్తున్న రూ.కోట్ల ఖర్చునంతా రోగులపై రుద్దుతున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
– డాక్టర్‌ పల్లం ప్రవీణ్, తెలంగాణ వైద్యుల సంఘం

తరచూ తలనొప్పి వస్తుండటంతో వైద్యుడికి చూపించుకుందామని హిమాయత్‌ నగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాను. మెదడులో రక్తం గడ్డకట్టి ఉంటుందని ఎంఆర్‌ఐ చేసి రూ.8,500 తీసుకున్నారు. రిపోర్టు వచ్చాక ఏమీ లేదని చెప్పి.. సాధారణ తలనొప్పి మాత్రలు రాసి పంపారు.    
– శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్‌

వారం రోజుల క్రితం జ్వరం వచ్చింది. మలక్‌పేటలోని ఓ ఆస్పత్రిలో చేరాను. డెంగీ జ్వరమని చెప్పి, రకరకాల పరీక్షలు చేశారు. తీరా రిపోర్టులో వైరల్‌ ఫీవర్‌ అని వచ్చింది. వైద్య పరీక్షలు, చికిత్సల పేరుతో రెండు రోజులకు రూ.23 వేలు వసూలు చేశారు.
– మహ్మద్‌ రఫీ, చంచల్‌గూడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement