‘మెట్రో’ అదనపు భారం ఎవరిది?

Construction cost of hyderabad metro rail - Sakshi

ఆలస్యం 18 నెలలు.. 

ఇప్పటివరకు అయిన ఖర్చు (సుమారుగా) 13 వేల కోట్లు

అదనపు భారం 4 వేల కోట్లు

పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తే రెండో విడత అమీర్‌పేట్‌–రాయదుర్గం (11 కి.మీ.), అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ (16 కి.మీ.) మార్గంలో చేపట్టిన పనులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

సాక్షి, హైదరాబాద్‌ : కలల మెట్రో రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. తొలివిడతగా 30 కి.మీ. మార్గంలో పరుగులు పెడుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంఆస్తుల సేకరణ, అలైన్‌మెంట్‌ ఖరారు, పనులు చేపట్టేందుకు వీలుగా ప్రధాన రహదారుల్లో రైట్‌ ఆఫ్‌ వే సమస్యలతో మొత్తం 66 కి.మీ. మార్గం పూర్తికి 18 నెలలు అదనంగా సమయం పడుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం 2017 జూన్‌ నాటికి పూర్తికావాల్సిన ప్రాజెక్టు 2018 డిసెంబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి.

ఈ జాప్యం కారణంగా నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీపై సుమారు రూ.4 వేల కోట్లు అదనంగా భారం పడుతున్నట్లు తెలిసింది. ఈ భారాన్ని ప్రభుత్వం తమకు చెల్లించాలని నిర్మాణ సంస్థ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖపై ప్రభు త్వం ఎటూ తేల్చలేదు. దీంతో నిర్మాణ సంస్థ డోలాయమానంలో పడినట్లు సమాచారం. జీఎస్టీ ఎఫెక్ట్‌.. పెరిగిన వడ్డీల భారం... మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు వెరసి కంపెనీకి ఆర్థికంగా భారంగా మారినట్లు తెలిసింది. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తే రెండో విడత అమీర్‌పేట్‌–రాయదుర్గం (11 కి.మీ.), అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ (16 కి.మీ.) మార్గంలో చేపట్టిన పనులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

పెరిగిన భారం ఇలా..
మెట్రో నిర్మాణ ఒప్పందం ఖరారైన 2010 సెప్టెంబర్‌లో ప్రాజెక్టును రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. కానీ అసెంబ్లీ, పాతనగరం, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో అలైన్‌మెంట్‌ మార్పుపై ప్రభుత్వం అనేకమార్లు తర్జనభర్జనలు చేసి స్పష్టతను ఇవ్వకపోవడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం మరో రూ.4 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు తెలిసింది.

ఇప్పటికే నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు.. కేంద్రం సర్దుబాటు నిధి కింద రూ.1,458 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల సేకరణకు మరో రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిచేశాకే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకయిన ఖర్చును ప్రజల ముందు పెడతామని ప్రభుత్వ పెద్దలు ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని ఎవరు భరిస్తారన్న అంశం సస్పెన్స్‌గా మారింది.

ఐదేళ్లు మెట్రోకు నష్టాల బాటే...?
గ్రేటర్‌వాసుల కలల మెట్రో పరుగులు పెడుతున్నా.. మరో ఐదేళ్లు నష్టాల బాట తప్ప దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరో సంవత్సరం నుంచి నష్టాల నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా మెట్రో ప్రాజెక్టుకు అయిన వ్యయాన్ని 50% ప్రయాణికుల చార్జీలు, మరో 45% వాణిజ్య స్థలాలు, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులు (ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌–టీఓడీ), మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా 45 ఏళ్లపాటు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిర్మాణ ఒప్పం దం ప్రకారం ఈ గడువును మరో 20 ఏళ్లపాటు పొడిగించుకోవచ్చు.

అయితే ముందుగా అనుకున్నట్లు ప్రభుత్వం నిర్మాణ సంస్థకు కీలక ప్రాంతా ల్లో కేటాయించిన 269 ఎకరాల స్థలంలో 18 మాల్స్‌ నిర్మించి 60 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలాలను నిర్మించాలనుకున్నారు. కానీ ప్రస్తుతానికి పంజాగుట్ట, హైటెక్‌ సిటీల్లో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే మాల్స్‌ ఏర్పాటయ్యాయి. వీటిని ఈ నెలలో ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఇక మూసారాంబాగ్, ఎర్రమంజిల్‌ మాల్స్‌ను వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తారు. మరో 10 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. అయితే నిర్మాణ సంస్థ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆశించిన మేర ఆదాయం లభించడం లేదన్నది స్పష్టమౌతోంది. నగరంలో మెట్రో ప్రయోగం విఫలమౌతుందా..? సఫలమౌతుందా అన్న అంశం ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top