అదే పరేషన్! | concern on food security scheme | Sakshi
Sakshi News home page

అదే పరేషన్!

Dec 25 2014 10:59 PM | Updated on Oct 2 2018 8:49 PM

కొత్త సంవత్సరంలోనూ పాత ప‘రేషానే’ పునరావృతం అయ్యేటట్టుంది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కొత్త సంవత్సరంలోనూ పాత ప‘రేషానే’ పునరావృతం అయ్యేటట్టుంది. కార్డు మీద గరిష్టంగా 20కిలోల బియ్యమిచ్చే పాత పద్ధతికి పాతరేసి.. పత్రీసభ్యునికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ  చేసే సరి కొత్త పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరం మెదటి వారం నుంచే ఆహార భద్రత కార్డులిచ్చి నిరుపేదల కడుపు నింపుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆహార భద్రత పథకం కింద కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది.

దీనిలో భాగంగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను, అర్హులను గుర్తింపు పనులను దాదాపు పూర్తి చేశారు.. కానీ రేషన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసే పని మాత్రం ముందుకు కదలట్లేదు. రేషన్ కార్డుతో ఆధార్ సీడింగ్ పూర్తి అయినప్పుడే ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 50 శాతం అనుసంధానం కూడా పూర్తి కాలేదు. క్షేత్రస్థాయిలో ఆధార్ సీడింగ్ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. దీనికి సాంకేతిక సమస్యలు తోడవుతున్నాయి. ఇప్పటికే గత రెండు మాసాలుగా పాత కార్డుదారుల్లో ఆధార్ లేని వారికి రేషన్ ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో బియ్యం సరఫరాపై అయోమయం నెలకొన్నది. 

కుప్పలు తెప్పలు...
రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డులు రద్దు చేసింది. వాటి స్థానంలో ఆహార భద్రత పథకం కింద తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి నిశ్చయించింది. దీనికోసం 8.39 లక్షల దరఖాస్తులు అందాయి. సవరించిన నిబంధనల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు ఆదాయం, 7.5 ఎకరాల మెట్ట, 3.5 ఎకరాల మాగాణికి మించకుండా ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించారు.

వీటి ఆధారంగా క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, ఈఓఆర్‌డీలు పరిశీలన జరిపి అర్హులను ఎంపిక చేస్తున్నారు. వచ్చినవాటిలో ఇప్పటివరకు 8.30 లక్షల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వీటిలో 6,64,219 మందిని అర్హులుగా తేల్చారు. అంటే ఇప్పటివరకు పరిశీలించిన వాటిలో 90 శాతం మంది అర్హులేనని తేలారన్నమాట.

షెడ్యూల్ ఇదీ...
ఆహారభద్రత కార్డుల మంజూరుకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా స్థానిక అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 24 కల్లా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని, 26న గ్రామాల్లో ముసాయిదా జాబితాలను ప్రకటించాలని  అధికారులకు సూచించారు. అనంతరం 27, 28 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించి, 29,30 తేదీల్లో పరిశీలన చేసి 31న తుది జాబితాను ప్రచురిస్తారు.

అనంతరం ఒకటో తేదీ నుంచి అర్హులైన వారికి రేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి కూపన్ల ద్వారా రేషన్ ఇస్తామని.. మరో నెల తర్వాత కార్డులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేస్తామని, గతంలో నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోలేని వారు మళ్లీ అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లబ్ధిదారుల పేర్లను ఈపీడీఎస్ పోర్టల్‌లో నమోదు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement