టికెట్ల ధరలు టూమచ్‌ గురూ..!

Common people cant reach Metro ticket rates - Sakshi - Sakshi

సగటు జీవికి భారంగానే మెట్రో రైలు టికెట్‌ ధరలు

కనిష్టం రూ.10, గరిష్టం రూ.60

ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ చార్జీలతో పోలిస్తే ఎక్కువే..

నాగోల్‌– అమీర్‌పేటకు ఆర్డినరీ బస్‌ చార్జి రూ.17, మెట్రోలో రూ.45

మియాపూర్‌–అమీర్‌పేట ఆర్డినరీ బస్‌ చార్జి రూ.15 మెట్రోలో రూ.40

ఎంఎంటీఎస్‌లో మినిమమ్‌ రూ.5, మాగ్జిమమ్‌ రూ.10

ఏసీ బస్సుకంటే కాస్త నయం పనివేళలపై జనం అసంతృప్తి

తొలి మూడు నెలలు ఉ.6 గంటల నుంచి రాత్రి 10 వరకే...

ఆ తర్వాత ఉ.5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు..

రాత్రి విధులు నిర్వహించే వారికి ఉపయోగం తక్కువే...

కలల మెట్రోలో హాయిగా ప్రయాణించాలని ఆశిస్తున్న సిటీజనులకు చార్జీలు కొంత నిరాశ కలిగించాయి. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో కంటే మెట్రో రైళ్లలో జర్నీ కాస్త భారమే. కనీస చార్జీ రూ.10, గరిష్టంగా రూ.60 చార్జీలు ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆల్పాదాయ, మధ్యతరగతి ఉద్యోగులు, చిరు వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు రైళ్ల వేళలు కూడా మార్చాలని కోరుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో : మెట్రోరైలు చార్జీలు గ్రేటర్‌లో సగటుజీవికి భారంగానే పరిణమించనున్నాయి. గ్రేటర్‌ పరిధిలో 29 ఆర్టీసీ డిపోల్లోని 3850 ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 33 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరందరూ కలల మెట్రో జర్నీ చేయాలనుకుంటే వారి జేబుకు చిల్లు తథ్యం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఉదాహరణకు తొలిదశ మెట్రో మార్గాలను పరిగణనలోకి తీసుకుంటే నాగోల్‌–అమీర్‌పేట్‌ (17కి.మీ)వరకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణిస్తే రూ.17 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే మెట్రో రైలులో అయితే రూ.45 తథ్యం. ఇక మియాపూర్‌–అమీర్‌పేట్‌(13కి.మీ)మార్గంలో ప్రయాణించేవారు ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో బయలుదేరి వెళితే రూ.15 చార్జీ చెల్లించాలి. అదే మెట్రోరైలులో అయితే రూ.40 చెల్లించాలి. ఇక ఎంఎంటీఎస్‌ రైలు చార్జీలతో పోల్చినా మెట్రో చార్జీలు సామాన్యునికి గుదిబండలానే మారాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లలో కనీస చార్జీ రూ.5 ..గరిష్టం రూ.10 కావడం గమనార్హం. అదే మెట్రోలో కనీసం రూ.10..గరిష్టంగా రూ.60 చెల్లించాల్సి రావడం సామాన్యులపై భారం పడుతుందని అల్పాదాయ, మద్యాదాయ, వేతనజీవులు ఆందోళన చెందుతున్నారు.

ఏసీ బస్సు కంటే తక్కువ..
ఆర్టీసీ ఏసీ బస్సు కంటే..మెట్రో జర్నీ చవకే కాదు..సమయం ఆదా కూడా. ఇదెలా అంటారా..మీరు నాగోల్‌ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న అమీర్‌పేట్‌కు ఆర్టీసీ ఏసీ బస్సులో ప్రయాణిస్తే రూ.64 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి సుమారు 50 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. అదే మెట్రోరైలులో అయితే రూ.45 ఛార్జీ చెల్లించి 25 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇక మియాపూర్‌–అమీర్‌పేట్‌(13కి.మీ)మార్గంలో ఏసీ బస్సులో రూ.48 చెల్లించి 45 నిమిషాల్లో గమ్యం చేరవచ్చు అదే...మెట్రోరైలులో కేవలం రూ.40 మాత్రమే చెల్లించి 20 నిమిషాల్లో గమ్యమస్థానం చేరుకునే అవకాశం ఉండడం విశేషం. భారీ వర్షం కురిసి ట్రాఫిక్‌ స్తంభిస్తే ఈ మార్గాల్లో బస్సు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. కాగా  మెట్రో ప్రయాణ చార్జీలను ఎట్టకేలకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రకటించిన నేపథ్యంలో నగరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

మెట్రో జర్నీ ఎవరికి ఉపయోగం..
రోజువారీగా ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారికి మెట్రో జర్నీ చవక ప్రయాణమే కాదు..సమయం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతానికి నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గాల్లోనే మెట్రో అందుబాటులో ఉన్న నేపథ్యంలో మిగతా రూట్లలో తిరిగే వారు యథావిధిగా ఆటోలు, క్యాబ్‌లు ఆశ్రయించాల్సిందే. కాలుష్యం, కుదుపులు లేనిప్రయాణం, ట్రాఫికర్‌ లేకపోవడం మెట్రో జర్నీ ప్లస్‌ పాయింట్లుగా చెప్పొచ్చు.
రాయితీ పాస్‌లు లేనట్టే...
ఇక ఆర్టీసీ బస్సుల్లో స్టూడెంట్స్, ఎన్‌జీఓ, వికలాంగులు, జర్నలిస్టులకు రాయితీ పాస్‌ల విధానాన్ని అమలుచేస్తున్నారు. అయితే మెట్రో రైళ్లలో స్మార్ట్‌కార్డ్, టోకెన్, టిక్కెట్‌ మినహా ఎలాంటి రాయితీ పాస్‌లు అమలులో లేవు. దీనిపై ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.

పనివేళలపై అసంతృప్తి...
ఇక మెట్రో రైలు సర్వీసులు తొలి మూడునెలలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే నడపనున్నారు. ఆతరవాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే నడపనున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీ ఎవరికి ఉపయోగం అన్నది ఆసక్తికరంగా మారింది.

విద్యార్థులు: ఆర్టీసీ జారీచేసే స్టూడెంట్‌ బస్‌పాస్‌లున్నవారు గ్రేటర్‌ పరిధిలో సుమారు ఏడు లక్షల మంది ఉన్నారు.  వీరు నెలకు రూ.130  చెల్లించి బస్‌పాస్‌ కొనుగోలు చేస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మినహా వీరంతా మెట్రో రైలులో రోజువారీగా ప్రయాణించే అవకాశం ఉండదు.

ప్రభుత్వ ఉద్యోగులు: ప్రభుత్వం మంజూరు చేసే ఎన్‌జీఓ పాస్‌ ఉన్నవారు నగరంలో సుమారు 2 లక్షలమంది ఉన్నారు. వీరు నెలకు రూ.750 చెల్లించి పాస్‌ కొనుగోలు చేస్తారు. వీరు కూడా మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించే అవకాశం ఉండదు.

ప్రైవేటు ఉద్యోగులు: గ్రేటర్‌ పరిధిలో సుమారు 35 లక్షల ద్విచక్రవాహనదారులున్నారు. వీరిలో చాలామంది ప్రైవేటు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే. వీరిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ ఉండేవారు చాలా తక్కువే. వీరిలో చాలామందికి అర్థరాత్రి, అపరాత్రి షిఫ్టులుంటాయి. దీంతో వీరిలో చాలామంది ద్విచక్రవాహనానికే మొగ్గుచూపుతారు. ఇక మార్కెటింగ్‌ రంగంలో పనిచేసే వారిదీ ఇదే రూటు.

చిరు వ్యాపారులు: పాలు, కూరగాయలు, నిత్యావసరాలను విక్రయించే వ్యాపారులు భారీ లగేజితో తరలివస్తే మెట్రో జర్నీలో అనుమతించరు. దీంతో వేలాదిమంది వ్యాపారులు ఇతర పనుల నిమిత్తం బయటికి వెళితే తప్ప..వారి వ్యాపార నిమిత్తం మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉండదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top