ఫ్లోరైడ్‌ బాధితుడి ఇంటి నిర్మాణానికి కలెక్టర్‌ హామీ

Collector Assured Construction of Fluoride Victim's Home - Sakshi

డబుల్‌ బెడ్‌రూం నిర్మాణానికి ఆలస్యమవుతుండడంతో స్పెషల్‌ కోటా కింద నిర్మించేందుకు ప్రభుత్వానికి లేఖ

వారం రోజుల్లోగా నిర్మాణ పనులు చేపడతామన్న కలెక్టర్‌ ఉప్పల్‌

గత ప్రభుత్వంలో డబుల్‌ బెడ్‌రూం, కటింగ్‌షాప్‌ ఏర్పాటుకు కేటీఆర్‌ హామీ

నల్లగొండ : ఫ్లోరైడ్‌ బాధితుడు అంశల స్వామికి ఇల్లు నిర్మించేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ హామీ ఇచ్చారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశల స్వామి గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆ సందర్భంలో కేటీఆర్‌ ఏం కావాలని అడగ్గా కటింగ్‌ షాప్‌తో పాటు ఇల్లు మంజూరు చేయాలని కోరడంతో అప్పట్లో కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌కు సూచించారు. వెంటనే అంశల స్వామికి తన ఊరిలో కటింగ్‌షాప్‌ ఏర్పాటు చేసి ప్రారంభించారు.  అయితే డబుల్‌ బెడ్‌రూం విషయంలో మాత్రం ఆలస్యమైంది. ఆ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు.  అంశల స్వామి తనకు ఉన్న ఇల్లు కూలిపోయే దశలో ఉందని, కొత్తగా ఇల్లు నిర్మించాలని కోరాడు. ఈ విషయాన్ని కేటీఆర్‌కు వాట్సప్‌లో పంపగా ఆయన తిరిగి కలెక్టర్‌కు ఆ విషయంపై పరిశీలించాలని సూచించారు. అందుకోసం అంశల స్వామి శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌గౌరవ్‌ ఉప్పల్‌ను కలిశారు.

సొంత స్థలంలోనే ఇంటిని నిర్మించాలని అంశల స్వామి కలెక్టర్‌ను కోరారు. అయితే డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం ప్రభుత్వ స్థలంలోనే నిర్మించాల్సి ఉందని, స్పెషల్‌ కోటా కింద అంశల స్వామికి ఉన్న స్థలంలోనే కొత్తగా ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామన్నారు. అది వచ్చిన వెంటనే అంశల స్వామికి ఇల్లు నిర్మాణ పనులు చేపడతామన్నారు.  వారం రోజుల్లోగా ఆ పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని కలెక్టర్‌ అంశల స్వామికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఈ విషయాన్ని సాక్షికి వివరించారు. స్పెషల్‌ కోటా కింద ప్రభుత్వ అనుమతికి లేఖ రాస్తున్నామని అది వచ్చిన వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top