భవనాలపై ‘భువనాస్త్రం’!

Bhuvan Digital App Capture information Of buildings on mobile phones - Sakshi

అక్రమ నిర్మాణాల గుర్తింపు, ఆస్తి పన్ను మదింపునకు టెక్నాలజీ సాయం

‘భువన్‌’యాప్‌ వాడకం.. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో  ప్రాపర్టీ మ్యాపింగ్‌

జీహెచ్‌ఎంసీ మినహా మిగతా నగర, పురపాలక సంస్థల్లో అమలు

20వ తేదీ నుంచి పూర్తి సమాచార సేకరణ..

సాక్షి, హైదరాబాద్‌ :  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడి విన్నాం కానీ.. ఒకే దెబ్బకు ఆరేడు పిట్టలను కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పురపాలక శాఖలో పారదర్శక పాలనను శాస్త్రీయంగా అమలు చేయాలనే ఉద్దేశంతో నగరాలు, పట్టణాల్లోని భవంతులపై భువనాస్త్రం’ప్రయోగించనుంది. భువన్‌ పేరుతో డిజిటల్‌ యాప్‌ను తయారు చేసి.. పట్టణ ప్రాంతాల్లోని అన్ని భవనాల సమాచారాన్ని మొబైల్‌ ఫోన్లలో బంధించి.. ఆయా భవంతుల నుంచి ఏ శ్లాబ్‌ కింద ఎంత పన్ను వసూలు చేయాలనేది నిర్ణయించనుంది. ప్రతీ భవనాన్ని 360 డిగ్రీల కోణంలో డిజిటలైజ్‌ చేయడం ద్వారా ఏ భవంతికి ఏ శ్లాబ్‌లో ఆస్తి పన్ను, నల్లా చార్జీ విధించాలి.. ఆ భవంతిలో కరెంట్‌ వినియోగాన్ని గృహ, వాణిజ్య అవసరాల కేటగిరీలో చేర్చాలా? ఆయా బిల్డింగ్‌లపై అడ్వర్టైజింగ్‌ చేసుకునేందుకు, సెల్‌ టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయించనుంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, భువన్‌ యాప్‌ ద్వారా రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ మినహా మిగతా నగర, పురపాలక సంస్థల్లో ఉన్న భవనాలను నిక్షిప్తం చేసి.. తదుపరి కార్యాచరణ చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది.

ఆదాయానికి గండి పడుతుండటంతో..
రాష్ట్ర జనాభాలో సగం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు లెక్కలున్నా.. ఆదాయం మాత్రం అంతంత మాత్రమే వస్తోంది. ముఖ్యంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఏటా రూ.1,123 కోట్ల (గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా) రాబడి మాత్రమే లభిస్తోంది. ఇందులో ప్రధానంగా ఆస్తి పన్ను రూపేణా రూ.671.33 కోట్లు, ఇతర ఆదాయం రూ.452.53. కోట్లు సమకూరుతోంది. ఆస్తి పన్ను మదింపులో శాస్త్రీయత పాటించకపోవడం, గృహ, వాణిజ్య కేటగిరీల నిర్ధారణలో హేతుబద్ధీకరణ లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీనికి తోడు ప్రభుత్వ రికార్డుల్లో రెసిడెన్షియల్‌ ప్రాపర్టీగా కొనసాగతూ.. కమర్షియల్‌గా మారిన పాత పద్ధతుల్లోనే పన్నులు వసూలు చేస్తుండటం కూడా రాబడిలో తేడా రావడానికి దారితీస్తోంది.

వాస్తవానికి గృహ సముదాయాలను వాణిజ్యావసరాలకు వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా.. క్షేత్రస్థాయిలో అవేమీ పట్టడం లేదు. దీంతో ఆస్తి పన్ను మాత్రమే కాదు.. కరెంట్‌ కనెక్షన్, నల్లా కనెక్షన్‌ సహా ట్రేడ్‌ లైసెన్సులు, జీఎస్టీలను ఎగ్గొడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి తోడు ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై పెనాల్టీలు వడ్డించాలని, అక్రమ నిర్మాణాల నుంచి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని నిబంధనల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో పకడ్బందీ వ్యవస్థ లేకపోవడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు మిన్నకుండి పోయింది.

ఉపగ్రహ ఛాయచిత్రాలతో...
నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ప్రాపర్టీని మ్యాపింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ఇప్పటికే తీసిన ఉపగ్రహ ఛాయచిత్రాల సహకారంతో భవనాల సమాచారాన్ని డిజిటలైజ్‌ చేయనుంది. ఈ క్రమంలో ఆ భవనం ఏ కేటగిరీలో ఉంది? ప్రస్తుతం ఏ కేటగిరీలోకి వస్తోంది.. భవనంలో జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, నల్లా, విద్యుత్‌ కనెక్షన్లు, జీఎస్టీ, ట్రేడ్‌ లైసెన్సు కలిగి ఉన్నారా.. అనే సమాచారాన్ని సేకరించనుంది. దీనికి అనుగుణంగా జిల్లా ప్రణాళిక కార్యాలయం నుంచి గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం, ఎన్‌పీడీసీఎల్, సీపీడీసీఎల్‌ నుంచి విద్యుత్‌ కనెక్షన్లు, వాణిజ్య శాఖ నుంచి కమర్షియల్‌ ట్యాక్సులు, స్థానిక మున్సిపల్‌ నుంచి ట్రేడ్‌ లైసెన్సులు, బిల్డింగ్‌ పర్మిషన్లకు సంబంధించిన వివరాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.

భువన్‌ యాప్‌లో క్రోడీకరించిన ఈ సమాచారంతో భవనాల నిగ్గు తేల్చాలని పురపాలకశాఖ భావిస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి ఆగస్టు పదో తేదీవరకు ఈ సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ 360 డిగ్రీల కోణంలో భవనం కేటగిరీని నిర్ధారించడం ద్వారా మున్సిపాలిటీలు సహా అన్ని శాఖలకు భారీగా ఆదాయం సమకూరుతుందని, లీకేజీలకు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top