‘భవిత’కు భరోసా ఏది..!

Bhavitha Centers Are Not Working Well In Adilabad - Sakshi

పై చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు దుమాల ఆశన్న. జైనథ్‌ మండల కేంద్రానికి చెందిన దుమాల చిన్నక్క, నడిపెన్న దంపతుల చిన్న కుమారుడు. ఆశన్న పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. సాధారణ పిల్లల్లాగా కాకుండా శారీరక, మానసిక ఎదుగుదల లోపం కనిపించడంతో జైనథ్‌లోని భవిత విలీన విద్య కేంద్రంలో చేర్పించారు. కొన్నేళ్లుగా ఆటపాటలతో విద్య నేర్చుకుంటున్నాడు. ఏప్రిల్‌ 14నుంచి ఈ కేంద్రం మూసి వేయడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ‘‘అప్పటి నుంచి మరింతగా మానసిక వేదన చెందుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు. దినం, రాత్రి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి వస్తంది..’’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిత కేంద్రం తెరిచి ఉంటే పిల్లలతో కలిసి ఆటపాటలతో కొంత ఉల్లాసంగా గడిపేవాడని తెలిపారు.

ఆదిలాబాద్‌టౌన్‌ : పుట్టుకతో వచ్చే వివిధ రకాల శారీరక, మానసిక వైకల్యాలకు వైద్యం అందించడంతోపాటు కనీస విద్య సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం భవిత విలీన విద్యావనరుల కేంద్రానికి శ్రీకారం చూట్టింది. మానసిక వైకల్యం గల పిల్లలతోపాటు వైకల్యం గల పిల్లలకు చదువు, ఆటపాటలు నేర్పించి సాధారణ పిల్లలుగా మారే విధంగా చేయడమే భవిత కేంద్రాల లక్ష్యం. వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపి చికిత్స అందించి వారికి ప్రయోజనం చేకూర్చాలి. కానీ.. గత రెండు నెలలుగా కేంద్రాలు మూతపడ్డాయి. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, వైద్య సేవలు అందడం లేదు. సాధారణ పాఠశాలల మాదిరిగా ఈ కేంద్రాలకు కూడా విద్యశాఖ సేవలు ఇవ్వడంతో వైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల బాధలు వర్ణనాతీతం. చిన్నారుల రాత మార్చే భవిత కేంద్రాలు తెరవకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే వారి ‘భవిత’వ్యం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో..
ప్రత్యేక అవసరాలు ఉన్న శారీరక, మానసిక దివ్యాంగులకు మండల కేంద్రాల్లో భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 17 కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 251 మంది చిన్నారులు భవిత కేంద్రాల్లో చదువుకుంటున్నారు. 131 మంది చిన్నారులు ఫిజియోథెరఫి వైద్య చికిత్సలను పొందుతున్నారు. 88 మంది చిన్నారులు ఇంటి వద్ద చదువు నేర్చుకుంటున్నారు. భవిత కేంద్రాల్లో 23 మంది ఐఈఆర్పీ(ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌)లు చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. ఆరుగురు ఫిజియోథెరఫిస్టులు, 17 మంది కేర్‌గీవర్స్‌ పనిచేస్తున్నారు. 

పిల్లల భవితవ్యం పట్టదా..
దివ్యాంగులకు వివిధ అంశాల్లో ఆట, పాటల ద్వారా శిక్షణ ఇచ్చి క్రమంగా వారి సామర్థ్యాలను పెరిగేలా చూడాలి. దీంతోపాటు వారంలో ఒకసారి అవసరమైన వారికి ఫిజియోథెరఫితోపాటు ఇతర థెరఫిలు చేయిస్తారు. ఈ పిల్లల అంశాలను గుర్తించి తమ పనులు తాము చేసుకునేలా చూడడం, కాస్త క్రీయాశీలకంగా ఉన్న వారి సామర్థ్యాలను మరింతగా పెంచి సాధారణ విద్యార్థులతో కలిసిపోయేలా చేయడం దీని లక్ష్యం.. కానీ సర్వశిక్ష అభియాన్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతోంది. కాగా భవిత కేంద్రాలకు ఏప్రిల్‌ 13 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో భవిత కేంద్రానికి వచ్చి ఫిజియోథెరఫి చేసుకునే పిల్లలు ఇబ్బందులు గురవుతున్నారు. ఫిజియోథెరఫి క్రమం తప్పకుండా చేయాలి. లేనట్లయితే పరిస్థితి మొదటికి వస్తుంది. కండరాలు బిగిసుకుని చచ్చుబడిపోతాయి. ప్రైవేటుగా ఫిజియోథెరఫి చేయించుకోలేని వారే అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు వారి ఇంటికి వెళ్లి ఐఈఆర్పీలు చదువు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఫిజియోథెరఫి చేసే విధానం చూపిస్తారు. వారిలో మనోధైర్యం నింపుతారు. ఇవన్నీ నిలిచిపోయి ఇప్పటికే నెల రోజులు దాటింది. భవిత కేంద్రాలు మళ్లీ వచ్చే నెల 12న ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడంతో రెండు నెలలపాటు సేవలు నిలిచిపోయినట్లే. 

ఉద్యోగ భద్రతా కరువే..
మానసిక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను సాధారణ స్థితికి తీసుకువస్తున్న ఐఈఆర్పీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నవారి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. ఏప్రిల్‌లో 13 వరకే వేతనం చెల్లించారు. మే నెలకు వేతనం లేకపోగా, జూన్‌ మాసంతో 20 రోజుల వేతనం ఇవ్వనున్నారు. వీరు గత కొన్నేల్లుగా ఉద్యోగం చేస్తున్నా ప్రతి సంవత్సరం రీఎంగేజ్‌ (రెన్యువల్‌) చేస్తుండడంతో ఉద్యోగ భద్రత లేదు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రెన్యువల్‌ చేయలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు అధికంగా ఉండగా మన రాష్ట్రంలో రూ.15వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
గత 15 సంవత్సరాలుగా వైకల్యం గల పిల్లలకు సేవలు అందిస్తున్నాను. ఐఈఆర్పీలకు ఉద్యోగ భదత్ర కల్పించాలి. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి. కనీస వేతనం రూ.28,940 చెల్లించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 6 నెలల మాతృత్వ సెలవులు మంజూరు చేయాలి. ఒక్క రోజు విరామంతో తిరిగి పునర్నియామకం చేయాలి.
పుష్పవేణి, ఐఈఆర్పీ ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top