రుణాలా! 

Bhatti Vikramarka Question Over Vote On Account Budget - Sakshi

బడ్జెట్‌పై సీఎల్పీ నేత భట్టి విమర్శలు

ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పులా..

టీఆర్‌ఎస్‌ ఎజెండాగా ప్రాజెక్టులు

వాస్తవాలు జనానికి తెలియాలి

నేను చెప్పేవి వాస్తవాలు...

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎన్నోఆకాంక్షలు, ఆశలతో తెచ్చుకున్న తెలం గాణను అప్పులకుప్పగా మార్చే శారు. మిగులు రాష్ట్రంగా భాసిల్లా ల్సిన తెలంగాణను దివాలా తీయించారు. దానికి తాజా బడ్జెట్‌ లెక్కలే సాక్ష్యం. ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తారా? ఇది రాష్ట్రానికి భారం కాదా? ఈ నిజాలు చెప్తే అక్క సెందుకు? సీఎం వయసులో నా కంటే పెద్ద, ఆయన పద్ధతిగా మాట్లాడాలి. అంతకంటే దారు ణంగా మాట్లాడేందుకు నాకు రెండు నిమిషాలు చాలు, కానీ నాకు సంస్కారముంది. ఈ రోజు చర్చలో వాస్తవాలు వెలుగులోకి రావాలి, ప్రజలు వాటిని తెలుసు కోవాలి, అధికారపక్షం బెదిరింపులకు భయపడం’ అంటూ బడ్జెట్‌పై కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క శనివారం అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. బడ్జెట్‌లో అంకెలు ప్రస్తావిస్తూ.. అవి ఏరకంగా వాస్తవ విరుద్ధమో చెప్పే ప్రయత్నం చేశారు.

6 నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం తెలంగాణనేనని, ఇదే ఓ వింత అనుకుంటే, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేటాయింపులలో రూ.36 వేలకోట్ల మేర కోతపెడుతూ సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం మరోవింత అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం తెరదీసిందన్నారు. 2014 నుంచి క్రమంగా రాష్ట్ర బడ్జెట్‌ పెరుగుతూ రాగా, ఈసారి 20 శాతం తగ్గిపోవటం పరిపాలనాతీరును తేటతెల్లం చేస్తోందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చెప్పిన ఏ ఒక్క కారణం కూడా సహేతుకంగా లేదని పేర్కొన్నారు. జీఎస్‌డీపీలో 10 శాతం వృద్ధి ఉందని బడ్జెట్‌లో చూపారని, అలాంటప్పుడు రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. దీనిని మాంద్యం ప్రభావం అంటున్నారని, వాస్తవానికి ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‌ అని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టూ పీజీ విద్య, రెండు పడకగదుల ఇళ్లు, ఇతర ఎన్నికల హామీలను చూసి జనం ఆశపడ్డారని, కనీసం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతన్నా అవి నెరవేరతాయని ఆశించారని, కానీ వాటిని అమలు చేయలేక చేతులెత్తేసినట్టు ఈ బడ్జెట్‌ తేల్చిచెప్తోందని ఎద్దేవా చేశారు. 

సంపద సృష్టిస్తే ఈ పరిస్థితి ఎందుకు?
కొత్త రాష్ట్రం ఏర్పాటు కాగానే సంపద సృష్టించుకునే వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ దివాలా పరిస్థితి వచ్చేది కాదని, ప్రాధామ్యాలను గుర్తించి వాటి ప్రాధాన్యతాక్రమంలో ఖర్చు చేసి ఉంటే పరిస్థితి మరోకరంగా ఉండేదని, టీఆర్‌ఎస్‌ ప్రాధమ్యాలనే ప్రజల ప్రాధమ్యాలుగా మార్చేసి ఇష్టం వచ్చినట్టు చేయటంవల్లే ఈ దుస్థితి వచ్చిందని భట్టివిక్రమార్క ఆరోపించారు. దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులకు నాటి ప్రభుత్వం రూ.822 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.859 కోట్లు వ్యయం చేస్తే అవి పూర్తయ్యేవని, వాటివల్ల 4 లక్షల ఎకరాలకు నీళ్లుపారి ఉండేవని అన్నారు. మరో రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాణహిత–చేవెళ్ల పూర్తయి ఉండేదని, దాదాపు రూ.7,200 కోట్లు ఖర్చు పెట్టిన దేవాదుల మరో రూ.2 వేల కోట్లతో సిద్ధమై ఉండేదని.. ఇలా గోదావరిపై రూ.31,421 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 36 లక్షల ఎకరాలకు సాగునీరందించేవని సభ దృష్టికి తెచ్చారు. కృష్ణా నదిపై నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, బీమా, ఏఎంఆర్‌పీలకు మరో రూ.3 వేల కోట్ల నుంచి రూ.మూడున్నర వేల కోట్లు సరిపోయి ఉండేవని, ఇవి పూర్తి అయితే మరో 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలమై ఉండేవన్నారు. ఇలా తక్కువమొత్తంతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాల్సి ఉండగా, రీడిజైనింగ్‌ పేరుతో కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు, పాలమూరు–రంగారెడ్డి పేరుతో భారీ ఖర్చుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి చుక్కనీరు కూడా ఎల్లంపల్లికి పంప్‌ చేయలేదని అన్నారు. 

రూ.3 లక్షల కోట్ల అప్పు నిజం కాదా?
తాజా బడ్జెట్‌ పుస్తకంలోని 11వ పేజీలో... 2016–2019 మధ్య అప్పులు రూ.2.03 లక్షల కోట్లుగా చూపారని, 12వ పేజీలో ప్రభుత్వ గ్యారంటీడ్‌ పేరుతో రూ.74,314 కోట్లు చూపారని, ఇలా అన్నీ కలిపితే రూ.3 లక్షల కోట్లకు అప్పులు చేరుకున్నాయని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ గ్యారంటీడ్‌ రుణాలు అప్పు కాదంటే ఎలా కుదురుతుందని, అవి మన కార్పొరేషన్లకు వచ్చిన రుణాలకు సంబంధించినవేనని, వాటిని తీర్చాల్సింది మనమే కదా అని పేర్కొన్నారు. ఆరేళ్లలో ఇంత పెద్దమొత్తంలో అప్పు చేయటం రాష్ట్రానికి భారం కాదా అని ప్రశ్నించారు. వనరులు సృష్టించే ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా లేనప్పుడు, మిగిలేవి అప్పులే కదా అని పేర్కొన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలన్నీ అంతే
నిధులు, నియామకాలు, నీళ్లు... ఈ మూడు ప్రధానాంశాలే లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణలో అవన్నీ నిరాశాజనకంగానే మిగిలిపోయాయని భట్టి ఆరోపించారు. ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రంలో 2.40 లక్షల ఖాళీలుంటే కేవలం 56,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారని, గ్రూప్‌–1 కోసం ఎదురుచూసి ఎంతోమంది వయసుమీరిపోయారని అన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించి సంబంధిత వర్గాల సంక్షేమంపై దెబ్బకొట్టారని పేర్కొన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు దాదాపు రూ.30 వేల కోట్లకుపైబడి మళ్లించి ఉండకపోతే దళితులకు సంబంధించి మూడు ఎకరాల భూపంపిణీ, కేజీ టూ పీజీకి సంబంధించి ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు, డబుల్‌ బడెరూమ్‌ ఇళ్లు చాలావరకు సిద్ధమై ఉండేవన్నారు. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నారని, దానికి రూ.7,200 కోట్లు అవసరమని, 20 లక్షల కుటుంబాలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం చూస్తున్నారని, అవి పూర్తికావాలంటే రూ.లక్ష కోట్లు కావాలని, మూడు ఎకరాల భూమి కోసం ఏడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం రోగాలమయంగా మారిందని, ఈ పరిస్థితి రాకుండా తాము ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా లెక్కచేయకుండా చేసి ఇప్పుడేమో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top