వంద పడుద్ది!

100 Challan For Open Toilet in Hyderabad - Sakshi

బహిరంగ మూత్ర విసర్జన చేస్తే రూ.100 జరిమానా

‘స్వచ్ఛత’ ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ కొరడా  

భారీగా జరిమానాల విధింపునకు నిర్ణయం సీసీ కెమెరాలతో నిఘా

‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ బృందం రాక నేపథ్యంలో కఠిన నిర్ణయాలు

సాక్షి, సిటీబ్యూరో: సిటీజనులూ..తస్మాత్‌ జాగ్రత్త. నగరంలో ఎక్కడైనా పొరపాటున బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడ్డారా రూ.100 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000, రోడ్లపై పెద్దమొత్తంలో చెత్త వేస్తే రూ. రెండు వేలు, చెత్తకుండీల్లో బదులు చెత్తకుండీ పక్కన చెత్తవేస్తే రూ.100, నిర్మాణ వ్యర్థాలను బహిరంగంగా రోడ్లపై వేస్తే రూ.10 వేలు, నాలాల్లో వ్యర్థాలు, చెత్త వేస్తే రూ. 10 వేలు చెల్లించాల్సి రావచ్చు.  స్వచ్ఛ కార్యక్రమాల అమలులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించేవారికి పై జరిమానాలు  ఎప్పటినుంచో  ఉన్నప్పటికీ అమలు చేయడం లేదు. వచ్చేనెల4వ తేదీనుంచి నెలాఖరువరకు స్వచ్ఛసర్వేక్షన్‌– 2019 ర్యాంకుల్ని ప్రకటించేందుకు స్వచ్ఛ భారత్‌మిషన్‌ ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించనున్నందున ర్యాంకింగ్‌ కోసం జీహెచ్‌ఎంసీ ఈ జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. 

ఎన్ని కార్యక్రమాలు చేసినా..  
జీహెచ్‌ఎంసీలో బహిరంగ మూత్రవిసర్జన నివారణకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అన్ని సర్కిళ్లలోనూ బహిరంగ మల, మూత్ర విసర్జన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించింది. సదరు ప్రాంతాలను తిరిగి పాడుచేయకుండా ఉండేందుకు అక్కడ అందమైన ముగ్గులు, పెయింటింగ్‌లు వేయించడం, మొక్కలు పెంచ డం వంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేకంగా స్వచ్ఛ వాలంటీర్లను నియమించింది. పెట్రోల్‌ బంక్‌లు, హోటళ్లలోని టాయ్‌లెట్లను ప్రజలు వినియోగించుకునేందుకు నిర్వాహకులను ఒప్పించింది. అయినప్పటికీ ఇంకా బహిరంగ మూత్ర విసర్జన తరచూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రతినిధుల బృందం రానుండటంతో బహిరంగ మూత్ర విసర్జనచేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.  

28 ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు..
ఇందులో భాగంగా  నగరంలో 28 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక బహిరంగ మూత్ర విసర్జన కేంద్రాలుగా జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ  కెమెరాలను ఏర్పాటు చేయడం, స్వచ్ఛ కార్యకర్తలను నియమించి బహిరంగ మూత్ర విసర్జనను నివారించడంతో పాటు యూరినల్‌ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  దానకిషోర్‌ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అయినప్పటికీ బాధ్యతారహితంగా  వ్యవహరించి బహిరంగ మూత్రవిసర్జన చేసినవారిని గుర్తించి పెద్ద ఎత్తున జరిమానాలు విధించాలని  క్షేత్రస్థాయి అధికారులకు కూడా సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top