
సాక్షి, నిర్మల్ : సోన్ గ్రామస్తులు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారు. గ్రామస్తులందరూ కలిసి గ్రామంలో ప్లాస్టిక్‌ను రూపుమాపేందుకు నడుం బిగించారు. ప్లాస్టిక్‌ను గ్రామం నుంచి తరిమివేయాలంటే మొక్కుబడి చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామస్తులు, వీడీసీ, వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి లిఖిత పూర్వక తీర్మానాన్ని చేసి అమలు పరిచేలా చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్ ఉపయోగిస్తే ఎంతటి వారైనా పదివేల రూపాయలు జరిమానా చెల్లించాలని తీర్మానించారు.
ఇందుకోసం గ్రామస్తులకు, షాపు యజమానులకు మూడు రోజుల సమయం ఇచ్చారు. మంగళవారం వీడీసీ, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో గల కిరాణషాపులు, చికెన్, మటన్ సెంటర్, కూరగాయల షాపు యజమానులకు నోటీసులు ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా మార్చడంలో సహకరించాలని కోరారు. నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అలాగే ప్లాస్టిక్ ఉపయోగించిన వారి వివరాలను తెలిపిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని, వారి వివరాలు సైతం గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వినోద్, ఎంపీటీసీ లింగవ్వ, ఎంపీఓ అశోక్, ఎంపీడీవో ఉషారాణి, వీడీసీ మెంబర్లు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.