breaking news
-
రసవత్తరంగా తాండూరు మున్సిపల్ రాజకీయం
తాండూరు: మున్సిపల్ రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఒప్పందం ప్రకారం ఇద్దరు చైర్పర్సన్లు కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నేతలు నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో రెండున్నరేళ్ల పాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగారు. గడువు ముగిసిన తర్వాత కూడా చైర్పర్సన్ స్వప్న పదవికి రాజీనామా చేయలేదు. వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపనర్సింహులు చైర్పర్సన్ పదవి కట్టబెట్టాలని ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వల్ల మున్సిపాలిటీలపై పార్టీ జోక్యం తీసుకొలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఒప్పందం ప్రకారం చైర్పర్సన్ పదవి ఇవ్వాలని దీపనర్సింహులు డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన సంతకాలు గతంలో పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పట్నం శిబిరంలో ఉన్న పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చైర్పర్సన్ తాటికొండస్వప్నకు మెజార్టీ కౌన్సిలర్లు కరువయ్యారు. అధికారప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మద్దతులో ఎలాగైనా చైర్పర్సన్ తాటికొండస్వప్నపై అవిశ్వాసం ప్రవేశపెట్టి పదవి నుంచి దింపాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు సిద్ధమయ్యారు. మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటిసు అందించాలంటే మొత్తంలో మూడో వంతు సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే 15 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ల మద్దతు లభిస్తోందా.. లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అన్నదమ్ముల పంచాయితీ సాయిపూర్ ప్రాంతంలో మూడు వార్డులలో ఒకే కు టుబానికి చెందిన వారే కౌన్సిలర్లుగా కొనసాగుతున్నా రు. దాయాదులుగా ఉన్న వారు ఒకరంటే ఒకరికీ పొసగడం లేదు. సాయిపూర్లోని 9వ వార్డు కౌన్సిలర్ అయిన వైస్ చైర్పర్సన్ దీపనర్సింహులు చైర్పర్సన్ పదవికోసం ఆశపడుతున్నారు. అయితే సోదరులు అయిన కౌన్సిలర్లు నీరజాబాల్‌రెడ్డి, పట్లోళ్ల రత్నమాలనర్సింహులు వైస్ చైరపర్సన్కు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేకు విషమ పరీక్ష మున్సిపల్ అవిశ్వాస తీర్మానం విషయంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి విషమ పరీక్ష ఎదురుకానుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పాల్గొనకుండా ఉంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో జత కట్టారనే ప్రచారం సాగుతోంది. అవిశ్వాసంలో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులతో విభేదాలు ఎదురవుతాయి. దీంతో అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడే ఉలిక్కి పడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడటం ఇంకా మొదలుపెట్టక ముందే కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కి పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోవాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం తెలంగాణ భవన్లో నల్లగొండ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. ‘అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీ లు గుప్పించారు. ఇప్పుడు హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌రెడ్డి అడ్డమైన మాటలు చెప్పా రు. కార్యకర్తలు ఉదాసీన వైఖరిని వీడాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలి’అని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు కార్యకర్తలు చెబుతున్నారన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో విఫలమయ్యామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ వివరించారు. ఓటమిపై అనుమానం రాలేదు ‘నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది. ఎక్కడా ఓటమిపై అనుమానం రాలేదు. కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి. కేవలం సూర్యాపేటలో మాత్రమే గెలిచాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలి. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించింది. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోంది. కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయి. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా నిర్వహించాలి’అని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని వ్యాఖ్యానించారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాలుస్తానని మోదీ అంటున్నారని, మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం గురించి వివరించాలన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని, నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్నారు. కష్టపడ్డ వారికే గుర్తింపు: హరీశ్‌రావు 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి నిర్వహించిన 16 సమావేశాల్లో 112 గంటల పాటు చర్చ జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రో హం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై సూచనలు వచ్చాయని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగుదామని చెప్పారు. కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఉద్యమకారులకు సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎండ్రకాయల పార్టీ అని, ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను మరో 20 రోజుల్లో నెరవేర్చాలని, లేకపోతే ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పారు. మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట దేశమంతా తిరిగితే బలోపేతం అవుతారని మోదీ భయపడి కాంగ్రెస్‌కు సహకరించారని, రాహుల్‌ను ఎదుర్కోవడం కన్నా కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్ట మని భావించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడదామన్నారు. ‘లోక్‌సభ’కు సన్నద్ధం ♦ సన్నాహక సమావేశాల్లో పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం ♦ 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుపు లక్ష్యంగా... అసెంబ్లీ ఎన్నికల్లో ♦ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ ♦ జరిగిన పొరపాట్లు పునరావృత కానివ్వమని భరోసా సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ సెగ్మెంట్ల సన్నాహక సమావేశాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్ నింపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్నవారిలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు ఈ సమావేశాలు దోహదపడ్డాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోక ముందే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలు కావడంతో పార్టీ యంత్రాంగంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవరించింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ జనవరి 3న తెలంగాణభవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ సెగ్మెంట్‌తో మొదలైన సమావేశాలు సోమవారం నల్లగొండతో ముగిశాయి. రోజుకో లోక్‌సభ నియోజకవర్గం చొప్పున 16 రోజులు జరిగిన సమావేశాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్ సమావేశాలు ఒకేరోజు జరిగాయి) దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన 500 నుంచి 800 వరకు వివిధ స్థాయిల్లోని నాయకులు ప్రతిరోజు తెలంగాణభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషిం చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో ఏరోజుకారోజు పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు 9 మంది ఎంపీలు ఉండగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ సన్నాహాక సమావేశాలు జరిగాయి. ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకు తొలిరోజే ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటమికి గల కారణాలను నిర్భయంగా పార్టీ అగ్రనేతల సమక్షంలో వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుల పరిస్థితి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు దక్కిన పదవుల గురించి నిక్కచ్చిగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అన్ని పార్టీల వారు బీఆర్ఎస్లోకి వచ్చి చేరడం మొదట్లో బాగున్నా, తర్వాత విభేదాలు పెరిగాయని, ఇవి కాంగ్రెస్, బీజేపీలకు కలిసి వచ్చాయని పలు నియోజకవర్గాల నాయకులు విశ్లేషిం చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు గట్టిగా ఉన్న చోట బీఆర్ఎస్ గెలిచిన విషయాలను సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్ సమావేశాల్లో పార్టీ నాయకులు విశ్లేషిం చారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు వంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు పోటీ చేసిన చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించడాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తీరుపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, కేశవరావు, మధుసూదనాచారి వంటి సీనియర్లు ఓపిగ్గా వింటూ, అలా మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి పార్టీ యంత్రాంగంలో ధైర్యం నింపారు. -
అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదు?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: హిందువులకు నేడు పండగ రోజని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య కోసం పోరాడిన కర సేవకుల మీద కాల్పులు జరిపారని, సరయు నదిలో గుట్టలుగా శవాలు తేలాయని అన్నారు. అయోధ పోరాటంలో తాను కూడా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప నెరవేరిందని పేర్కొన్నారు. కర సేవకుల బలిదానాలు వృథాగా పోలేదని అన్నారు. కరసేవకుల కుటుంబాలకు ఇన్నేళ్లకు అసలైన పండుగ వచ్చిందన్నారు. అయిదు వందలవందల ఏళ్ల స్వప్నం నెరవేరడం ఆషామాషీ కాదని చెప్పారుజ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాడి జరగలేదన్న బండి సంజయ్.. ప్రజల దృష్టి మరల్చడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రాముడిపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా?. నాస్తికులు, హేతువాదులు రాజ్యాంగాన్ని అవమానిస్తారా?.అని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యులను అడగండి.. రాముడు అయోధ్యలో పుట్టాడో లేదో తెలుస్తుందని అన్నారు. ఈ దేశం తిండి తింటూ ఇక్కడి దేవుళ్లను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కన్నుల పండుగగా రామమందిర ప్రారంభోత్సవం -
మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఎమ్మెల్సీ కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని నిలదీశారామె. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని కవిత తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సంకుచిత మనస్తత్వంతో, ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నామన్నారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంత్రి గారూ! అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ? భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?? అసెంబ్లీలో… https://t.co/Eb6nPs2YN0 — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 22, 2024 చదవండి: ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం -
రేవంత్ రెడ్డి ఫోకస్ మారితేనే మంచిది!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును బెదిరిస్తున్నట్లుగా ఉంది. పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామని చెప్పడం ద్వారా తన ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారు. లండన్‌లో తన అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ను వచ్చే పార్లమెంటు ఎన్నికలలో వంద మీటర్ల లోతున పాతిపెడతామని కూడా ఆయన అన్నారు. లండన్ నుంచే ఆయన పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఆరంభించినట్లు అనిపిస్తుంది. నిజానికి విదేశాలకు వెళ్లినప్పుడు తన ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పడానికి సహజంగా యత్నిస్తారు. తన లక్ష్యాలను వివరిస్తారు. కాని రేవంత్ తన స్పీచ్‌లో కేసీఆర్‌ను, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు పులి అవుతారో, ఎప్పుడు పిల్లి అవుతారో చెప్పలేం. ఎవ్పుడైనా ,ఎవరైనా, ఏమైనా కావచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రేవంత్ రెడ్డే. 2015లో ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలైనప్పుడు ఆయన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. శాసనసభ నుంచి ఆయన బహిష్కరణకు కూడా గురయ్యారు. తదుపరి 2018లో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. అప్పుడు రేవంత్ రాజకీయంగా బాగా వెనకబడి పోయినట్లు అనిపించింది. కాని అదృష్టం కలిసి వచ్చి మల్కాజిగిరి నుంచి స్వల్ప ఆధిక్యతతో లోక్‌సభకు గెలవడం ఆయన రాజకీయ జీవితంతో ఒక పెద్ద మలుపు అయింది. తదుపరి రేవంత్ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు అవడం, అనంతరం ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం జరిగింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా దురుసుగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆయన భాషపై అభ్యంతరాలు వచ్చేవి. అయినా రేవంత్ తగ్గలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనపై విమర్శలు బీఆర్ఎస్ వంతుగా మారింది. కేసీఆర్ ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కాని, మాజీ మంత్రి హరీష్ రావు కాని కాంగ్రెస్ హామీలను పదే, పదే గుర్తు చేస్తున్నారు. ప్రజలలో ప్రభుత్వంపై అసమ్మతి, అసంతృప్తి పెరిగేలా ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది రేవంత్‌కు గుర్రుగానే ఉంటుంది. ఆయన మంత్రివర్గ సహచరుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ క్రమంలోనే రేవంత్ తనదైన శైలిలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 'ఎన్నికలలో బీఆర్ఎస్ బొక్కబోర్లాపడ్డా బుద్ది రాలేదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా వంద మీటర్ల లోతున బొందపెడతాం. పులి బయటకు వచ్చేస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. అందుకోసమే ఎదురుచూస్తున్నా.. నా దగ్గర బోను, వల ఉన్నాయి..' అని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశమే. అంటే దీని అర్ధం కాలు జారి పడ్డ కేసీఆర్ కోలుకుని మళ్లీ ప్రజాజీవనంలోకి వస్తే ఆయనను ఏదో కేసులో పెట్టి అరెస్టు చేస్తామని చెప్పడమేనా అన్న ప్రశ్న వస్తుంది. కాకపోతే, ఆ మాట ఆయన నేరుగా చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్చ జరగకూడదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకు తెలియచేయరాదన్నట్లుగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రవర్తిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిజమే! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్ ఆ విషయం తప్ప మిగిలిన అంశాలపైనే కేంద్రీకరిస్తుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదే, పదే ప్రస్తావించడం ద్వారా రేవంత్‌ను ఇరకాటంలోకి నెట్టడానికి కేటీఆర్, హరీష్‌రావు ఇతర నేతలు వ్యవహరిస్తారు. కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుని వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఆయన తక్షణమే ప్రజలలో తిరగాలని అనుకోకపోవచ్చు. మహా వస్తే పార్టీ ఆఫీస్‌కు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లవచ్చు. ఎటూ మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తేల్చుకుందామని రేవంత్ అన్నట్లుగానే కేసీఆర్ కూడా అందుకు సిద్దం అవుతుండాలి. ఈలోగానే మాటల యుద్దంలో పైచేయి సాధించడానికి ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ కు కాళేశ్వరం వీక్ పాయింట్ అయినట్లుగానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు వీక్ పాయింట్లు అవుతాయి. వాటిని అమలు చేయలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేస్తున్నారన్న భావన ఏర్పడుతుంది. ఇంతవరకు ఆర్టీసీ బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేశారు. దీనివల్ల మొదట కాస్త ఆకర్షణ ఏర్పడినా, రానురాను అది తగ్గుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. బస్‌లలో సీట్లు చాలకపోవడం, అందరిని ఎక్కించుకోకపోవడం, అన్ని బస్ లలో ఈ సదుపాయం లేకపోవడం, ఈ స్కీమ్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికన్నా వంట గ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే ఇచ్చే స్కీమ్ అమలు చేసి ఉంటే రేవంత్ ప్రభుత్వానికి ప్రజలలో ప్రత్యేకించి పేదవర్గాలలో గుడ్ విల్ పెరిగేది. కాని ఆ స్కీమ్ అమలు చేయాలంటే డబ్బు కూడా ఎప్పటికప్పుడు చెల్లించవలసి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. సుమారు కోటి మంది వరకు ఆ స్కీమ్ కింద సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏడాది అయ్యే వ్యయం సుమారు 2500 కోట్లు అని అంచనా వేశారు. దీనితో పాటు వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు ఇవ్వవలసి ఉంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవలసిన వాగ్దానాల జాబితా చాంతాడు అంత అవుతుంది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్ ఒక పిలుపు ఇచ్చారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందువల్ల జనవరి బిల్లులను చెల్లించవద్దని, ఆ బిల్లులను సోనియాగాంధీ చిరునామాకు పంపించాలని ఆయన ప్రజలకు సూచించారు. వీటిని గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుంది. ఎందుకంటే వీటన్నిటిని అమలు చేయడం సాధ్యం కాదని వారికి తెలుసు కాబట్టి. బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతున బొందపెట్టడం సరే కాని, ముందుగా వంద రోజుల లోపు హామీలను అమలు చేయాలని, రేవంత్ మాదిరి అహంకారంగా మాట్లాడేవారిని చాలామందిని చూశామని ఆయన అన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రతిపక్షంపై వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావవడంతో వాటి రుచిని ఆయన చవిచూస్తున్నారు. రేవంత్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాధ్ షిండేతో పోల్చుతూ ఎప్పటికైనా కాంగ్రెస్‌ను చీల్చుతారన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌ది బీజేపీ రక్తమని కూడా ఆయన అన్నారు. రాజకీయంగా చూస్తే ఒకప్పుడు కేసీఆర్ కూడా టీడీపీవారే. అలాగే రేవంత్ కూడా తొలుత ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి తదుపరి కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. రేవంత్‌కు కాంగ్రెస్‌ను చీల్చవలసిన అవసరం ఎందుకు వస్తుందో తెలియదు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేస్తే అప్పుడు అలా అవుతారని చెప్పడం కేటీఆర్ ఉద్దేశం కావచ్చు. కాని ఇదేదో ఊహాజనిత విమర్శగా కనిపిస్తుంది. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలు అటు రేవంత్ కు, ఇటు కేసీఆర్ కు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే. మధ్యలో బీజేపీ తన వంతు గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోతే అప్పుడు ఆ పార్టీలో అసమ్మతి పెరిగితే పెరగవచ్చు. ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం రేవంత్‌కు డోకా ఉండదనే చెప్పాలి. కేసీఆర్ కు కూడా పరీక్ష సమయమే. గౌరవప్రదమైన సంఖ్యలో లోక్ సభ సీట్లు గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ క్యాడర్ కు భవిష్యత్తుపై అనుమానాలు వస్తాయి. మరో నాలుగేళ్లపాటు పార్టీని నడపడానికి చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో మాదిరి సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. రేవంత్ డావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం జరిగింది. రేవంత్ గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానిని విమర్శించేవారు. ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ సైతం ఆదానిపై విరుచుకుపడుతుంటారు. డావోస్ లో మాత్రం అదానిని రేవంత్ కలవడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ తన విధానం మార్చుకుందా? లేక అవకాశవాదంతో పోతోందా అనే సందేహం వస్తుంది. మూసి నదికి సంబంధించి శుద్ది చేయాలన్న ఆలోచనలు బాగానే ఉన్నాయి. లండన్‌లో దీనిపై చర్చలు జరిపే నెపంతో ఎమ్.ఐ.ఎమ్. నేత అక్బరుద్దీన్ ఓవైసీని పిలిపించుకోవడంలో రాజకీయం కూడా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. రేవంత్ రెడ్డిని తన బ్లాక్ మెయిల్ ద్వారా ఒక మీడియా యజమాని ఇప్పటికే లొంగదీసుకున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అదే కొనసాగితే రేవంత్ కు కొత్త చిక్కులు రావచ్చు. ప్రస్తుతం రేవంత్‌కు ఆ మీడియా పెట్టే జాకీలపై ఆధారపడకుండా, తన స్వశక్తి ద్వారా ప్రజలలో ఆదరణ పొందగలిగితేనే నిలబడగలుగుతారు.లేకుంటే రాజకీయంగా చేదు అనుభవాలు ఎదురు అవుతాయి. ఉదాహరణకు మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. గతసారి ఇక్కడ నుంచే రేవంత్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి జరిగే ఎన్నికలలో అదే పరిస్థితి ఎదురైతే ఆయన నైతికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరో సంగతి ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడినట్లు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఫర్వాలేదు కాని, బీఆర్ఎస్ మాత్రం ఉండకూడదన్నట్లు మాట్లాడినట్లు తోక పత్రిక యజమాని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మోదీ ఒక కాంగ్రెస్ నేతతో అలా అంటారా అన్నది డౌటే. కల్పిత కధలు రాయడంలో దిట్టగా పేరిందిన ఈయన మాటలు జనం ఎవరూ నమ్మరు. అలాగే టీడీపీకి మద్దతు ఇచ్చే మరో పత్రిక పట్ల కూడా రేవంత్ వ్యవహరించే శైలిని కూడా ప్రజలు గమనిస్తారు. ఉదాహరణకు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ మరణించారు. ఈ కేసును రేవంత్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. రేవంత్ తమ చెప్పుచేతలలో ఉన్నాడని ఆ పత్రిక యాజమాన్యం భావిస్తోందని చెబుతారు. ఇలా తెలుగుదేశం మీడియా గుప్పిట్లోనే రేవంత్ కనుక కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. వారితో తగాదా తెచ్చుకోవాలని చెప్పడం లేదు కాని వారి ఆటలకు అనుగుణంగా రేవంత్ డాన్స్ చేస్తే మాత్రం అప్రతిష్టపాలవుతాడని చెప్పకతప్పదు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ తనపై ఆరోపణలు జనంలోకి వెళ్లకుండా చూడడానికి విశ్వయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోతే బాగుండు అన్నట్లుగా వ్యవహరిస్తుందని భావించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఏప్రిల్ మొదటివారంలో లోక్‌సభ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మొదటివారంలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని, భారీమెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ధీమావ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యలో ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు రూ.12 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని కాగ్ రిపోర్టు తేల్చగా, తొమ్మిదిన్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మూసీ నదిలో పడేసినట్లేని, ఆ పార్టీ ఎంపీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం బందీ చేసుకుని అప్పులపాలు చేసిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఆరు గ్యారంటీల అమలు, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం కోసం వేలాదిమంది సాధుసంతులు, హిందువులు, ప్రజలు ఉద్యమించారని తెలిపారు. కోట్లాదిమంది భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం ఐదు వందల ఏళ్ల తర్వాత మోదీ నేతృత్వంలో సాకారమవుతోందన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, హిందువుల ఆత్మగౌరవానికి అయోధ్య రామమందిరం ప్రతీక అని కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని 150 దేశాల్లోని హిందువులందరూ వర్చువల్‌గా వీక్షించనున్నారని తెలిపారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. -
TS: బరాబర్ బొంద పెడతాం
సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని కేటీఆర్ కలలు కంటున్నాడు. కానీ బీఆర్ఎస్కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలుగా విభజిస్తాం.. మీ పార్టీని 14 ముక్కలు చేస్తాం.. మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీని మేము బరాబర్ బొంద పెడతాం’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తొలిసారి యాదాద్రి జిల్లా భువనగిరికి వచ్చిన కోమటిరెడ్డి, ఆదివారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ అధికారం పోయిన షాక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిందని, పేదల భూములు లాక్కుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తెలంగాణను గాడిలో పెడుతోందన్నారు. త్రిపుల్ఆర్ తెలంగాణకు మణిహారమని, రైతులు కోరుతున్నట్లు దీని అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో 10 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు. -
తెలంగాణ గొంతుకను ఖతం చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: ఎట్టిపనికైనా, మట్టిపనికైనా తెలంగాణ ప్రజల ఏకైక గొంతుక బీఆర్ ఎస్ పార్టీ మాత్రమేనని.. ఆ గొంతుకను కాంగ్రెస్, బీజేపీ కలసి ఖతం చే యాలని చూస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ‘కారు’ వెళ్లింది స ర్వీసింగ్కేనని, మళ్లీ రెట్టింపు వేగంతో పరు గెడుతుందని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఆన్లైన్లో రేషన్‌కార్డులు మంజూరు చేశామని, ఈ విషయం కార్యకర్తలకు కూడా తెలియదని చెప్పారు. పార్టీ కమిటీలను పూర్తిస్థాయిలో వేయకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగబోవని.. మూడు నెలలకోసారి పార్టీ కమిటీల సమావేశాలు నిర్వహించుకుందా మని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్ష ల్లో భాగంగా ఆదివారం తెలంగాణభవన్ లో మల్కాజ్గిరి స్థానంపై సమావేశం జరి గింది. దాదాపు ఏడుగంటలకుపైగా జరిగిన ఈ భేటీలో భాగంగా.. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కన్నా అదనంగా వచ్చింది నాలుగు లక్షల ఓట్లు మాత్రమే. 14 అసెంబ్లీ స్థానాలను స్వల్ప తేడాతో కోల్పోయాం. బీఆర్ఎస్ మరో ఏడెనిమిది చోట్ల గెలిచి ఉంటే హంగ్ వచ్చేది. కాంగ్రెస్ ఎన్నికల్లో దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆ పార్టీ తప్పించుకుంటున్న తీరును ప్రజాకోర్టులోనే ఎండగట్టాలి. ఇందుకోసం సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్థంగా వినియోగించుకోవాలి. హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కారుపై ఇప్పటినుంచే ఒత్తిడి తేవాలి. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజల ఏకైక గొంతుక అయిన బీఆర్ఎస్ను కాంగ్రెస్, బీజేపీ కలసి ఖతం చేయాలని కుట్ర చేస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ కలసిన సందర్భంగా బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు సహకరిస్తానని ప్రధాని మోదీ చెప్పారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ బీటీం కాదు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. నిజాలు మాట్లాడితే తప్పుపడతారా? నిరుద్యోగ భృతిపై ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై మాట మార్చింది. 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను జనవరి నెల నుంచి కట్టవద్దని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చెప్పారు. వారి మాటలనే నేను గుర్తుచేశా. నేను నిజాలు మాట్లాడితే విధ్వంసకర మన స్తత్వం అంటారా? సోనియాగాంధీనే కరెంటు బిల్లు కడతారని కాంగ్రెస్ నేతలు చెప్పి నందున.. ఆ బిల్లులను సోనియాగాంధీకి పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు, కార్యకర్తలు ప్రజలను సమాయ త్తం చేయాలి. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల పై తప్పుడు కేసులు పెడుతున్నారు. వారికి పార్టీ లీగల్‌సెల్ అండగా ఉంటుంది. మోదీ కి, రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ భయపడదు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని.. ఆ విప్‌ను ఉల్లంఘించిన వారి సభ్యత్వాలను రద్దు చేయిస్తామని హెచ్చరించారు. గతంలో మల్కాజ్గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయామని, ఈసారి కష్టపడి విజయం చేజిక్కించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మళ్లీ వచ్చేది మన సర్కారే: హరీశ్‌రావు బీఆర్ఎస్కు విజయాలతోపాటు అపజయా లు కూడా ఉన్నాయని, వాటికి కేసీఆర్ కుంగిపోయి ఉంటే తెలంగాణ వచ్చేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని చెప్పారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చి అభాసుపాలైన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ అదే పరిస్థితి వస్తుందని విమర్శించారు. ఎన్నికల కోడ్ బూచిని చూపి హామీల అమలును వాయిదా వేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారంటీలను అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను బొందపెట్టే మొనగాడు పుట్టలేదు సీఎం రేవంత్ విదేశాల్లో తెలంగాణ పరువు తీశారని, రేవంత్ గుంపు మేస్త్రీ పనితనం ఏంటో తేలిపోయిందని మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ను బొందపెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపుగా ప్రవరిస్తున్నారని.. అభివృద్ధి చేయనందుకు బీఆర్ఎస్ ఓడిపోలేదని, కొందరు పిచ్చివాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ పాలనే దిక్కు అని వ్యాఖ్యానించారు. – మాజీ మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి విద్యుత్ బిల్లులను సోనియాకు పంపిస్తాం: కేటీఆర్ ట్వీట్ ‘‘మంత్రి భట్టి విక్రమార్క గారూ.. ఎన్నికల సమయంలో మీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటనలను మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాను. 2023 నవంబర్, డిసెంబర్ నెల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ఆ ఇద్దరు నేతలు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు బిల్లుల చెల్లింపు బాధ్యతను సోనియాగాంధీ తీసుకుంటారని కూడా సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు. కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా ప్రజల నుంచి బిల్లులు వసూలు చేయవద్దని మీ శాఖను ఆదేశించండి. లేదంటే ఆ విద్యుత్ బిల్లులను ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసం 10 జనపథ్‌కు పంపిస్తాం’’ – ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ -
నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధికార కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ, తాజాగా నలుగురు ముఖ్య కాంగ్రెస్ నేతలకు కేబినెట్ హోదా కల్పించింది. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డిని సీఎం సలహాదారుడిగా (ప్రజా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్‌అలీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు), హర్కర వేణుగోపాల్ (ప్రొటోకాల్, ప్రజాసంబంధాలు)లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా, మాజీ ఎంపీ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం రేవంత్ దావోస్ నుంచి రాగానే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరిగింది. అయితే సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ముందు రోజే ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. త్వరలోనే మాకు కూడా...! : మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుదన్న ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. సీఎం దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉండే ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు మొత్తం 9 లేదా 18 కార్పొరేషన్ పదవులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. చాలాకాలంగా అధికారిక పదవుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల నియామకంతో మాకు కూడా త్వరలోనే పదవులు వస్తాయనే ఆశ చిగురించింది. నామినేటెడ్ జాబితా ఎప్పుడొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.’అని కార్పొరేషన్ పదవుల ఆశావహుల లిస్టులో ముందు వరుసలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రస్థాయి పదవులతో పాటు నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం ఉండే మార్కెట్ కమిటీల పదవులపై కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన మార్కెట్ కమిటీలను రద్దు చేస్తానని, కొత్త పాలకవర్గాల నియామకంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కసరత్తు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కీలక పదవులైన మార్కెట్ కమిటీ నియామకాలు కూడా త్వరలోనే జరుగుతాయనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. పలువురి అభినందనలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్లీ, హర్కర వేణుగోపాల్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మల్లురవిలకు పలువురు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే వారి నివాసాలకు కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. పలువురు మంత్రులు కూడా వేర్వేరు ప్రకటనల్లో వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డిలకు వేం, షబ్బీర్, హర్కర, మల్లురవిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా ప్రయత్నిస్తామని వారు వెల్లడించారు. -
బీజేపీ మాస్టర్ ప్లాన్.. కొత్త కోచ్‌తో నేతల్లో టెన్షన్!
ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కొనే సత్తా గల నాయకత్వం ఉండాలి. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంతో పాటు పార్టీలో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగలగాలి. తెలంగాణ కమలం పార్టీకి అటువంటి ఒక కొత్త కోచ్‌ని పంపించింది బీజేపీ జాతీయ నాయకత్వం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించడం కొత్త కోచ్ బాధ్యత. ఆ కొత్త కోచ్ ఎవరో? గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతలేంటి.. తెలంగాణ బీజేపీకి కొత్త కోచ్ వచ్చేశారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. నిజానికి గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓట్లు సీట్లు పెరిగిన మాట వాస్తవమే అయినా బీజేపీ అంతకు మించి ఆశించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండా పోటీలో బరిలో దిగడం వల్లనే ఆశించిన ఫలితాలు దక్కలేదని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును రిపీట్ చేయకూడదని నాయకత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను నియమించారు. బీజేపీ కొత్త కోచ్ ముందు పెను సవాళ్లే ఉన్నాయి. పైకి కనిపించేంతటి తేలికైన జాబ్ అయితే కాదు ఆయనది. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టును ఎట్టకేలకు బీజేపీ హైకమాండ్ భర్తీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సంస్థాగత కార్యదర్శి లేకపోతే ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సంస్థాగత కార్యదర్శిగా బీఎల్ సంతోష్ ఎంత పవర్ ఫులో.. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి అంతే పవర్ ఫుల్. అంటే కొత్త కోచ్ చంద్రశేఖర్‌కు చాలా అధికారాలు ఉంటాయి. పార్టీని ఏకతాటిపై నడిపే క్రమంలో ఆయన తీసుకునే నిర్ణయాలే అంతిమం కానున్నాయి. వాటికి ఎదురు చెప్పే అధికారం ఎవరికీ ఉండదు. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తెరవెనుక కీలకంగా పనిచేసిన చంద్ర శేఖర్‌ను తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ సంస్థగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సక్సెస్ ఫుల్ అయ్యారు. వసుంధర రాజే లాంటి రాటు దేలిన నేతలను పార్టీలో సైలెంట్ చేసిన చంద్ర శేఖర్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడంలో ఏదో ఆంతర్యం లేకపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ రాజకీయ నిర్ణయాల్లో కఠినంగా వ్యవహరిస్తారని టాక్. ఒక్కసారి డిసైడ్ అయితే ఇక తన మాటను తానే వినడని పేరు. అందుకే తెలంగాణకి చంద్రశేఖర్ వంటి ముక్కుసూటి మనిషిని ఏరి కోరి మరీ ఎంపిక చేసింది నాయకత్వం. గతంలో మంత్రి శ్రీనివాస్ తెలంగాణకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంజయ్‌కి మంత్రి శ్రీనివాస్‌తో పొసగలేదు. దీంతో మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్, హర్యానా సంస్థాగత కార్యదర్శిగా బదిలీ చేశారు. అప్పటి నుంచి కోచ్ లేకుండా తెలంగాణ బీజేపీ టీమ్ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసింది. నేతల మధ్య అంతర్గత కలహాలతో పార్టీలో రచ్చ కొనసాగుతోంది. ఈ తగాదాల కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌లు అనూహ్యంగా ఓడిపోయారు. అది బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ పరిస్థితి లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగకూడదన్న ఉద్దేశంతోనే చంద్రశేఖర్‌ను రంగంలోకి దింపారు కమలనాథులు. నేతల మధ్య సమన్వయ లేమి సమస్యను అధిగమించి అత్యధిక పార్లమెంట్ సీట్లను సాధించడం కోచ్ ముందున్న పెద్ద సవాల్. బండి సంజయ్-ఈటల రాజేందర్ల మధ్య సయోధ్య లేదు. కిషన్ రెడ్డి వర్గానికి సంజయ్ వర్గానికి మధ్య మంచి సంబంధాలు లేవు. వీటన్నింటినీ సరిచేసుకుంటూ అందరినీ కలుపుకుపోతూ పార్టీకి విజయాలు తెచ్చిపెట్టాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కొత్త కోచ్.. టీమ్‌ను ఏ విధంగా ముందుకు నడుపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్ర శేఖర్ తెలంగాణ బీజేపీని గాడిలో పెడతారా? బదిలీపై మళ్ళీ వెళ్ళిపోతారా? అన్నది చూడాలి. -
మోదీ, రేవంత్‌రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వచ్చేదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్ నుంచే కట్టొద్దని అన్నారు. ప్రస్తుతం తాను వారి మాటలనే గుర్తు చేశానని తెలిపారు. తాను కరెంట్ బిల్లులు కట్టొద్దంటే డిప్యూటీ సీఎం భట్టి తనది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారని మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా? అని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు కాంగ్రెస్ నేత సోనియా గాంధీకే పంపుదామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇప్పటినుంచే ఒత్తిడి తేవాలని కార్యకర్తలకు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు వాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామని తెలిపారు. కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లి మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని అన్నారు. పీఎం మోదీకి, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు.. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలని కేటీఆర్ అన్నారు. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: సమాజానికి మార్గదర్శకులు అని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దంటూ రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ రాశారు. మీ నిత్య జీవితంలో విలువలు పాటిస్తున్నారా?. ఇతరుల విషయాల్లో మీరు పాటించే సూత్రాలు మీ విషయంలో ఎందుకు పాటించరు?. ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి’’ అంటూ ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనం లో ఉన్నాయి. నాగన్‌పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు. మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ ,ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అంటూ ప్రకాశరావు దుయ్యబట్టారు. ‘‘ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు?. మీరు ప్రజా రహదారులను కబ్జా చేయటం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు. మీ సామ్రాజాన్ని సామాన్యులు చూడకూడదు అనుకుంటే భారీ ప్రహరీలు నిర్మించుకోండి. అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటి?’’ అని ప్రకాశరావు ప్రశ్నించారు. ‘‘రామోజీకి 2024 మార్చి 31 వరకు డెడ్ లైన్. ఈ లోపు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేయాలి. మీ స్టూడియోలో పని చేసే వారిని ఉన్న పళంగా తీసేస్తారు. వారికి జీతాలు ఇవ్వరు. కార్మికుల చట్టాలు ఉల్లఘించారు. రామోజీ పిరికివాడు, చావు అంటే భయం.సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇస్తా. రామోజీ ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి. లేదంటే వైఎస్సార్ పేరు తలుచుకోవడానికి మీరు అర్హులు కాదు. డెడ్ లైన్ లోపు ప్రభుత్వ భూములను రామోజీ తిరిగి అప్పగించాలి. లేదంటే బుల్డోజర్లు పెట్టి మీ గోడలు కూలుస్తా’’ అంటూ గోనె ప్రకాశరావు హెచ్చరించారు. -
ఆయనో పెద్ద కబ్జాకోరు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రంజిత్‌రెడ్డి ఓ పెద్ద కబ్జాకోరు. ఆయన ఫిలింనగర్‌లోని దేవాలయ భూమిని ఆక్రమించాడు. ఆయనపై కోళ్ల దాణా, గుడ్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. గోపన్‌పల్లి, నానక్‌రాంగూడలోనూ విలువైన స్థలాలను కొల్లగొట్టాడు. కేటీఆర్‌కు ఆయన ఓ బినామీ. ఐదేళ్లలో ఆయన చేవెళ్లకు చేసిందేమీ లేదు’ అని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ నేతలు రవికుమార్ యాదవ్, తోకల శ్రీనివాసరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎంపీగా ఆయన ధ్యాసంతా సంపాదనపైనే ఉందన్నారు. లోక్‌సభలో ఏనాడూ చేవెళ్ల ప్రజల కష్టాలను ప్రస్తావించలేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, ఏ ఒక్క రోడ్డునూ వేయించలేక పోయారని విమర్శించారు. సొంత ఫాంహౌస్‌కు ప్రభుత్వ నిధులతో రోడ్డును వేయించుకున్నారని, ప్రస్తుతం ఈ ఫాంహౌస్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలోని పెద్దలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చు కోకపోతే.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడని, బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు హడావుడిగా రంగారెడ్డి–పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారని, పనులు పూర్తి కాక ముందే ప్రారంభించి రైతులను మోసం చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదన్నారు. 111 జీఓ రద్దు చేసినట్లు ప్రకటించినా.. ఇప్పటికీ కోర్టుల్లో కేసు పెండింగ్‌లోనే ఉందన్నారు. శంకర్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూంల పంపిణీలో స్థానికులకు తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. చేవెళ్లను మున్సిపాలిటీ చేస్తున్నట్లు ప్రకటించి, ప్రజలను తప్పుదోవ పట్టించాడని ధ్వజమెత్తారు. పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున పేదల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారని ప్రశ్నించారు. -
రికార్డు బ్రేక్.. మన టార్గెట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన స్ఫూర్తితో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ ఎంపీని భారీ మెజారీ్టతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మన పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. వారందరికీ రెండు లక్షలకుపైగా మెజార్టీ ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ సులభంగానే గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేందుకు మరింత కష్టపడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేమని నిరాశ చెందవద్దు. పక్క పారీ్టవాళ్ల ప్రలోభాలకు లొంగవద్దు. రాజీలేని పోరాటంతో విజయం సాధిస్తాం. మళ్లీ గెలుపు మనదే. అవసరమైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ గెలిచేలా తయారు కావాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో అయ్యేదేమీ లేదని, మళ్లీ పోరాట పటిమతో మన సత్తా చాటాలన్నారు. ప్రజలు పోరాడేలా చేయండి కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, అమలు చేయకపోతే తిరగబడేలా చైతన్యం తేవాలని కేటీఆర్ సూచించారు. అభయహస్తం కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పెన్షన్‌కు అర్హులుంటే ఎంతమందికి వర్తింపజేస్తారో పరిశీలించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెబుతున్నప్పటికీ, రేషన్‌కార్డులు లేని వారికి ఎప్పటిలోగా ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వాటితోపాటు ప్రజల నుంచి అందిన ఇతర ఫిర్యాదులనూ ఆన్లైన్లో నమోదు చేయలేదని, ఈ ప్రక్రియలన్నీ ముగిసి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదని చెబుతూ వీటన్నింటినీ ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి వారు పోరాడేలా చేయాలని చెప్పారు. సమీక్ష సమావేశాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని, భద్రాచలం నుంచి వచి్చన నేతలు సమావేశం ఆసాంతం ఉండగా.. నగర నాయకులు మాత్రం మాట్లాడి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇక లోక్‌సభ ఎన్నికల పనిలో..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టడం ద్వారా మంచి ఊపు మీద ఉన్న ఆ పార్టీ రాష్ట్రంలో కనీసం 12 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందే దిశలో కార్యాచరణ రూపొందించుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే అన్ని పార్లమెంటు స్థానాలకు సమన్వయకర్తలుగా రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించిన ఆ పార్టీ సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. అనుబంధ సంఘాల ఆసరాగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయాన్ని బట్టి కనీసం 12 స్థానాలు సులువుగా సాధించగలమనే అంచనాతో ఉన్న ఆ పార్టీ ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకరిని ఇంచార్జిగా నియమించగా, కొన్ని చోట్ల రెండు స్థానాలకు ఒకే మంత్రికి బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభ స్థానాల వారీగా పార్టీని సమన్వయం చేయడంతో పాటు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చేంతవరకు ఈ సమన్వయకర్తల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక, పార్టీ అనుబంధ సంఘాలను వేదికగా చేసుకుని ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమావేశాలు పూర్తి చేశారు. టీపీసీసీ ఎస్టీ సెల్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మున్షీ, ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సికింద్రాబాద్‌లో క్రిస్టియన్ సంఘాలతో భేటీ అయి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈనెల 25 తర్వాత సీఎం జిల్లాల పర్యటన బూత్‌స్థాయి నుంచి కార్యకర్తలను కదిలించేందుకు హైదరాబాద్ వేదికగా భారీ సమావేశాన్ని కాంగ్రెస్ నిర్వహించబోతోంది. ఈ నెల 25న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై రాష్ట్రంలోని 44వేల మంది పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని, ఆ తర్వాత లోక్‌సభ సమన్వయకర్తల హోదాలో రాష్ట్ర మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా కేడర్‌ను కదలిస్తారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. -
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కల్వ కుంట్ల కుటుంబంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్, ఎంపీ సంతోష్ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు సవాల్ విసిరారు. వీరంతా పోటీచేసినా ఓటమి చెందుతారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోవడం ఖాయమన్నారు. శనివారం రఘునందన్‌రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఉందా.. అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలకు పార్టీ సత్తా ఏంటో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడ తామన్నారు. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్కు అలవాటు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా రూ.వందల కోట్లు సమర్పించుకున్న వారికే టికెట్లు అమ్ముకోవడం బీఆర్ఎస్ అధినా యకులకు అలవాటని రఘునందన్ ఆరోపించారు. పార్టీనే నమ్ము కున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరని వ్యాఖ్యా నించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న ప్పుడే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే హుస్సేన్ సాగర్‌లో వేసినట్టేనన్నారు. ఆ విషయంపై హరీశ్ సమాధానం చెప్పాలి కేఆర్ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందంటూ, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడడం సరికాదని రఘునందన్ అన్నారు. 2014–2019 మధ్య నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమ క్షంలో... కృష్ణానదీ జలాల పంపకాల సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చా లని సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? అని నిలదీశారు. ఈ విషయమై హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కు ఈ విషయాలు తెలియవా అని నిలదీశారు. -
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ముందు వంద రోజుల్లో హామీలు అమలు చెయ్యి!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ముందు వంద రోజుల్లో హామీల అమలుపై దృష్టిపెట్టాలని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడవచ్చని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు పేర్కొన్నారు. మఖలో పెట్టి పుబ్బలో కలసిపోయే పార్టీ అని టీఆర్ఎస్ గురించి చాలా మంది మాట్లాడారని, రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోపల బొందపెడతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్.. తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? మిమ్మల్ని, మీ దొంగ హామీలను ప్రశ్నిస్తునందుకా?’’ అని నిలదీశారు. ఇలా అహంకారంతో మాట్లాడే రేవంత్ వంటి నాయకులను టీఆర్ఎస్ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందన్నారు. శనివారం తెలంగాణ భవన్లో పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకర్గాల సమీక్ష సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఏక్నాథ్ షిండేలా మారుతారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతాయని పేర్కొన్నారు. రేవంత్ రక్తం అంతా బీజేపీదేనని, చోటా మోదీగా రేవంత్ మారారని విమర్శించారు. అదానీ గురించి గతంలో అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు ఆయన వెంటపడుతున్నారని, వారి మధ్య ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్‌గా మారారని ఆరోపించారు. ఎవరూ కరెంటు బిల్లులు కట్టొద్దు ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లులు కట్టవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతిని అమల్లోకి తెచ్చేదాకా బిల్లులు కట్టొద్దన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను సోనియాగాంధీ కడుతుందని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అధికారులు కరెంటు బిల్లులు అడిగితే రేవంత్ చెప్పిన మాటలను వినిపించాలన్నారు. కరెంట్ బిల్లుల ప్రతులను సోనియాగాంధీ నివసించే 10 జన్‌పథ్‌కు పంపించాలన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు రూ.2,500 ఆర్థికసాయం వెంటనే అమల్లోకి తేవాలన్నారు. ఇచ్చిన హామీలపై తప్పించుకోవాలని చూస్తే కాంగ్రెస్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీజేపీతో పొత్తు మాటే లేదు బీఆర్ఎస్కు బీజేపీతో ఏరోజూ పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని కేటీఆర్ చెప్పారు. ఐదేళ్లుగా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే.. కిషన్‌రెడ్డి సీతాఫల్మండి రైల్వేస్టేషన్లో లిఫ్ట్‌ను జాతికి అంకితం చేశారని, ఇదే ఆయన చేసిన అతిపెద్ద పని అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో 36 ఫ్లైఓవర్లు కడితే.. కేంద్ర ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైఓవర్లు కట్టలేక చేతులెత్తేసిందని విమర్శించారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజాపక్షమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్లు మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రైతుబంధు అందడం లేదని, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2,500 ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు హామీలు నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని.. కాంగ్రెస్‌వి ఆరు గ్యారంటీలు కావు, 420 గ్యారంటీలని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబా ద్లో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మాగంటి గోపీనాథ్, వెంకటేశ్, నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, హైదరా బాద్ మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
100 మీటర్ల గొయ్యితీసి..బీఆర్ఎస్ను పాతిపెడతా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌ను బొక్కబోర్లాపడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆనవాళ్లు లేకుండా 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరో, మేమో చూసుకుందామని సవాల్ చేశారు. పులి బయటికి వస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని.. దాని కోసమే ఎదురుచూ స్తున్నానని, తమ దగ్గర బోను, వల ఉందని వ్యాఖ్యానించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి శుక్రవారం లండన్‌లో నిర్వహించిన ‘ఇండియా డయాస్పోరా ఆర్గనైజేషన్స్ మీట్’కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘‘దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీ యాలు మాట్లాడొద్దని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలనుకుని బయలుదేరాను. కానీ ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చ లు.. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి ప్రజలెన్ను కున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూశాక.. లండన్ గడ్డమీద రాజకీయ అంశాలు మాట్లాడదల్చుకున్నా. మంచి పనులకు ఎవరు పునాదిరాయి వేసినా.. వాటిని కొనసాగించడానికి నాకు గానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. కానీ కొందరు తమ కుటుంబం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టి, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. పైగా ఈ రోజు అవినీతి గురించి చర్చే జరగొద్దన్నట్టు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించవద్దన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచంతో పోటీ పడతాం.. మేం సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళుతుంటే కొందరు ఓర్వలేకపో తున్నారు. నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నా. ఇది ఆషామాషీగా రాలేదు. అయ్యనో, తాతనో ఇస్తే రాలేదు. నేను అయ్య పేరు చెప్పుకుని మంత్రి అయ్యి, విదేశీ పర్యటనల పేరు మీద విలాస జీవితం గడపడానికి రాలేదు. రాష్ట్ర అభివృద్ధిని మనసులో పెట్టుకుని వచ్చా. పక్క రాష్ట్రాలతో పోటీపడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీపడే ఆలోచన. ప్రపంచంతో పోటీపడే యువత, హైదరాబాద్ నగరం, ఐటీ మేధావులు, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్, ఐటీ, ఫార్మా కంపెనీలు నా దగ్గరున్నాయి. ప్రపంచంతో పోటీపడతానే తప్ప దివాలా తీసిన దద్దమ్మలతో నాకేం పోటీ? వారికి అధికారం పోయినా అహంకారం, బలుపు తగ్గినట్టు లేదు. మేం బ్రిటన్‌కు వచ్చి ఇంతమంది కుటుంబ సభ్యులను కలిశాం. ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ రావాలి. అక్కడి పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించాలి. ఫొటోలు దిగాలి. థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తాం..’’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ శక్తి, వారసత్వ సంపదకు మీరే ప్రచారకులని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని లండన్‌లోని ఎన్నారైలను కోరారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళతానని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం 60 ఏళ్లలో 16 మంది సీఎంలు రూ.72 వేల కోట్లు అప్పులు చేస్తే.. గత పదేళ్లలో ఒకే ఒక్క కుటుంబం రూ.ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఆ దరిద్రాన్ని మన నెత్తిమీద పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే దిశలో పనిచేస్తామని చెప్పాం. కానీ అసెంబ్లీ మొదలుపెట్టిన రోజునే.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని బిల్లా, రంగాలు అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని, నాయకులను బొక్కబోర్లా పడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదు. ఇంకా మాట్లాడుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం. బిల్లారంగా, చార్లెస్ శోభారాజ్లకు సూటిగా సవాల్ విసురుతున్నా. రెండు రోజుల్లో తెలంగాణ గడ్డమీద కాలుపెడతా. ఈ నెల 26వ తేదీ తర్వాత ఇంద్రవెల్లిలో మొదలుపెట్టి తెలంగాణ నలుమూలలా సుడిగాలి పర్యటన చేస్తా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీ నిషాన్ (ఆనవాళ్లు) లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా. -
కేసీఆర్ పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ, నేతలపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే(1999) మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్.. అయిదుగురు పోటీ చేయాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. వీరెవరు పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్‌లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్ కేసీఆర్‌ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవిలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులి కాదు, పిల్లి అంతకన్నా కాదు. ఎలుక అంటూ ఎద్దేవా చేశారు. బయటకు వచ్చేది పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అంటూ కేసీఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు రఘునందన్‌రావు. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను ఆ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్ల ఇవ్వరు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు లోక్ సభ సీటు ఇవ్వగలరా?. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని గుర్తుచేశారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణ వస్తే అప్పటి సీఎం కేసీఆర్ మొహం చాటేశారు’ అని గుర్తుచేశారు. -
జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ను బొందపెట్టి తీరతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటోళ్లను చాలామందిని చూశామని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ క్రమంలో తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అలాగే జనవరి నెల కరెంట్బిల్లులు ఎవరూ కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతున బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రవేంత్‌రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని.. రెండున్నర దశాబ్దాలు నిలబడి రేవంత్ లాంటోళ్లను మట్టి కరిపించిందని అన్నారాయన. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్? తెలంగాణ తెచ్చినందుకా?.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హమీల్ని ప్రశ్నిస్తునందుకా?’’ కేటీఆర్ నిలదీశారు. ఇదీ చదవండి: లండన్‌లో సీఎం రేవంత్ ఏమన్నారంటే.. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ ఉండబోదని శనివారం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పునరుద్ఘాటించారు. ‘‘రేవంత్ రక్తం అంతా బీజెపీదే. అందుకే ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండు. రేవంత్ కాంగ్రెస్ ఏక్నాథ్ షిండేగా మారతాడు’’ అంటూ కేటీఆర్ పంచ్‌లు వేశారు. కరెంట్ బిల్లుల్ని సోనియాకు పంపించండి అలాగే.. ఈ జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దని.. ఆ బిల్లులను ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. ‘‘ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టొద్దు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు చెప్పిండు. అందుకే కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పత్ కు పంపించాలి’’ అని కేటీఆర్ అన్నారు. అలాగే.. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని.. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
లండన్ పర్యటనలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నిల్లోనూ రిపీట్ అవుతాయని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్ అన్నారు. కాగా, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి.. లండన్ పర్యటనలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ప్రశ్న ఒకటి అయితే ఆయన చెప్పింది ఒకటి చూసి జనం నవ్వుకుంటున్నారు. కారు పార్టీని బొంద పెడతామంటూ రేవంత్ చౌక బారు మాటలు మాట్లాడారు. కేసీఆర్ సంగతి చూస్తానన్న రేవంత్ గురువు చంద్రబాబు ఏం చేయలేకపోయాడు. తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించాడంటూ నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
ఎందుకిలా జరిగింది?.. బీఆర్ఎస్కు ఆ జిల్లా గుదిబండగా మారిందా?
బీఆర్ఎస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా అసలు కలిసి రావటంలేదు.. గత మూడు ఎన్నికల్లో కూడ ఒక్క సీటు మాత్రమే గెలుపోందింది. 2014, 2018 ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఈసారి కూడ అదే సెంటిమెంట్‌లో భాగంగా ఒక్క సీటు వచ్చిన రివర్స్‌గా అధికారం కోల్పోయింది గులాబీ పార్టీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రక్షాళన అవసరమని సొంత పార్టీ నేతలే నుంచే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమాయనికి అయిన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి మారుతుందా? రాష్ట్రంలో బీఆర్ఎస్కు అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని చెప్పాలి. ప్రతిసారి ఇక్కడి ఫలితాలు గులాబీ పార్టీ అధిష్టానంకు నిరాశ గురిచేస్తున్నాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు ఒక గుదిబండలాగా మారిందనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నేత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని శపథం చేసి మరి పది స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో గెలిపించడం బీఆర్ఎస్ పార్టీకి అసలు మింగుడుపడటంలేదు. సవాల్ చేసి మరి మాట నిలబెట్టుకున్నాడన్ వాదన బీఆర్ఏస్ పార్టీలో సైతం వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్తితి ఉందంటేనే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. గత మూడు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికి పరిమితమవుతూ వస్తుంది.. ఏమాత్రం మార్పు రావటంలేదు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఏమ్మేల్యే జలగం వెంకట్రావు గెలుపోందగా.. 2018 ఎన్నికల్లో సైతం అవే ఫలితాలు రిపిట్ అయ్యాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు. అయితే ఈసారి అయిన పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న గులాబీ అధిష్టానానికి మళ్లీ దెబ్బ పడింది. అతి కష్టం మీద మళ్లీ ఉమ్మడి జిల్లాలో ఒకే స్థానం గెలుపొందింది.. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. అయితే ఏప్పుడు సెంటిమెంట్‌లో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానం వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న వాదన వినబడుతు వచ్చింది. దానిలో భాగంగానే 2014,2018లో ఓకే స్థానం గెలిచిన రాష్ట్రంలో అధికారంలో మాత్రం బీఆర్ఏస్ వచ్చింది. అయితే ఈసారి కూడ ఒకే స్థానం గెలిచిన రివర్స్‌గా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో అటు సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు ఇటు మళ్లీ ఒకే స్థానం గెలిచిందన్న భావన ఏర్పడిందన్న గుసగుసలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీని పూర్తిస్తాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సొంత పార్టీ నేతలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. భట్టి విక్కమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు బలమైన నేతలు మంత్రులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెంచకొవాలంటే ఆషామాషీ వ్యవహరం కాదు.. జిల్లాలో నాయకత్వాన్ని మరింత గ్రౌండ్ లెవల్లో పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. ఇలానే వదిలిస్తే జిల్లాలో పార్టీ మరింత వీక్ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు అసలు కలిసిరావటంలేదనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల సమయానికి అయిన గాడినపడుతుందో చూడాలి ఇదీ చదవండి: భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల -
భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల
సాక్షి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెరుగుతుండటంతో ఇక్కడి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో మేయర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్న కార్పొరేటర్లను ఉద్దేశించి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ దుకాణం బయటపడుతుందంటూ కార్పొరేటర్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. తనతో ఉంటే భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. లేదంటే విజయశాంతి తరహాలో జంప్ జిలానీలుగా మారిపోతారంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈనెల 24వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో కేటీఆర్ భేటీ అవుతారని గంగుల చెప్పారు. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంఐఎం బీఆర్ఎస్తోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎమ్మెల్యే సీట్లలో పెద్ద తేడా లేదని, బీజేపీ, ఎంఐఎంను కలుపుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా చోటుచేసుకోవచ్చని గంగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదీచదవండి.. కళ్యాణ కానుకేది..? -
Telangana: నెలాఖరులో రాష్ట్రానికి మోదీ?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధంలో భాగంగా కమలదళం స్పీడ్ పెంచింది. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో 35 శాతం ఓటింగ్‌తో పది సీట్లను గెలుపొందాలంటూ జాతీయ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్ర పార్టీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా విభజించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుతో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్య దర్శులు నలుగురిని ఈ క్లస్టర్లకు ఇన్చార్జిలుగా నియమించారు. వచ్చే నెల 5 తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ ఐదు క్లస్టర్లలో బీజేపీ ఎన్నికల రథయాత్రలను నిర్వహించనున్నారు. రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పదిరోజుల్లో ఆయా లోక్‌సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేయాలని నిర్ణయించారు. క్లస్టర్ల పరిధిలోకి వచ్చే లోక్‌సభ సీట్లలోని ముఖ్యనేతలంతా ఈ రథయాత్రల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలు కవర్ అయ్యేలా రథయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా ఆయా క్లస్టర్ల వారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి అగ్రనేతల వరుస టూర్లు ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చుననే అంచనాల నేపథ్యంలో పార్టీ అగ్రనాయకులు రాష్ట్ర పర్యట నకు రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్ లోక్‌సభ క్లస్టర్ పరిధిలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ క్లస్టర్ పరిధిలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక వివిధ అభివృద్ధికార్యక్రమాలతో పాటు పార్టీపరంగా నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొనేందుకు ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయని పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో మోదీ పాల్గొనవచ్చునని తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదటివారంలో జరిగే పార్టీ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది.