breaking news
-
‘తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే బరిలోకి..’
హైదరాబాద్: రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈసారి 17 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈసారి అసుదుద్దీన్ ఓవైసీ ఓడిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక సర్వేలపై మాట్లాడుతూ.. సర్వేలల వస్తున్న ఫలితాలు నిజం కాదన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయన్నారు. ఇక మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్చేసుకుంటున్నారని, కాళేశ్వరం అవతకకలపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ లేనిపోని రాద్దాంతం చేస్తోందని, కాళేశ్వరం అవకతవకలపై దృష్టి మళ్లించేందుకు ఈ నాటకమని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
Ts: బీఏసీ మీటింగ్ వివాదం.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీశ్‌రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్‌కు బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్‌రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా పేరున్న హరీశ్‌రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్‌రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు వస్తారని బీఆర్ఎస్ తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్‌రావు స్పందించారు. ఒక విజన్‌లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. ‘కొత్త ఆసరా పెన్షన్లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది. మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీచదవండి.. ప్లీజ్ కేటీఆర్..కాంట్రవర్సీ వద్దు -
ప్లీజ్ కేటీఆర్.. కాంట్రవర్సీ వద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీనికాయన స్పందిస్తూ మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఇక ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ అడగగా, ప్లీజ్ దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమే: కొండ సురేఖ
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టులను పెంచి పోషించినది కేసీఆరేనని అన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు? అని నిలదీశారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు కానీ బీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు.. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని కొండ సురేఖ అన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఇదీ చదవండి: ‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’ -
‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’
సాక్షి, హైదరాబాద్: తాను హోం మంత్రిని అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్లో ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. హోం శాఖ అడుగుతున్నా.. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే తనకు హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నానన్నారు. తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకేనన్నారు. తాను హోంమంత్రిని అయితేనే వాళ్లు (బీఆర్ఎస్ నాయకులు) కంట్రోల్లో ఉంటారన్నారు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు బీజేపీయే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. ఇక భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, టెకెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని వివరించారు. -
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. త్వరలోనే ప్రకటన!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ కీలక నేతలు సమావేశమై చర్చించారు. అభిప్రాయ సేకరణలో వచ్చిన వివిధ పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం 17 స్థానాలకు గానూ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితా లోనే ఉండే అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఈనెల 16వ తేదీ లోపు ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థులు వీళ్లేనా.. తెలంగాణాలోని కీలక లోక్‌సభ స్థానాలకు ప్రధానంగా కొన్ని పేర్లను చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి, కరీంనగర్‌కు బండి సంజయ్, నిజామాబాద్‌కు ధర్మపురి అరవింద్, చేవెళ్లకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరికి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌కి డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మల్కాజిగిరి టికెట్‌ను మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. కాగా మహబూబాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, మహబూబ్‌బాద్ లలో కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, అదిలాబాద్ లలో బీఆర్ఎస్ నేతలపై కమలం పార్టీ కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్ లలో ఎవరిని బరిలోకి దించాలని నిర్ణయం కేంద్ర ఎన్నికల కమిటీదే అని చెబుతున్నారు. ఖమ్మం, నల్గొండలలో కూడా బయటి నుంచి వచ్చిన వారికే అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. -
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని అన్నారు. కేసిఆర్ చేసిన పనులను తాము చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితువు పలికారు. సింగరేణిలో ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తోందని చెప్పారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను హైదరాబాద్ లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి కేసీఆర్‌ను ఇష్టానుసారం దూషిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లని డైరెక్టర్లను నియమించారని అన్నారు. తెలంగాణ కు నిరంతర కరెంట్ ఇవ్వడంలో ఆంధ్రవాళ్లు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారని ప్రశ్నించారు. మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్ర అడ్వైసర్ ఎందుకు? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్ -
వాస్తవాలను దాచిపెడతారా.. రూ.లక్ష కట్టండి పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలను దాచిపెట్టిన నలుగురు పిటిషనర్లకు హైకోర్టు రూ.లక్ష భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని లీగల్ సర్వీసెస్ కమిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని సర్వే నంబర్ 57లో 2,432 చదరపు గజాల తమ స్థలంలో టీఎస్పీడీసీఎల్ జోక్యం చేసుకుని, ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోందంటూ మల్లేష్ మరో ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించేందుకు 2013లో నాటి జిల్లా కలెక్టర్ 300 గజాల జాగా కేటాయించారని టీఎస్పీడీసీఎల్ కౌంటర్లో తెలిపింది. అక్కడేమీ ఇల్లు లేదని, పిటిషనర్ల అధీనంలో స్థలం ఉందని వివరించింది. గతంలో సివిల్ కోర్టులో వేసిన దావాను పిటిషనర్లు వెనక్కు తీసుకున్నారని చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. సివిల్ కోర్టులో దావా వేసిన విషయాన్ని హైకోర్టుకు చెప్పలేదని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యథాతథస్థితి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, రెండు వారాల్లో రూ.లక్ష చెల్లించాలని తీర్పునిచ్చారు. -
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తమపై భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 16న నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కేసు పెట్టారని.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి గత నెలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, గండ్ర దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తరహాలో ఈ వర్సిటీ నైపుణ్య మానవ వనరులను అందిస్తుందని వివరించారు. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని చెప్పారు. వర్సిటీ కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారని వ్యాఖ్యానించారు. బుధవారం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. జూన్‌లో హైదరాబాద్‌లో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వనిస్తున్నామని శ్రీధర్‌బాబు వివరించారు. ఏఐ సాంకేతికతలో హైదరాబాద్‌ను గ్లోబల్ హెడ్ క్వార్టర్స్‌గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించామని, టూరిజం అభివృద్ధిని 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ ఖాయం 1990వ దశకంలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఉన్నప్పుడే హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... తాము హైదరాబాద్‌లో ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. టెలిపర్ ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సీఈఓ అనీష్ ముక్కర్‌ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే..
Updates.. ముగిసిన బీఏసీ సమావేశం ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో 4 రోజుల పాటు సమావేశం కానున్న అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం ఈ నెల 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 11వ తేదీన అసెంబ్లీకి సెలవు 12, 13వ తేదీన బడ్జెట్‌పై చర్చ అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేత పత్రం, మేడిగడ్డ విజిలెన్స్ విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్ శ్వేత పత్రం విడుదల ఉండదంటున్న అసెంబ్లీ వర్గాలు ఇప్పటికే ప్రకటన చేశాము కాబట్టి ఖచ్చితంగా ఉంటుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కొత్త రాజ్యాంగామా ఇది: హరీష్ రావు ఫైర్ గతంలో ఇలాంటి సాంప్రదాయం ఉన్నట్టు నిరూపిస్తే నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా గతంలో లేని సంప్రదాయాలు తీసుకోని వస్తున్నారు. బీఏసీ జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. కాంగ్రెస్ కొత్త రాజ్యాంగం తీసుకోని వస్తున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీష్ రావు వస్తారని నిన్ననే స్పీకర్‌కు కేసీఆర్ తెలియజేశారు స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు. జగ్గారెడ్డికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ జగ్గారెడ్డి తన స్థానం నుండే ఆయన గెలవలేదు ఆయన మాపార్టీ ఎమ్మెల్యేలని ఎలా తీసుకెళ్తారు మా ఎమ్మెల్యేలను తీసుకెళ్లంతా దమ్మున్న వ్యక్తులు కాంగ్రెస్‌లో లేరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాకేం అవసరం ఉంది ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అంతర్యుద్ధం తప్పదు తీర్చలేని హామీలు ఇచ్చి మాపై నెపం నెడుతున్నారు బీఏసీ మీటింగ్ నుంచి బయటకు హరీష్ రావు.. బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు కేసీఆర్‌కు బదులుగా బీఏసీ సమావేశానికి వెళ్ళిన హరీష్ తనకు బదులుగా హరీష్ బీఏసీకి వస్తారని ముందే సమాచారం ఇచ్చిన కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు కాసేపటి తర్వాత బీఏసీ నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు హరీష్ రావు బయటకు.. సీఎం రేవంత్ లోపలికి.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఏసీ సమావేశం అసెంబ్లీ సమావేశాల అజెండాపై బీఏసీలో చర్చ బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి హాజరు బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్ధీన్ ►తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు. ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం. అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది. ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం. మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం. దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు. మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించాం. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్, లక్నవరం త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకువస్తాం. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తాం. బస్సులో బల్మూరి వెంకట్.. మొదటి రోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీకి వచ్చిన వెంకట్ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రయాలు తెలుసుకున్న వెంకట్. ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు వెళ్లనున్న బీజేపీ బీజేఎల్పీ లీడర్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కమలం పార్టీ బీజేఎల్పీ నేతను నియమించకపోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం ఫ్లోర్ లీడర్ ఎంపిక అంశం జాతీయ పార్టీ చేతిలో ఉందటున్న రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో రాజా సింగ్‌కి కాకుండా ఎవరికి ఫ్లోర్ లీడర్ ఇస్తే బాగుంటుందనే కసరత్తుల్లోనే బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు వెంకట రమణ రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్ గత సమావేశాల మాదిరిగానే పార్టీ హై కమాండ్ సూచన మేరకు అంశాన్ని బట్టి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం బీఏసీ సమావేశానికి వెళ్లనున్న ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ►తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ►ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ►ఇక, నేడు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. రేపటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. నేడు మిగతా బీఆర్ఎస్ సభ్యులంతా హాజరుకానున్నారు. ►బడ్జెట్లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పార్టీల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు. -
రానున్న కాలం బీఆర్ఎస్దే
జనగామ రూరల్: ‘రానున్న కాలం బీఆర్ఎస్దే. వచ్చే ఐదారు నెలల్లోనే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ పోటీచేసినా ప్రజలు గుర్తించి ఓట్లు వేస్తారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. బట్టేబాజ్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారే తప్ప కష్టపడలేదు. కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పారని, ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. పాలనాపరంగా అవగాహన లేక కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, జూటా మాటలతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. వీరిలో వ్యంగం తప్ప వ్యవహారం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని మొదటి డిక్లరేషన్‌గా చెప్పిన ముఖ్యమంత్రి నేడు మాట మార్చారని ఆరోపించారు. సోనియా గాంధీ పుట్టిన రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు ఆ ఊసే లేదన్నారు. పంట కొనుగోలులో అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ఏదైనా అవసరం ఉంటే సరిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలే తప్ప రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, బీఆర్ఎస్కు ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి దయాకర్‌రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పరేడ్ గ్రౌండ్ బుక్ చేస్తా.. తిట్టుకోండి
హుజూరాబాద్: ‘ఒకరేమో అసెంబ్లీలో మీ సంగతి తేలుస్తానంటారు. ఇంకొకరు నన్ను టచ్ కూడా చేయలేవంటారు. అసెంబ్లీ నిర్వహించుకునేది ఒకరినొకరు తిట్టుకోవడానికా? ప్రజా సమస్యలు పరిష్కరించడానికా? మీరు తిట్టుకోవాలనుకుంటే హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నేనే బుక్ చేస్తా. తిట్టుకుంటారో, కొట్టుకుంటారో అక్కడే తేల్చుకోండి. అసెంబ్లీని మాత్రం ప్రజలకి చ్చిన హామీలను అమలు చేయడానికి వేదికగా మార్చండి’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ‘గావ్ చలో అభియాన్’కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో మంగళవారం రాత్రి బస చేసిన ఆయన బుధవారం ఉదయం గ్రామంలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సర్కారు వద్ద పైసల్లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పారని, మరి ప్రజలకిచ్చిన ఆరుగ్యారంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేషన్‌కార్డు ప్రాతిపదికన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో పదేళ్లుగా అర్హులైన 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారంరోజుల్లో అందరికీ రేషన్‌కార్డులు మంజూరుచేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కొందరు బీఆర్ఎస్ నేత లు హద్దుమీరి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. -
కేసీఆర్‌లో భయం మొదలైంది: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసిన వాడు ఎప్పుడూ బయపడుతాడు.. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పరువు కోసం తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర నీటి వాటను బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గింది. దొంగే దొంగ అన్నట్లు ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ చేసిన ఘనకార్యాలను సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తి లేదు’ అని తెలిపారు జూపల్లి. నీటి వాటా సాధించలేదు.. తెలంగాణ రాష్ట్రం నీటి వాటాను కేసీఆర్ సాదించలేకపోయారని ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు హాజరుకాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా నది కింద ఒక్క ఎకరాకు కొత్తగా నీరు ఇవ్వలేదని అన్నారు. -
బీజేపీకి బాబు మోహన్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. రేపు రాజీనామ లేఖ పంపుతాను. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తా’ అని బాబు మోహన్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం -
18న అభ్యర్థుల ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కసరత్తు పూర్తిచేసి ఈ నెల 18న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగానే లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం లోక్‌సభ ఎన్నికలకు జరగకుండా అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే త్వర లో అభ్యర్థులను ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడేలోగా యాత్రలు.. ఈ నెల 20 నుంచి 17 ఎంపీ సీట్ల పరిధిలో రథ (బస్సు) యాత్రలకు జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్రలను మొదట ఈ నెల 10 నుంచి మొదలుపెట్టాలనుకున్నా అభ్యర్థులు ఖరారయ్యాక చేపడితే మరింత ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి యాత్రలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా (మూడు, నాలుగేసి సీట్లు ఒక్కో క్లస్టర్ చొప్పున) బీజేపీ జాతీయ నాయకత్వం విభజించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఈ యాత్రలను పూర్తిచేయడం ద్వారా మిగతా పార్టీల కంటే ముందే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేసినట్లు అవుతుందని భావిస్తోంది. రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున నెలాఖరుకల్లా ఆయా లోక్‌సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసే యోచనలో పార్టీ ఉంది. త్వరలోనే ఆయా క్లస్టర్లవారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్లు తెలిసింది. సంఘ్ నేతలతో కీలక భేటీ... ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆరెస్సెస్ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ (సంస్థాగత), కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట, అనంతర పరిణామాలు, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పరివార్ క్షేత్రాలు, అనుబంధ సంఘాలతో బీజేపీ కొనసాగించాల్సిన సమన్వయం తదితర అంశాలు చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా పదేళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు. -
బీఆర్ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ సభ!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో బీఆర్ఎస్నిర్వహించనున్న బహిరంగ సభకు పోటీగా 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. గాంధీ భవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మేరకు ప్రతిపాదించగా అందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని విశ్వసనీయంగా తెలియవచ్చింది. సభకు ప్రియాంక గాం«దీని ఆహ్వనించడం ద్వారా బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని, సభను విజయవంతం చేసే బాధ్యత తాను తీసుకుంటానని కోమటిరెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ప్రియాంక సభలోనే మరో రెండు గ్యారంటీలైన గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్సిలిండర్పథకాలను ప్రకటించాలని నిర్ణయించారని తెలిసింది. నేటి మధ్యాహ్నంలోగా ఎంపీ అభ్యర్థుల షార్ట్‌లిస్ట్.. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు ఆశావహుల పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ అభ్యర్థిత్వాల కోసం వచ్చిన 306 దరఖాస్తులను పరిశీలించింది. వాటిలో సామాజిక న్యాయం, గెలుపు అవకాశాల ప్రాతిపదికన ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరి నుంచి ముగ్గురు పేర్లను టిక్ పెట్టనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి పీఈసీ సభ్యులు ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్ట్‌ను సీల్డ్ కవర్లో సమర్పించనున్నారు. టికెట్ల ఖరారు ఎజెండాగా మరోసారి ఈ నెల 15న భేటీ కావాలని ఎన్నికల కమిటీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కదం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతోపాటు పీఈసీ సభ్యులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, వి.హనుమంతరావు, కె. జానారెడ్డి, జీవన్‌రెడ్డి, జె. గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, అంజన్‌కుమార్ యాదవ్, సునీతారావు, అజహరుద్దీన్, శివసేనారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో చర్చకొచ్చిన అంశాలివే.. ► సోనియాగాం«దీని ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కోరగా ఆమె ఎక్కడ పోటీ చేయాలన్నది ఏఐసీసీ అభీష్టమని, వారి నిర్ణయం ప్రకారం ముందుకు వెళదామని రేవంత్ సూచించారు. ► లోక్‌సభ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతోపాటు సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలను పేర్కొంటూ ఓ నివేదికను పీఈసీ సభ్యులకు అందజేశారు. ఇందులో బీసీలను ఇత రుల కేటగిరీలో చేర్చడంపై సీనియర్ నేత వీ హెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించాలని సూచించారు. క్లీన్‌స్వీప్ చేయబోతున్నాం: ఉత్తమ్ లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పీఈసీ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు మోసం చేసినందుకు కేసీఆర్ ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. సమావేశంలో సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, ఉత్తమ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వీహెచ్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్ తదితరులు -
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఆయన... ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటి కి చేరారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత అడుగుపెట్టి నేతలతో సమీక్షించిన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత రెహ్మాన్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డితో కలిసి వెంకటేష్ నేత, మన్నె జీవన్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మ హబూబ్‌నగర్), జనంపల్లి అనిరుద్‌రెడ్డి (జడ్చర్ల), గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరిగి సొంత గూటికి... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన వెంకటేశ్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికలకు మందు రాజకీయల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరఫున 2018లో చెన్నూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2019లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ తిరిగి సొంతగూటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఇస్తే ధర్నా చేస్తా: శేజల్ ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడాడని ఆరిజిన్ డెయిరీ సీఏవో బొడపాటి శేజల్ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని ఎంపీకి చెబితే న్యాయం చేస్తామని మాటిచ్చి మోసం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ ఇలాంటి వారిని చేర్చుకొని ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఢిల్లీలో ధర్నా చేస్తానని, ఎన్నికల్లో వెంకటేశ్ నేతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించారు. -
గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రానివే..
కరీంనగర్‌టౌన్/హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే నిధులిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసా ఇవ్వడం లేదని, పంచాయతీ సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లులు సహా అన్నింటికీ కేంద్రనిధులనే వాడుకుంటున్నారన్నారు. ‘గావ్ చలో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రంగాపూర్ గ్రామానికి వచ్చి న బండి.. రాత్రి పొద్దుపోయే వరకూ గ్రామంలో పర్యటించారు. వివిధ వర్గాల ప్రజలను కలిశారు. పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మహిళలతో ముచ్చటించారు. కాగా, అంతకుముందు ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ‘గావ్ చలో అభియాన్’లో భాగంగా ప్రతి నేత గ్రామాల్లో పల్లెనిద్ర, నగరాల్లో బస్తీ నిద్ర చేయాలన్నారు. 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలని తెలిపారు. రాజకీయ పారీ్టల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమమని అన్నారు. -
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అధికార కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ను బలహీనపర్చడంతోపాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపి విజయం సాధించడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ తెలంగాణకు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, హైదరాబాద్ పరిసరాల్లోని పలువురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని... వారిలో 7–8 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, దక్షిణ తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యేతో కూడా చర్చలు పురోగతిలో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవులు, ప్రలోభాలు, వ్యాపార అవసరాల ప్రాతిపదికన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటం, ఈ ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేకపోవడంతో ఆపరేషన్ ఆకర్‡్షను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం చేయడంపై టీపీసీసీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా తాము నిలబెట్టే మూడో అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందనే భావనను ప్రజల్లో కలిగించొచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలంతా తమ మూడో అభ్యర్థికి ఓటు వేయడం వరకే పరిమితం కావాలని, లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీలో చేర్చుకొనే అంశంపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఏఐసీసీకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని, ఏఐసీసీ అనుమతి మేరకే మూడో అభ్యర్థిని రంగంలోకి దింపుతామని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరో ముగ్గురు.... నలుగురు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఇంకెందరు బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ మారుతారోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏకంగా సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో ఈ చర్చ ఊపందుకుంది. గాంధీ భవన్ వర్గాల సమాచారం ప్రకారం మరో ముగ్గురు, నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన ఆ ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఎస్సీ రిజర్వుడ్, ఇద్దరు జనరల్ స్థానాల నుంచి గెలిచారని, వారు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అయితే వారి చేరిక విషయంలో టికెట్ల కేటాయింపు అంశం కొంత అడ్డంకిగా మారిందని, ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలోకి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇంకో ఎంపీ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికల కంటే ముందే మరో ఇద్దరు లేదా ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వెంకటేశ్ నేతకు తిరిగి ఎంపీ సీటు ఇవ్వొచ్చనే చర్చ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకు అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకొనేందుకు సీఎం రేవంత్ సైలంట్ ఆపరేషన్ నడిపించారని, అనేక సమీకరణాల నేపథ్యంలో వెంకటేశ్ నేత చేరిక అంశం కార్యరూపం దాల్చిందని తెలుస్తోంది. వాస్తవానికి పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఎంపీ టికెట్ వంశీకి ఇవ్వలేకపోతే రాష్ట్ర కేబినెట్లో వివేక్‌కు స్థానం కల్పిస్తారని, వెంకటేశ్‌కు ఎంపీ టికెట్ ఇస్తారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు టికెట్ వంశీకి లేదా పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మరో నేతకు ఇస్తారని, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రభావిత స్థాయిలో ఓట్లున్న సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి వెంకటేశ్‌ను పార్టీలో చేర్చుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. -
టచ్ చేసి చూడు: కేసీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏనాడూ వెనక్కిపోడు. ఉడుత బెదిరింపులకు భయపడడు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నదీ జలాల విషయంలో రాష్ట్రం హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతాం. కొత్త సీఎం బీఆర్ఎస్ పార్టీని, వ్యక్తిగతంగా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్.. తొలిసారిగా మంగళవారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత అంశంపై మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి వాటిల్లే నష్టాలు, ఇతర పర్యవసానాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుసరించిన వైఖరి వారికి వివరించారు. ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేం ‘రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి.. కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారింది. నాగార్జునసాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన జుట్టును కేంద్రం చేతికి అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అధికారంలో ఉన్న పదేళ్లలో కృష్ణా ప్రాజెక్టుల విషయమై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ఏనాడూ తలొగ్గలేదు. ప్రాజెక్టులు తమకు అప్పగించాలని, లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నన్ను బెదిరించారు. కానీ నేను.. కావాలంటే తెలంగాణలో నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా. రాష్ట్రపతి పాలన పెట్టుకో. తెలంగాణకు అన్యాయం చేస్తానంటే మాత్రం అసలు ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తుగడలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది., పదేళ్ల పాటు కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ ప్రాజెక్టులను కాపాడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని సంతకాలు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించింది..’ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుదాం ‘రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్ రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రజా మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర, మూర్ఖపు వైఖరిని తిప్పికొడుతూ, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావలసిన వాటాలను, ఉన్న హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకానైనా పోరాడాల్సిందే. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే.. నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది. తెలంగాణ ఉద్యమకారులది. తెలంగాణ ఉద్యమం సమయంలోనే సాగు, తాగునీటి హక్కుల కోసం పోరాడాం. ‘మా నీళ్లు మాకే ’ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజా క్షేత్రంలో ఎండగడదాం..’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలన చేతకాక రేవంత్ కారుకూతలు ‘అసెంబ్లీలో మనం తక్కువేంలేం..39 మందిమి ఉన్నాం. ప్రతి అంశాన్ని అక్కడ ఎండగడతాం. ఈ సీఎం ఎక్కువ మాట్లాడుతున్నాడు. సీఎం అనేటోడు ఈరోజు ఉంటాడు. రేపు పోతాడు. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. మీరు ఎవరూ గాబరా పడొద్దు. రేవంత్‌వి పిల్ల చేష్టలు. పాలన చేతకాక నా మీద కారు కూతలు కూస్తున్నడట. నల్లగొండలో సభ పెట్టనివ్వరట. మన సభను అడ్డుకునేది ఎవ్వడు? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవ్వడు అడ్డుకోవడానికి. నల్లగొండ ఆయన జాగీరా? ఎట్లా పెట్టుకోనివ్వరో చూద్దాం. ఇలాంటి వాళ్లను చాలామందిని చూసినం. ఈ ప్రభుత్వాన్ని మనం కూల్చాల్సిన అవసరం లేదు ప్రాజెక్టుల విషయంలో మన ఎమ్మేల్యేలు సభలో కొట్లాడతరు. మనం అందరం వెళ్లి నల్లగొండలో కొట్లాడుదాం. మనం ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రకటించిన పథకాలు అమలు చేయలేక వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తది. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వెయ్యి శాతం మనమే అధికారంలోకి వస్తాం..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ సభను విజయవంతం చేయాలి తెలంగాణ భవన్లో సమావేశానంతరం నందినగర్ నివాసంలో కేసీఆర్ మరోసారి నాయకులతో సమావేశమయ్యారు. ఈ నెల 13న నల్లగొండలో బహిరంగసభ నిర్వహణపై ఉమ్మడి ఖమ్మం , మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు సమన్వయ కర్తలతో చర్చించారు. ప్రాజెక్టుల అప్పగింతతో ఎదురయ్యే దుష్పరిణామాలు తెలంగాణ సమాజానికి తెలిసేలా ఈ సభను విజయవంతం చేయాలని సూచించారు. -
TS: బీజేపీ నేతలపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై సంఘ్ పరివార్(ఆర్ఎస్ఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితిపై పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంఘ్ పరివార్ నేతలకు వివరించారు. ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు గెలవాలనే దానిపై ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలకు బీజేపీ నాయకులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఈసారి పదికిపైగా స్థానాలు గెలిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని బీజేపీ నేతలు చెప్పారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ ఎంపీలు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతల తీరు, వ్యవహారంపై సంఘ్ పరివార్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ నేతల మధ్య విభేదాలపై పరివార్ నేతలు గట్టిగానే అడిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఎన్నికల సమయానికి చెడగొట్టుకున్నారని మొట్టికాయలు వేశారు. ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ముందే ప్రకటించాలని సూచించారు. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు సమాధానమిచ్చారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ నుంచి సంఘ్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శులు ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ నుంచి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇదీ.. చదవండి.. కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ -
నీళ్ల గురించి తెలియకే.. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
సాక్షి,హైదరాబాద్: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్‌కు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేదని మాజీ సీఎం కేసీఆర్ చేసీన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. అసులు కేసీఆర్‌కు నీళ్ల గురించి ఏం అవగాహన లేదని అన్నారు. కేసీఆర్‌కు నీళ్ల గురించి ఏం తెలియదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి నీళ్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టే కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవటమే కేసీఆర్ తెలుసని.. అలా చేయటం కాంగ్రెస్‌కు తెలియదని అన్నారు. ఇక.. టీఆర్‌ఎసీ నిర్వహించే నల్గొండ సభ కంటే ముందే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం నల్గొండలో సభ పెట్టడం కాదని.. సీఎం కేసీఆర్ కృష్ణా జలాలపై చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ‘తప్పు చేసిన వారిని బొక్కలో వేస్తాం. కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మేం అడిగిన ప్రశ్నలకి కేసీఆర్ సమాధానం చెప్పడం లేదు. కేసీఆర్ వల్ల తెలంగాణకి తీవ్రమైన నష్టం కలిగింది. అట్టహాసంగా చేసిన ప్రాజెక్టులు కులిపోతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరంపై వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్‌ను ప్రవేశ పెడతాం’ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నల్గొండ సభలోపే.. చాలా మంది కాంగ్రెస్‌లోకి! కేసీఆర్ తెలివి తక్కువోడు కాబట్టే కాళేశ్వరం కుప్పకూలిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఉంటదో, ఊడుతదో నాలుగు రోజుల్లో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ కు తీవ్ర నష్టం జరిగిందని, నల్లగొండ సభ పెట్టే లోపే చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు -
సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా మనకు ముఖ్యమని బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ అంశంపై మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన పార్టీ నేతలతో భేటీ జరిపారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్లే చేశారాయన. ‘‘నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. నీ కన్నా హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ‘‘కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. డ్యాంకు సున్నం వేయాలన్నా కూడా బోర్డు అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు. కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ అవగాహన లేకే అప్పగింతకు ఒప్పుకున్నారు. .. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవడం పైనే ఇక మన పోరాటం. నల్గొండలో భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉధృతం చేద్దాం’’ అని పిలుపు ఇచ్చారు. 13వ తేదీన నల్గొండ లో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ‘‘నల్లగొండ సభకు నల్లగొండతో పాటు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలి. .. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్ట్‌లు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నల్లగొండ లో సభ జరిగి తీరుతుంది అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్స్ ఇక ఈ భేటీలో కేఆర్ఎంబీ వివాదంతో పాటు కాంగ్రెస్ ఆరోపణలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ‘‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్ట్ లు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని నన్ను బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో.. నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా.. తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా. .. నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఏనాడూ వెనక్కి పోడు.. ఉడుత బెదిరింపులకు భయపడను. ముందు ముందు ఏందో చూద్దాం...తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్‌లో చేరిపోయారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత BRS Peddapally MP Venkatesh Neta joined Congress ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)… pic.twitter.com/To99hdcLru — Congress for Telangana (@Congress4TS) February 6, 2024 కాగా, ఎంపీ వెంకటేష్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇక, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.