breaking news
-
రేవంత్‌ను చూసి ఎవరూ భయపడరు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటున్నడు. ఎక్కడ జరిగిందో చెప్పకుండా యూట్యూబ్ చానళ్లు, మీడియాకు లీకులు ఇస్తూ ఏదో జరిగిందనే ప్రచారం చేస్తున్నడు. నీ చేతిలో అధికారం ఉంది కదా.. విచారణ చేసి తప్పులు ఎక్కడ జరిగాయో బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకో. ఎవడికీ భయపడేది లేదు. నువ్వు వెంట్రుక కూడా పీకలేవు. ఇలాంటి వాటిని చూసి కేడర్ ఆగం కావద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని చెబుతున్న రేవంత్ గతంలో ఏం చేసెటోడో తెలియదు. జేబులో కత్తెరలు పెట్టుకుని తిరుగుతున్న జేబుదొంగ రేవంత్.. పేగులు మెడలో వేసుకునేందుకు నువ్వేమైనా బోటీ కొట్టెటోడివా. మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదు. పార్లమెంటు ఎన్నికల డబ్బుల కోసం రైస్ మిల్లర్లు, రియల్టర్లు, బిల్డర్లపై దాడులు చేసి బెదిరించి రూ.2500 కోట్లు జమ చేసి ఢిల్లీకి కప్పం కట్టిండు. ఇది దోపిడీ సొమ్ము కాదా. ఇలాంటివి బయటకు రాకుండా బర్లు, గొర్ల స్కీమ్‌లంటూ ప్రజల మెదళ్లలో తప్పుడు సమాచారం నింపేందుకు చానళ్లలో కేసీఆర్‌ను తిడుతూ దొంగ మాటలు చెప్తున్నడు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, కరెంటు, మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4వేలు, కళ్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వలేని ఇతనా మన సీఎం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలో మొట్టమొదట చేరేది రేవంత్ ‘కేంద్రంలో బీజేపీని ఆపే శక్తి, ధైర్యం కాంగ్రెస్‌కు లేవు. ఎన్నికల రేసులో ఎవరూ ఉండొద్దని మోదీ ప్రయత్నిస్తున్నారు. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి నేతలకు మాత్రమే బీజేపీని అడ్డుకునే శక్తి ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీని చౌకీదార్ అంటే రేవంత్ మాత్రం బడేభాయ్ అంటున్నడు. అదానీ మంచివాడు కాదని రాహుల్ అంటే, రేవంత్ మాత్రం కౌగిలించుకుని ఫొటోలు తీసుకుంటుండు. లిక్కర్ స్కామ్ ఏమీ లేదు, కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అని రాహుల్ అంటే, కవిత అరెస్టును ఇక్కడి సీఎం సమర్థిస్తాడు. కాంగ్రెస్‌లో రాహుల్ గాం«దీ, రేవంత్‌కు నడుమ పొంతన కుదరడం లేదు. దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకు మించి గెలవదు. 40 సీట్లు దాటకుంటే వెంటనే తనతోపాటు మరికొందరిని మూటగట్టుకుని బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఈ విషయంలో ఎన్నిమార్లు ఆయనపై విమర్శలు చేసినా స్పందించక పోవడం వెనుక మతలబు ఇదే. జీవితకాలమంతా కాంగ్రెస్‌లో కొనసాగుతానని రేవంత్ చెప్పకపోవడమే దీనికి నిదర్శనం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు.. ‘కాంగ్రెస్ కొన్ని యూట్యూబ్ చానళ్లను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తుంటే.. బీజేపీ రాముడి పేరును చెప్పి నాటకం ఆడుతోంది. ప్రతిపక్షాల నేతలపై కేసులతో గొంతు నొక్కి జైలుకు పంపి మానసికంగా వేధిస్తోంది. లిక్కర్ స్కామ్ బయట పెడతానని అంటున్న కిషన్‌రెడ్డి ఆధారాలను కోర్టుకు సమర్పించాలి. ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు కోసం అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఇతర రాష్ట్ర నేతలను కలిసిన మల్లన్న కరీంనగర్ నుంచి పోటీకి సానుకూలత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన పేరును సీఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ నుంచి సునీల్‌రెడ్డి, దిల్‌రాజు తదితరుల పేర్లు పరిశీలించినా, చివరి కి టి.జీవన్‌రెడ్డి వైపే నేతల మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆయనకు సీఎం వర్గం బలమైన మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక భువనగిరి స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కొన్ని పేర్లను ప్రతిపాదిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం చామల కిరణ్ కుమార్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయనకే టిక్కెట్ దక్కేలా రేవంత్ ఇప్పటికే ఏఐసీసీ కీలక నేతలను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరు పేర్లను పరిగణనలోకి తీసుకుని విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. గురువారం జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్‌తో మహేశ్‌గౌడ్ భేటీ గాంధీభవన్ వేదికగా ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో సభ తుక్కుగూడలో వచ్చే నెల ఆరో తేదీన భారీ బహిరంగసభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనజాత ర సభకు రాహుల్, ఖర్గే లాంటి కీలక నేతలు రానుండడం, జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండడంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. -
పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా?
సాక్షి, హైదరాబాద్: పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వా లా? అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ అభ్యర్థులకు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేయాలని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చిందని, ఇక్కడి నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్య ర్థులను లోక్‌సభకు పంపిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగు తుందని చెప్పారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏం చూసి మోదీకి ఓటేయమంటారు? ‘గత పదేళ్లలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ ఎందుకు తేలేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోదీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులెందుకు ఇవ్వలేదు? రీజినల్ రింగు రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు..’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అన్నీ బేరీజు వేసిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ‘రాష్ట్రంలో ఈసారి 14 లోక్‌సభ స్థానాల్లో గెలవా లన్న పట్టుదలతో పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేలు అన్నీ బేరీజు వేసిన తర్వాతనే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానితో మరొకదానికి సంబంధాలున్నాయి. ఇలాంటివన్నీ ఆలోచించిన తర్వాతే ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశాం. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వందరోజుల పాలనకు రెఫరెండం లాంటివి. తెలంగాణలో 14 స్థానాలు గెలిచి సోనియాకు కృతజ్ఞతలు చెబుదాం..’ అని సీఎం అన్నారు. 6 లేదా 7న రాష్ట్రానికి ఖర్గే, రాహుల్ ‘కార్యకర్తలకు అండగా నిలబడడంతోపాటు దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్‌గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు. రాహుల్, సోనియాగాంధీల నాయకత్వాన్ని బలపరిచే బాధ్యత అందరిపై ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగూడలో ఆరు గ్యారంటీలు ప్రకటించుకున్నాం. మళ్లీ అదే తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీల్లో జాతీయ స్థాయి గ్యారంటీలను ప్రకటించుకోబోతున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నాం. ఈ జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతోపాటు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరవుతారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. డోర్లు తెరిచి దొంగల్ని కూడా తీసుకొస్తే కష్టం కేఎల్లార్ వ్యాఖ్యలు వైరల్ ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మా ధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ‘డోర్ తెరుస్తాం... డోర్ తెరుస్తాం అని అంటున్నారు. మీరు డోర్లు తెరిచి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన దొంగలను కూడా లోపలికి తీసుకొస్తే మా లాంటోళ్లు, కార్యకర్తలు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కేఎల్లార్‌కు, రేవంత్‌రెడ్డికి పడదేమో అని అక్కడక్కడా కార్యకర్తలు అనుకుంటున్నారు. మనమిద్దరం దగ్గరి మిత్రులం అనే విషయం వాళ్లకు తెలియదు. నేను చెప్పినా నమ్మేటట్టు లేరు. కాబట్టి మీరు చెప్పాలి..’ అని కేఎల్లార్ వ్యాఖ్యానించారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. -
నచ్చినోళ్లు జేబులో... నచ్చనోళ్లు జైలులో
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్: నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ ముఖ్య కార్య కర్తల సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు. దేశంలో ప్రతిపక్షపార్టీల మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ కవిత అరెస్టయి ఉండేవారా అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును రాహుల్‌గాంధీ ఖండిస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం సమర్థిస్తున్నా రని, రేవంత్‌రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రా..? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా అని నిలదీశారు. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే సీఎం రేవంత్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు, 38 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్కరినీ పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. చోటే భాయ్‌కి బడే భాయ్ ఆశీర్వాదం చోటే భాయ్ సీఎం రేవంత్‌రెడ్డి.. బడే భాయ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నా రని, బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక్క ముస్లింను కూడా కేబినేట్లోకి తీసుకోలేదని విమర్శించారు. మైనార్టీల సంక్షేమ బడ్జెట్లోనూ కోత విధిస్తున్నారని, కనీసం రంజాన్ తోఫా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్.. రేవంత్, కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌పై పొలిటికల్ ఫైట్ నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపాలని తెలిపారు. ఎవరెవరు తప్పులు చేశారో బయటపెట్టాలని అన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్చలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని.. రేవంత్ రెడ్డి తననేం చేయలేడని అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దని.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని హెచ్చరించారు. ‘లిక్కర్ స్కాంలో ఏం ఉందో అదంతా బయటపెడుతా అని కిషన్ రెడ్డి అంటున్నాడు. ఆ కేసు కోర్టులోనే ఉంది. నిజంగా తప్పు జరిగితే కోర్టులో పెట్టు.. కోర్టులో జడ్జి శిక్ష వేస్తారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకునుడు కాదు.. సికింద్రాబాద్‌కు ఏం చేశావో చెప్పి ఓట్లు అడుగు’ అని కేటీఆర్ సూచించారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్ -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఫోన్లూ ట్యాపింగ్ తమ ఆఫీసులో పనిచేసిన నేతలు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. 2019లో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తుంటే తమ కార్యాలయ సిబ్బందిని బంధించారని తెలిపారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి తమ వాళ్లను బంధించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఈ కేసులో ఉన్నారని తెలిసిందన్నారు కిషన్ రెడ్డి. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో మాత్రమే అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందన్నారు. అవినీతి, అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం అతిపెద్ద నేరమని తెలిపారు. రాజకీయ నేతలవే కాకుండా వ్యాపారస్తుల ఫోన్ల ద్వారా వ్యక్తిగత విషయాలు ట్యాపింగ్ చేశారని విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని మండిపడ్డారు కవిత పాత్ర లేకపోతే బహిరంగ చర్చకు రావాలి ‘కవిత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అంటున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా?. కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సమాధానం చెప్పాలి. షెల్ కంపెనీలు పెట్టీ బినామీ వ్యక్తుల్ని పెట్టరా లేదా..? ఆప్ ప్రభుత్వంతో కవిత చర్చలు జరిపారా లేదా? రూ. వందల కోట్లు చేతులు మారాయా లేదా? అని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాంపై కేసీఆర్ స్పందించాలి.క విత లిక్కర్ వ్యాపారానికి, అరెస్టుకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌కు సవాల్ కవితది అక్రమ కేసు అనుకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా..?. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు ఆడటంలో అగ్రగాములు. కడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని కవిత అన్నారు. ఎందులో కడిగించుకొని వస్తారో చెప్పాలి. సికింద్రాబాద్‌కు కేంద్రమంత్రిగా ఎం చేశానో ప్రజలకు తెలుసు. కేటీఆర్‌కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేనూ బాధితుడినే: రఘునందన్ రావు 2 జూన్ 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ , 2015 ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాప్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ రెండో బాధితుడు రఘునందన్ రావు. బీజేపీ నేత BL సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరుపుతారా? మీకు చిత్త శుద్ధి ఉందా సీఎం రేవంత్?. మీ బిడ్డ పెళ్లికి పేరోల్ మీద బయటికి వచ్చారు. మీరు అధికారులను ఎందుకు క్షమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత డీజీఏపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? కేసీఆర్@ A1 అమెరికాకి ఇద్దరు వ్యక్తుల్ని ఎవరు పంపారు తెలియాలి. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఏంతకు కొన్నారు తెలియాలి. సీఎం రేవంత్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మీకు నచ్చినట్టు విచారణ జరిపిస్తే ఎలా? రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు, కేసీఆర్‌కు తెలియదా? ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్‌ను పెట్టాలి. రెండో ముద్దాయి హరీష్ రావుని పెట్టాలి. మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. ఆ తర్వాతే మిగతా పోలీస్ ఆఫీసర్లు. మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిన కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి. కుటుంబ సభ్యుల ఫోన్లు వినే అధికారం ఎవరికి లేదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్. రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి. ఓ టీవీ ఛానెల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇంతకీ దిగజారుతారా?. నేను బాధితుడిగా మాట్లాడుతున్నకేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్ పోర్టు సీజ్ చేయాలి. రేవంత్‌తో హరీష్‌రావు విమాన ప్రయాణం? నిన్న మాజీ మంత్రులు ముగ్గురు రహస్య సమావేశం అయ్యారు. కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 19 మార్చి రాత్రి 10.15కి సీఎం రేవంత్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారు. విమానంలో రెండు గంటలు ఇద్దరు ఏం మాట్లాడారో తెలియాలి. సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య ఏం సంభాషణ జరిగింది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ టికెట్ గురించి చర్చ జరిగిందా?. 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వస్తాను అన్నావా?. మెదక్ ఎంపీ ఎన్నికల వరకు మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోకి తోసుకోకుమని చెప్పావా?. అసలేం మాట్లాడారో తెలియాలి. సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్లను అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే ముగ్గురు విదేశాలకి పారిపోయారు అంటున్నారు. వీళ్ళని కూడా విదేశాలకు పొమ్మంటున్నారా?. 2015లో డీజీపీ ఎవరో అతన్ని విచారించాలి. హైకోర్టు జడ్జీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక సంస్థ నుంచి ఎత్తుకు వచ్చారు. ఈ కేసులో అందరిని ముద్దాయిలుగా చేర్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు సైతం.. ఈ కేసులో కొందరిని ఇరికించి కొందరిని కాపాడే కుట్ర జరుగుతుంది. సీఎం రేవంత్, డీజీపీ ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నా. నాకు నోటీస్‌లు పంపిస్తే నా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా నిజాలు తెలుస్తారా సీఎం చెప్పాలి. ట్యాపింగ్ జరగపోతే కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? బీఎల్ సంతోష్‌ను అనవసరంగా కేసులో ఇరికించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతాం అంటే కేసీఆర్ బెదిరించి ఇలా ప్లాన్ చేశారు. బీఎల్ సంతోష్ కేసులో ఆడియో, వీడియోలు కేసీఆర్ చూపెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఇవన్నీ కేసీఆర్‌కు ఎలా తెలుస్తాయి? హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ఈకేసుని విచారణ చేయాలి. సీబీఐపై నమ్మకం ఉంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. అందరూ అధికారులు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలి’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. -
కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అధికార కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు పగబట్టి కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటది ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని అన్నారు. దానం అవకాశవాది పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడని, ఆయనకు ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదని హితవు పలికారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అనర్హత వేటు వేయకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయన్ను అనర్హుడిగా ప్రకటింపజేస్తామని చెప్పారు. మనకు పోటీ బీజేపీతోటే.. ‘సికింద్రాబాద్ లో మనకి పోటీ బీజేపీతోనే. కాంగ్రెస్ మనకు పోటీ కాదు. కిషన్ రెడ్డి సికింద్రబాద్‌లో ఎంపీగా ఉండి చేసిందేమీ లేదు. అంబర్ పేటలో పోటీ చేయకుండా భయపడి వెళ్ళాడు. ఈ సారి కిషన్ రెడ్డికి సానుభూతి లేదు. కరోనా సమయంలో కుర్ కురేలు పంచాడు. అతన్ని చాలామంది కిషన్ రెడ్డి అనటం లేదు. కుర్ కురె రెడ్డి అంటున్నారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్లో లిఫ్టులు ప్రారంభం చేస్తున్నాడు. అంబర్ పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్లు పూర్తి చేయించలేని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నాడు . బీఆర్ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మళ్లీ ప్రారంభం సికింద్రాబాద్‌లో విఫలమైన ఎంపీ కిషన్ రెడ్డి, ఎటు అధికారం ఉంటే అటు పోయే దానం నాగేందర్, వ్యక్తిత్వం, సాయపడే గుణం ఉన్న పద్మారావు పోటీలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కిషన్ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్ గెలుపుతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని చెప్పారు.. కాంగ్రెస్‌కు 40 కూడా రావు.. బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా.. బీజేపీనా అర్థం కావడం లేదు. చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ బడే భాయ్ అంటారు. నరేంద్ర మోదీ చోటా భాయ్ రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతారు. రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డినే. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని సీఎం ఎందుకు చెప్పడం లేదు? లంకెబిందెల కోసం అర్ధరాత్రి దొంగలు తిరగతారు. పేగులు మెడలో వేసుకుంటా అంటారు.. ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేవారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగే వాళ్ళు పక్కా జేబు దొంగలు. జేబులో కత్తెర ఉంటే ఏమైనా అయితే జాగ్రత్త. భయపడేవాళ్లు లేరు లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారు... కోర్టుకు ఇవ్వండి ఎవరు వద్దన్నారు? పనిచేయ చేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నారు, తప్పు జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోండి. భయపడే వాళ్లు లేరు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు రూ 2,500 కోట్లు సిద్దం చేశారు. అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారు? హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారు... బీఆర్ఎస్ తరపున పోరాడతాం. కాంగ్రెస్ నమ్ముకొన్నది అబద్దాల ప్రచారం మాత్రమే. జై శ్రీరాం ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కడిగిన ముత్యంలా బయటకొస్తా.. కవిత సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలకు దిగారు. ఈడీ తనపై పెట్టింది మనీలాండరింగ్ కేసు కాదని.. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారామె. ఈ క్రమంలో తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నేను తప్పుచేయలేదు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది మనీల్యాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైల్లో పెడతారేమో.. నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బ తీయలేరు. .. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాడు. ఇది తప్పుడు కేసు. క్లీన్‌గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారేది లేదు. జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేస్తూ కోర్టు హాల్లోనికి వెళ్లారు. మరోవైపు ఆమె మద్దతుదారులు, బీఆర్ఎస్ నేతలు కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ కనిపించారు. -
శరణ్ చౌదరి ఎవరో తెలియదు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: తనపై శరణ్ చౌదరి ఆరోపణలు చేశారని తన దృష్టికి వచ్చిందని.. ఆయన ఎవరో తెలియదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, శరణ్ చౌదరి బీజేపీలో ఉన్నాడని తెలిసింది. శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ఎర్రబెల్లి అన్నారు. ‘‘దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డారు. ఎన్.ఆర్.ఐ.విజయ్‌కు, శరణ్ చౌదరి రెండు కోట్లు బాకీ వున్నారు శరణ్ చౌదరిపై చాలా కేసులు వున్నాయి. శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ ఎవరో నాకు పరిచయం లేదు. శరణ్ చౌదరి, అతని భార్య పాస్ పోర్టులను పోలీసులు సీజ్ చేశారు. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా.. ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు’’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ప్రణీత్ రావు వాళ్ల బంధువులు మా ఊర్లో ఉంటారని తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదు. నేను పార్టీ మారను. పార్టీ మారాలని నాపై పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’’ అని దయాకర్‌రావు తెలిపారు. ‘‘శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ నాకు బంధువు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను అనేక కేసులు ఎదుర్కొన్నాను. గతంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రజల కోసం జైలుకు వెళ్లాను’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 15 జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియర్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ జ్యూడీషియల్ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. అయితే.. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలి’’ :::కవిత ఈడీ జ్యుడీషియల్ రిమాండ్ రిపోర్ట్ ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే.. కవిత బెయిల్ పిటిషన్‌పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెబుతూ.. ఏప్రిల్ 1వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. బెయిల్‌పై వాదనల సందర్భంగా.. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అయితే.. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్. ఇక విచారణ సందర్భంగా.. కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని అన్నారామె. అదే సమయంలో ఆమె తన భర్త అనిల్, బంధువులను కలిసి మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది. ఇదీ చదవండి- అప్రూవర్‌గా మారను.. క్లీన్‌గా బయటకొస్తా: కవిత కవిత మేనల్లుడి అరెస్ట్‌కు రంగం సిద్ధం? మరోవైపు ఇవాళ లిక్కర్ స్కాం కేసులో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఈడీ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ సొమ్ము బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరణ్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. -
‘యాక్షన్’ ప్లాన్‌తో.. రెట్టించిన ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘ఎలక్షన్ యాక్షన్ ప్లాన్’ రెడీకావడంతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో కార్యక్షేత్రంలోకి దిగుతోంది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల కంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. ఎన్నికల సన్నద్ధతలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అన్నిస్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. పోలింగ్ బూత్ స్థాయి నుంచీ ›ప్రజల మద్దతు కూడగట్టేలా జాతీయనాయకత్వం పకడ్బందీ కార్యాచరణను రూపొందించింది. ఈ క్రమంలో భారీ ఎత్తున ‘ఓటర్ మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ ద్వారా ఇంటింటి ప్రచారం చేపట్టాలని.. ప్రతీ ఓటర్ను కలసి పార్టీ అభ్యర్దికి ఓటేసేలా ఒప్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ప్రతి లోక్‌సభ స్థానం పరిధిలో శాసనసభ నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనాలు, ఓటర్లతో భేటీలు చేపట్టాలని ఆదేశించింది. రెండు దశల్లో ప్రచారానికి ప్రణాళిక రాష్ట్రంలో రెండు దశల్లో ప్రచారంతో ఎలక్షన్ మేనేజ్మెంట్ వైపు బీజేపీ అడుగులు వేస్తోంది. తొలిదశలో నామినేషన్ల పర్వం ముగిసే వరకు (ఏప్రిల్ 25దాకా) రాష్ట్ర ముఖ్యనేతలు మొదలు సామాన్య కార్యకర్త వరకు అనుసరించాల్సిన రూట్‌మ్యాప్‌ను ఆదివారమే ప్రకటించింది. రెండోదశలో అంటే ఏప్రిల్ 25 నుంచి మే 13న పోలింగ్ ముగిసేదాకా పోలింగ్ బూత్ స్థాయిలో చేపట్టాల్సిన ఎలక్షన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించి.. అన్నిచోట్లా పక్కా ప్లానింగ్‌తో ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌కు ఇంకా నెలన్నరకుపైగా సమయం ఉండటంతో భారీ బహిరంగ సభల కంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న సభలు నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచీ.. బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాల దృష్టి అంతా పోలింగ్ బూత్ స్థాయి నుంచీ పార్టీ బలోపేతంతోపాటు, పార్టీ కేడర్ కార్యకలాపాలపైనే పెట్టాయి. పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు సాధించేలా చేయడాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో టిఫిన్ బైఠక్‌లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యాచరణతో నేతలు ముందుకు వెళ్తున్నారు. దీనికితోడు యువత, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతులతో తరచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్లేలా ‘హర్ ఘర్ తీన్ బార్’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. జాతీయ, రాష్ట్రస్థాయి నేతల ప్రచారంతో.. రాష్ట్రంలో మిగతా పార్టీల కంటే ముందే తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయనుండటం, స్వయంగా ప్రధాని మోదీ, ఇతర జాతీయ నేతలు ప్రచార సభల్లో పాల్గొననుండటం బీజేపీకి కలసి వస్తుందని ఆ పార్టీ ముఖ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. -
నేటి నుంచి భేటీలతో దూకుడు
సాక్షి, హైదరాబాద్: పార్టీ అభ్యర్థులంతా ఖరారైన నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచాలని, క్షేత్రస్థాయి శ్రేణులను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నుంచి లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ భేటీలకు పార్టీ ఎంపీ అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ భేటీలను పూర్తిచేసి క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని అభ్యర్థులను ఆదేశించారు. మరోవైపు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, కరువు పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. ప్రచార షెడ్యూల్‌పై కొనసాగుతున్న భేటీలు ఏప్రిల్ రెండో వారం నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పరేడ్ మైదానంలో భారీ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు లక్ష్యంగా ఎజెండా.. ఎన్నికల ప్రచార షెడ్యూల్, ప్రచార ఎజెండా తదితరాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌రావు, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు, ప్రచారం చేయాలని పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల ఉల్లంఘన, అప్రజాస్వామిక విధానాలు, బెదిరింపులు, వేధింపులు వంటి అంశాలను ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో బీజేపీ నియంతృత్వం, అణచివేత విధానాలు, లౌకికత్వానికి పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలనూ ఎత్తి చూపాలని భావిస్తున్నట్టు సమాచారం. జెండా మోసిన వారికే పెద్దపీట పార్టీ జెండా మోసిన వారికి పెద్దపీట వేస్తూ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును కేసీఆర్ పూర్తి చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును సోమవారం ఖరారు చేశారు. మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గాను ఇంతకుముందే నాలుగు విడతల్లో 16 మంది పేర్లను బీఆర్ఎస్ ప్రకటించింది. అందులో 13 మంది పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారుకాగా.. ముగ్గురు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరినవారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక్కరే ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత దక్కింది. రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన సీట్లలో సగం బీసీలకే కేటాయించింది. మొత్తం 17 స్థానాల్లో ఎస్సీలకు మూడు (రెండు మాదిగ, ఒక మాల), ఎస్టీలకు రెండు (బంజారా, గోండులకు చెరొకటి), బీసీలకు ఆరు (మున్నూరు కాపు రెండు, ముదిరాజ్, గౌడ, యాదవ, కురుమలకు ఒక్కోటి), ఓసీలకు ఆరు (నాలుగు రెడ్డి, వెలమ, కమ్మకు చెరో స్థానం) సీట్లు కేటాయించింది. కొత్త అభ్యర్థులు తెరమీదకు..! బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు ఇతర పార్టీల్లో చేరగా.. కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడారు. ఈ క్రమంలో ముగ్గురు సిట్టింగులతోపాటు కరీంనగర్ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, గాలి అనిల్‌కుమార్‌లకు పోటీ అవకాశం దక్కింది. ఇక నేతలు పార్టీని వీడిన చోట కొత్తవారికి ఇన్చార్జులుగా బా«ధ్యతలు అప్పగిస్తున్నారు. సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్‌రెడ్డిలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. -
‘పాంచ్ న్యాయ్’తో ఎన్నికల గోదాలోకి..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కారణమైన ‘గ్యారంటీ’లపైనే కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. ‘గ్యారంటీ’ హామీలతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న తరహాలోనే.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాన్ని రచించింది. లోక్‌సభ ఎన్నికల్లో ‘పాంచ్ న్యాయ్ (ఐదు న్యాయాలు)’ పేరిట హామీలతో గోదాలో పోరాడేందుకు సిద్ధమైంది. ప్రధానంగా మహిళలు, రైతులు, యువ ఓటర్లను ఆకట్టుకునేలా.. కీలక హామీలతో మేనిఫెస్టోను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నేతలు.. మహిళలకు ఏటా రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ వంటి ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపడతామనీ పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌పై మరింత బాధ్యత ఉందని టీపీసీసీ కీలక నేతలు అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నట్టు చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి లోక్‌సభ స్థాయి పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని నాయకులకు వివరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ‘గ్యారంటీ’లతో.. కాంగ్రెస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు గ్యారంటీ హామీలు ఇచ్చింది. అక్కడ విజయం సాధించిన తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని అధిష్టానం పెద్దలు స్వయంగా హామీ ఇచ్చారు కూడా. ఇది ప్రభావం చూపించి తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ‘గ్యారంటీ’ హామీలు ప్రభావవంతంగా పనిచేయడంతో.. జాతీయ స్థాయిలోనూ ఈ అంశంపై దృష్టి పడిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లపై ఆశలు తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 అంశాలకు సంబంధించి ఐదు అంశాలను ఇప్పటికే అమల్లోకి తెచ్చామని, దీనితో ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తారని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం ‘పాంచ్ న్యాయ్’ హామీలను ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహించే భారీ బహిరంగసభలో ఏఐసీసీ మేనిఫెస్టోను తెలుగులో ఆవిష్కరించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళతామని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షల పెంపు హామీలను అమలు చేశామని మంత్రులు, పార్టీ నేతలు చెప్తున్నారు. మహిళలు, బీసీలను ఆకట్టుకునేలా.. ‘గ్యారంటీ’ల స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ జాతీయ నేతలు ప్రకటించారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ హామీలు మహిళలను అమితంగా ఆకట్టుకుంటాయన్న ధీమాను రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో బీసీల కులగణనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజంలో సగానికిపైగా ఉన్న బీసీ కులాల జనాభాకు దశాదిశను నిర్దేశిస్తుందన్న అభిప్రాయం ఉందని చెప్తున్నాయి. ఇదే తరహాలో దేశమంతటా కులగణన చేపట్టడాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎంచుకుందని వివరిస్తున్నాయి. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, అప్పుల బాధ నుంచి రైతులకు ఉపశమనం కల్పించేందుకు శాశ్వత రైతు రుణమాఫీ కమిషన్, పంట నష్టపోయిన రైతులకు 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారంటీలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుస్తాయని నేతలు చెప్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద కనీస రోజు కూలీ రూ.400 ఇవ్వాలని తీర్మానించడం, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని ప్రకటించడం వంటివి పట్టణ ప్రాంతాల్లోని అసంఘటిత కార్మీకులను ఆకర్షిస్తుందని పేర్కొంటున్నారు. -
‘రుణమాఫీ ప్రకటించకపోతే.. సచివాలయాన్ని ముట్టడిస్తాం: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులను ఆదుకొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని, రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే లక్షలాది రైతులతో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని, రజాకార్లను తలపించేలా వాళ్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం పట్టడం లేదని ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదని దుయ్యబట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చి 100 పూర్తయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. చదవండి: హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే.. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, వరి పంటకు క్వింలాటల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామమని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ ప్రకటించాలని, లేదంటే రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. ‘నిన్నటి వరంగల్ పర్యటన లో రైతుల కన్నీళ్ళు కష్టాలు కనిపించాయి. అక్కడ కొంత మంది ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు రావటం లేదని, లక్షలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కనీసం మా తాండాల్లో తాగు నీరు కూడా రావటం లేదని ఆవేదన చెప్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఓ సమీక్ష లేదు, పరామర్శ లేదు. అటెన్షన్ డైవర్షన్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది ప్రభుత్వం. చేరికల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. పంటలు ఎండిపోయి, రైతుబంధు రాక, వడగళ్ల వానతో పంటలు నష్టపోతుంటే అప్పులు కట్టాలని బ్యాంకులు రైతులను వేధిస్తున్నారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పులు కట్టొద్దు.. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అధికారులు వేధిస్తే.. మా దృష్టికి తీసుకొస్తే మీకు అండంగా ఉంటాం. రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది. రేపటి నుంచి బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు రైతుల పంట పొలాలకు వెళ్లి పంట నష్టం, రైతుల కష్టాలు రిపోర్ట్ తయారు చేసి పార్టీ కార్యాలయానికి పంపండి. రైతుల గోస ప్రభుత్వానికి తెలియజేయాలి’ అని పేర్కొన్నారు. -
హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 1. హైదరాబాద్: గడ్డం శ్రీనివాస్ యాదవ్ 2.నాగర్‌కర్నూల్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, 3. మెదక్: వెంకట్రామిరెడ్డి, 4. మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి, 5. కరీంనగర్: వినోద్ కుమార్, 6.పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, 7. జహీరాబాద్: గాలి అనిల్ కుమార్, 8. ఖమ్మం: నామా నాగేశ్వర్ రావు, 9. చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, 10.మహబూబాబాద్ : మాలోత్ కవిత, 11. మల్కాజ్గిరి : రాగిడి లక్ష్మారెడ్డి, 12. ఆదిలాబాద్: ఆత్రం సక్కు, 13. నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్, 14. వరంగల్ : కడియం కావ్య 15. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ 16. భువనగిరి - క్యామ మల్లేశ్ 17 నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి -
కమలదళం.. కదనరంగం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలరోజులకు (మార్చి25 – ఏప్రిల్ 25)పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను రాష్ట్ర బీజేపీ సిద్ధం చేసింది. పోలింగ్‌బూత్ స్థాయిల్లో మోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినవారు, మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)ను కలిసి వారిద్వారా వివిధవర్గాల మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యకుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయకార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. నేతల తీరుపై సునీల్‌బన్సల్ అసంతృప్తి ! అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించినా, ఆశించినస్థాయిలో జనాల్లోకి వెళ్లలేదని బీజేపీ నేతలపై ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. డిజిటల్ వ్యాన్స్ ఇచ్చాం. అయినా ఎక్కడా తిరగట్లేదు..ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించినట్టు సమాచారం. ‘ప్రతి బూత్‌లో అధికంగా ఓట్లు వస్తేనే.. పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం. మనకు ఇంకా టైం ఉంది. ఇప్పటికైనా స్పీడప్ చేయాలి. అలా అయితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పినట్టు తెలిసింది. పదాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయాలు ► పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6న పోలింగ్సెంటర్ వారీగా ’టిఫిన్ బైఠక్’ల నిర్వహణ ► నమో యాప్ ద్వారా చిన్నమొత్తం నిధులు (మైకో డొనేష¯ŒŒ్స) పొందేందుకు కృషి ► ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం ► ప్రతి పోలింగ్ బూత్‌లో 370 ఓట్లు (సుమారుగా పోలైన ఓట్లలో 50 శాతం) సాధించేందుకు కృషి ► ప్రతి బూత్‌ను పార్టీ బలాన్ని బట్టి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి బలోపేతానికి కృషి చేయాలి ► లోక్‌సభ అభ్యర్థి నేరుగా పాల్గొనేలా సమావేశాల నిర్వహణ ► లోక్‌సభ, అసెంబ్లీ స్థాయిల్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ భేటీలు తరచు నిర్వహించి, ప్రచార కార్యక్రమాల ముమ్మరం ► గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని స్థా యిల్లో కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించడం ► వివిధ మోర్చాలు.. ముఖ్యంగా యువమోర్చా– మొదటిసారి ఓటేస్తున్న యువతను ఆకర్శించే విధంగా, కిసాన్‌మోర్చా– రైతులలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మోర్చాలు– ఆయా వర్గాలతో నిరంతర సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి అధిక ఓట్లు వచ్చే విధంగా కృషి చేయడం ► నామినేషన్ల దాఖలు పూర్తయ్యే దాకా ప్రతి లోక్‌సభ సెగ్మెంట్లో విస్తృతస్థాయి సమావేశాల ఏర్పాటు ► బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు తన పోలింగ్ బూత్‌లో కోఆర్డినేటర్‌గా పనిచేయాలి ► నామినేషన్ల దాఖలులోపు బూత్ స్థాయిలో ఓటర్ల లిస్ట్‌పై అవగాహన కల్పించుకోవాలి ► ఎన్నికలలోపు ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు కలిసేవిధంగా కార్యాచరణ రూపొందించాలి -
రాహుల్‌గాంధీ ఈ జన్మలో ప్రధాని కాడు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచి రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. కానీ ఈ జన్మలో రాహుల్‌గాంధీ ప్రధాని కాడు’..అని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చు పెట్టినా, డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకే వస్తాయన్నారు. రేవంత్‌రెడ్డి కొత్తగా సీఎం అయ్యారని విమర్శించకుండా విడిచిపెట్టాల్సిన అవసరం పార్టీ, నేతలకు లేదని చెప్పారు. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలకు వస్తున్నారు..మోదీ ప్రధాని కావాలని అంటున్నారన్నారు. ‘కేంద్ర పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలి. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది.అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. ఇంటింటికి వెళ్లి ఓటరును కలవాలి’ అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన్మోహన్సింగ్ పదేళ్ల పాలనతో మోదీ పాలనను సరిపోల్చి కాంగ్రెస్ చరిత్రనే అవినీతి అని ప్రజలకు వివరించాలని సూచించారు. లోక్‌సభ అభ్యర్థులతో ముఖాముఖి లోక్‌సభ ఎంపీ అభ్యర్థులతో కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు ముఖాముఖి మాట్లాడారు. సెగ్మెంట్ పరిధిలో పరిస్థితి ఎలా ఉంది. ప్రచార సరళి, ఓటర్ల మనోగతం, వివిధ పార్టీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 12 నుంచి 15 సీట్లు గెలుస్తాం : డీకే.అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ 12 నుంచి 15 స్థానాలు గెలుస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట. మోదీకే మా ఓటు. గ్రామాల్లో ముసలివారు సైతం మోదీకే ఓటు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసుకున్నా ఈ ఎన్నికల్లో మోదీకే వేస్తామంటున్నారు.’ అని ఆమె చెప్పారు. 6న ప్రతి పోలింగ్ బూత్‌లో టిఫిన్ బైఠక్ : బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి వచ్చే నెల 6న ప్రతి పోలింగ్‌బూత్‌లో టిఫిన్ బైఠక్‌లు నిర్వహించనున్నట్టు బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళతాం. కార్నర్ మీటింగ్‌లకు ప్రాధాన్యం. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాలు చేపడతాం’ అని ప్రకటించారు. బీజేపీలోకి చేరికలు... అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి బీజేపీ రెబెల్‌గా పోటీచేసిన విష్ణువర్దన్‌రెడ్డి, ఆయన అనుచరులు, కోదాడ నియోజకవర్గానికి చెందిన ఓయూ జేఏసీ నేత అంజియాదవ్, కార్యకర్తలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ సెగ్మెంట్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ కార్యాలయంలో జి.కిషన్‌రెడ్డి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు డీకే.అరుణ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పంటలెండుతున్నా పట్టింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుతో రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు రుణం ఇవ్వకున్నా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తెచ్చి మరీ సాగు చేసిన రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ నేత మల్లికార్జున్ రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా.. కుంగిన పిల్లర్ల పేరిట రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వెంటనే సమీక్షించాలని, కర్నాటక నుంచి 10 టీఎంసీల నీరు తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కేఆర్ఎంబీ ఉన్నా రైతుల కోసం సాగు నీరు ఇచ్చామని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు నీళ్ల మీద పరిజ్ఞానం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు వసూళ్లు, ముడుపుల చెల్లింపులు మొదలు పెట్టారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు బీ టీమ్‌లా పనిచేస్తున్నాయన్నారు. ఈడీ కేసుల పేరిట ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కడం బీజేపీ పనిగా పెట్టుకుందని.. కేజ్రీవాల్, కవిత అరెస్టులే నిదర్శనమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌కు జహంగీర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
వరంగల్‌కు అరూరి..
సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల ఎంపికతో తెలంగాణలో బీజేపీ 17 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది. ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం ఆదివారం రాత్రి మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను వరంగల్ నుంచి, తాండ్ర వినోద్‌రావును ఖమ్మం నుంచి బరిలో దించింది. ఖమ్మం నుంచి వినోద్‌రావు పేరు మొదట్లో పరిశీలనకు వచ్చినా, ఆ తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావులలో ఒకరికి బీజేపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరిగింది. ఆ దిశగా జరిగిన పలు పరిణామాలు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే అనూహ్యంగా తాండ్ర వినోద్‌రావు అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. 17 స్థానాల్లో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాల్లో ఐదు బీసీ, నాలుగు రెడ్డి, రెండు వెలమ, ఒక బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. అయితే ఎస్సీలకు సంబంధించిన మూడు రిజర్వుడ్ స్థానాలను మాదిగ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ తెలిపింది. ఆయా లోక్‌సభ సెగ్మెంట్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు వీరే.... ఆదిలాబాద్: గోడం నగేష్ (ఎస్టీ గోండు) పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్ (ఎస్సీ మాదిగ) కరీంనగర్: బండి సంజయ్ కుమార్ (మున్నూరు కాపు) నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ (మున్నూరు కాపు) జహీరాబాద్: బీబీ పాటిల్ (లింగాయత్) మెదక్ : రఘునందన్‌రావు (వెలమ) మల్కాజ్గిరి: ఈటల రాజేందర్ (ముదిరాజ్) సికింద్రాబాద్: జి.కిషన్‌రెడ్డి (రెడ్డి), హైదరాబాద్: మాధవీలత (బ్రాహ్మణ), చేవెళ్ల: విశ్వేశ్వర్ రెడ్డి (రెడ్డి), మహబూబ్‌నగర్: డీకే అరుణ (రెడ్డి), నాగర్‌కర్నూల్: పి.భరత్ (ఎస్సీ మాదిగ), నల్గొండ: సైదిరెడ్డి (రెడ్డి), భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ (గౌడ్), వరంగల్: అరూరి రమేశ్ (ఎస్సీ మాదిగ), మహబూబాబాద్: సీతారాం నాయక్ (ఎస్టీ లంబాడా), ఖమ్మం: తాండ్ర వినోద్ రావు (వెలమ) -
ఎనిమిది చోట్ల ఖరారుపై తకరారు!
ఆదిలాబాద్ ఈ లోక్‌సభ సీటులో స్థానిక నేతలు కాకుండా బయటి నుంచి తెచ్చిన వారిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రమేశ్ రాథోడ్ ఇప్పుడు పార్టీలో లేరు. అంతకంటే ముందు పోటీచేసిన డాక్టర్ నరేశ్ జాదవ్ పార్టీలోనే ఉన్నా వేరే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సుమలత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణలలో ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వీరిలో సుమలత పేరు ఖరారైందని తొలుత ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆత్రం సుగుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరంగల్ ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన రెండు ఎస్సీ రిజర్వుడ్ సీట్లను మాల సామాజిక వర్గానికే ఇచ్చారు. దీంతో ఇక్కడ మాదిగ సామాజికవర్గ నేతకే చాన్స్ ఇవ్వనున్నారు. తొలుత దొమ్మాట సాంబయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీలోకి రావడంతో ఆయన వైపు మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఇద్దరితోపాటు గతంలో లోక్‌సభకు పోటీచేసిన డాక్టర్ రాగమళ్ల పరమేశ్వర్ కూడా టికెట్ అడుగుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థిని తేల్చడంలో గందరగోళం కనిపిస్తోంది. కరీంనగర్ : ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. వెలిచాల రాజేందర్రావు పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని అంటున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. నిజామాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ముత్యాల సునీల్‌రెడ్డి కూడా ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఇక్కడ జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని చెప్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. ఖమ్మం: ఈ ఎంపీ సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులలో ఎవరికి అవకాశం అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మల్లు నందిని, పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల యుగంధర్లతోపాటు పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ అడుగుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారా? కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తారా? బీసీ వర్గాలకు టికెట్ ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. భువనగిరి: ఇక్కడ కూడా ఖమ్మం లోక్‌సభ స్థాయిలో పోటీ నెలకొంది. ఈ సీటుకు సంబంధించి తొలినుంచీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి పేరును సీరియస్‌గా పరిశీలించారు. అయితే రాజగోపాల్‌రెడ్డి మాత్రం తాము టికెట్ అడగడం లేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను మంత్రిని అవుతానని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీలోకి వస్తారని, ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన మరో నాయకుడు పవన్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. తాజాగా బీసీ నేతకు భువనగిరి టికెట్ వస్తుందనే చర్చ జరుగుతోంది. దీనితో గందరగోళంగా మారింది. మెదక్: ఈ లోక్‌సభ సీటును బీసీలకు ఇస్తారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి, పటాన్చెరు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీచేసి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన నీలం మధు ముదిరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష కూడా పోటీలో ఉన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల తనకు మెదక్ ఎంపీ టికెట్ కావాలని అడిగినా.. ఆమెను టీజీఐఐసీ చైర్మన్‌గా నియమించడంతో రేసు నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. మెదక్‌లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ హైదరాబాద్ టికెట్ విషయంలోనూ ఏమీ తేలలేదు. ఇక్కడ ఎంఐఎంకు ప్రతిగా ఎంబీటీని ప్రోత్సహించాలని తొలుత భావించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దింపాలని తర్వాత నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌తోపాటు అలీ మస్కతిల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా న్యాయవాది షహనాజ్ తబసుమ్ అభ్యర్థిత్వాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదు. -
కాంగ్రెస్‌లో కంగాళీ!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ రాజకీయ అనుభవం, దశాబ్దాల సీనియారిటీ ఉన్న నాయకులు.. రాష్ట్రంలో చేజిక్కిన అధికారం.. ఢిల్లీ నుంచి పర్యవేక్షణ.. స్క్రీనింగ్ కమిటీలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీల వరుస సమావేశాలు.. చర్చలు.. ఇంత చేసీ లోక్‌సభ అభ్యర్థుల ఖరారుపై రాష్ట్ర కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలను ఎదుర్కోవడంలో ఆ పార్టీ గందరగోళానికి గురవుతోందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను వడివడిగా ఖరారు చేస్తూ, ప్రచారంలో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్లేందుకు వ్యూహాలు పన్నుతుంటే.. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారు స్థాయిలోనే తలమునకలైంది. లోక్‌సభ ఎన్నికల రేసులో అధికార కాంగ్రెస్ మిగతా పక్షాల కంటే వెనుకంజలో ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటివరకు 9 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఎనిమిదింటిని పెండింగ్‌లో పెట్టింది. అయితే అటు ఖరారు చేసిన స్థానాల్లోనూ, ఇటు ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన స్థానాల్లోనూ అనేక సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా పారాచూట్ నేతలకు టికెట్లివ్వడం, దళిత సామాజిక వర్గాల మధ్య సర్దుబాటు చేయలేకపోవడం, పార్టీ సీనియర్ నేతల కుటుంబాలకే లోక్‌సభ టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తుండటంపై పార్టీ లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మున్షీ టీమ్ ఏం చేస్తున్నట్టు? లోక్‌సభ టికెట్ల ఖరారు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఏం చేస్తున్నారన్న దానిపై గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గాం«దీభవన్తోపాటు ఫిల్మ్‌నగర్‌లోని తన కార్యాలయం వేదికగా ఆమె లోక్‌సభ అభ్యరి్థత్వాల కోసం తరచూ ఆయా నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులు కూడా తమ సిఫారసులను సీల్డ్ కవర్లో ఆమెకు అందజేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలను కూడా ఆమె సేకరించారు. పలుమార్లు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతోనూ సమావేశమయ్యారు. ఆమెకు సహాయకారులుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు కూడా మంతనాలు జరుపుతున్నారు. అయితే వీరంతా అధిష్టానానికి ఏం చెబుతున్నారన్నది అంతు పట్టడం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అభ్యర్థుల ఖరారులో ఇతర పార్టీ ల కంటే వెనుకబడినా పరిస్థితిని అధిష్టానానికి వివరించడంలో మున్షీ టీమ్ పాత్ర ఏమిటన్నది కూడా అర్థం కావడం లేదని పేర్కొంటున్నాయి. ఇతర పార్టీ ల నుంచి నేతలను చేర్చుకోవడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మున్షీ టీమ్.. లోక్‌సభ అభ్యర్థుల ఖరారు విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోతుందనే చర్చ జరుగుతోందని వివరిస్తున్నాయి. ఖరారైన చోట కూడా ‘కంగారే..’.. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 9 మంది లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో ఐదుచోట్ల మాత్రమే మొదటి నుంచీ స్పష్టత కనిపించింది. సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), బలరాం నాయక్ (మహబూబాబాద్), వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మల్లురవి (నాగర్‌కర్నూల్), కుందూరు రఘువీర్‌రెడ్డి (నల్లగొండ)ల విషయంలో మాత్రమే నిర్ణయాలు త్వరితగతిన జరిగిపోయాయి. ► చేవెళ్ల స్థానానికి తొలుత మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి సునీత పేరు దాదాపు ఖరారైంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమోదం కోసం పంపిన జాబితాలోనూ ఆమె పేరు కనిపించింది. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి తెరపైకి వచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే చేవెళ్ల టికెట్ అందిపుచ్చుకున్నారు. దీనితో సునీతను మల్కాజిగిరికి మార్చాల్సి వచ్చింది. ► సికింద్రాబాద్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను పార్టీ లో చేర్చుకుని టికెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెరపైకి వచ్చారు. అటు ఎమ్మెల్యే పదవికి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ టికెట్‌ను దానం నాగేందర్‌కు ఇవ్వడం గమనార్హం. ► పెద్దపల్లికి సంబంధించి ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వాలా? ఆయన కుమారుడు వంశీకి లోక్‌సభ టికెట్ ఇవ్వాలా అన్న దానిపై సమాలోచనలు జరిగాయి. చివరికి లోక్‌సభ టికెట్ ఇచ్చారు. ► మరోవైపు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన నాగర్‌కర్నూల్, పెద్దపల్లి టికెట్లను మాల సామాజిక వర్గానికే ఇవ్వడంపై మాదిగ సామాజికవర్గ నేతల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ కూడా ఈ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆయనకు కౌంటర్‌గా కాంగ్రెస్‌లోని మాదిగ సామాజిక వర్గ నేతలు మాట్లాడుతున్నా.. అంతర్గతంగా మాత్రం మాల, మాదిగ సామాజిక వర్గాల సమన్వయ లోపం రాష్ట్ర కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ► మరోవైపు ఇతర పార్టీ ల నుంచి వస్తున్న నేతలకు లోక్‌సభ టికెట్లు ఎందుకు ఇవ్వాలన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో సీరియస్‌గా జరుగుతుండటం గమనార్హం. అటు వలస నేతలు, ఇటు నేతల కుటుంబ సభ్యులకే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తుండటం ఏమిటనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రింకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందుగా, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడి చేసి, సోదాలు చేసి ఆయనను అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా కనిపిస్తుంది. కేజ్రీవాల్, కవితలకు ఈడీ ఇచ్చిన ఒకటి, రెండు నోటీసులకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వారికి అరెస్టు అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ విచారణకు హాజరవకుండా కాలయాపన చేశారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు వేల కోట్ల అక్రమాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వారిని చూసి, చూడనట్లు వదిలేస్తూ, వంద కోట్లు ఆరోపణలపై ఇంత గట్టిగా హడావుడి చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంపై కోపంతోనే, అక్కడ బీజేపీకి ఉన్న బలం తగ్గడంతోనే తన చేతిలోని అధికారాన్ని బీజేపీ ఇలా వినియోగిస్తోందన్నది పలువురి అభియోగం. లిక్కర్ స్కామ్ జరిగింది కనుకే అధికారులు చర్య తీసుకున్నారన్నది బీజేపీ వాదన. 2023 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే కవితను ఈ కేసులో అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఎందువల్లో కానీ అలా జరగలేదు. దాంతో బీఆర్ఎస్, బీజేపీల మద్య రాజీ కుదిరిందేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కొంత నష్టం జరిగింది. కనీసం ఇరవై సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది బీజేపీ నేతల మనోగతంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే ఈ అరెస్టుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇందువల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతం బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. అలాంటప్పుడు తమవంతుగా ఒక దెబ్బకొట్టి బీఆర్ఎస్ను ఇంకా బలహీనపరిస్తే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే బీజేపీ ఢిల్లీలో జరిగినట్లు చెబుతున్న వంద కోట్ల రూపాయల స్కామ్ పై ఇంత శ్రద్ద చూపుతోంది కానీ, వేల కోట్ల స్కామ్‌ల గురించి పట్టించుకోకుండా, తమ వైపునకు వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులలోకానీ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొందరిపై ఉన్న కేసులలో కానీ,ఆదర్శ్ స్కామ్ లో పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారి బీజేపీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చిన తీరుకానీ, చీలిక వర్గం శివసేన, చీలిక వర్గం ఎన్సీపీ నేతల పట్ల అనుసరించిన వైఖరులు కానీ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తప్పే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆప్‌కు చెందిన మంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సర కాలంగా జైలులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడానికి వీలుగా విధానాన్ని మార్చడంపై వచ్చిన ఆరోపణలు, ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు కనుక, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రయోగించగలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ తలపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. నిజంగానే అవినీతిపై బీజేపీ ఫోకస్ పెడితే మంచిదే. అలాకాకుండా కేవలం ప్రత్యర్ధులను భయపెట్టడానికి, తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికే ఈడీ, సీబీఐ వంటివాటిని వాడితే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. గతంలో బీజేపీ ఈ సంస్థలపై, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసిందో, అదే పని ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని భావించవలసి ఉంటుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదిని టెర్రరిస్టుతో పోల్చారు. సీబీఐ, ఈడీ వంటివాటితో తమపై దాడులు చేయిస్తోందని ద్వజమెత్తేవారు. సీబీఐ తనను అరెస్టు చేయడానికి రావచ్చని, అప్పుడు ప్రజలంతా తన చుట్టూ నిలబడి రక్షించుకోవాలని అనేవారు. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అప్పట్లో కొందరు టీడీపీ ప్రముఖులపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు దాడులు చేశాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయ్యాక, చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు చేసి రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆదారాలు దొరికినట్లు సీబీటీడీ ప్రకటించింది. అలాగే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ మనీ లాండరింగ్ తదితర ఆరోపణలకు సంబందించి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఏదో రకంగా వాటి నుంచి బయటపడుతూనే ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు యుటర్న్ తీసుకుని ప్రధాని మోదిని, బీజేపీని పొగడడం ఆరంభించారు. అంతవరకు మోది అంత అవినీతి పరుడు లేడని, టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని అంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు దాడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ గూటికి పంపించి, తనకు, బీజేపీకి మధ్య రాయబారిగా వాడుకున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు కేసుల జోలికి రాకుండా వదలిపెట్టేసిందని అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు కుంభకోణాలలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించలేదంటేనే చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ ఏ రకంగా ఉన్నది జనం అర్దం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడుకున్నారని మోది ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సంచలన ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్‌లకు 150 కోట్ల మేర ముడుపులు చెల్లించామని చెప్పారు. అయినా ఈడీ, సీబీఐ ఏవీ స్పందించలేదు. ఐటీ ఇచ్చిన నోటీసులో దుబాయిలో జరిగిన మనీలాండరింగ్ గురించి కూడా ప్రస్తావించినా తదుపరి చర్యలేదు. చంద్రబాబు ఏపీలో స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు అయితే బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్‌షాను కలిసి సాయం చేయాలని అడిగారు. ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది! తాజాగా హైదరాబాద్‌లో ఐఎమ్.జి భరత్ అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కేసులో సీబీఐ విచారణ జరగాలని హైకోర్టు అబిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎటూ చంద్రబాబు శిష్యుడే కనుక దానినుంచి తప్పించవచ్చు. ఈ రకంగా అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించగలుగుతున్నారని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేవారు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు, న్యాయ వ్యవస్థలోని ఒకరిద్దరు ప్రముఖులు అండగా నిలిచి చంద్రబాబుపై కేసు రాకుండా చూడగలిగారు. ఇలా పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు జోలికి ఈడీ, సీబీఐ వంటివి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెబుతాం. బీజేపీలో చేరిన సుజనా చౌదరి సుమారు ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగవేశారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా పార్టీ మారగానే ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు. అలాగే చంద్రబాబు కూడా మోదితో కలిసి సభలో పాల్గొనగలిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేర్పరితనం కేసీఆర్‌లో, కేజ్రీవాల్లో కొరవడడం వల్లే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే కేజ్రీవాల్ జైలు పాలయ్యారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించడానికి ప్రయత్నించడం, ప్రధాని మోదిపై, బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. తొలుత మోదితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా, ఎందువల్లో కేసీఆర్ ఆయనకు దూరం అయ్యారు. చివరికి పలకరించుకోలేని స్థితికి వచ్చారనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన కుమార్తెను అరెస్టు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నేతలపై దాడి పెంచింది. ఎంపీగా పోటీచేయాలని ఉబలాటపడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెక్ పెడుతూ ఆయన కుటుంబానికి చెందిన కాలేజీలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారని అధికారులు తవ్వేశారు. ఆక్రమిత స్థలంలో భవనాలు కట్టారని వాటిని కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి కర్నాటకకు పరుగెత్తి డీకే శివకుమార్‌ను వేడుకున్నారు. ఆ మీదట తాము ఎంపీ సీటుకు పోటీచేయడం లేదని ప్రకటించారు. అంతేకాక బీఆర్ఎస్ నుంచి ఎందరు దొరికితే అందరిని కాంగ్రెస్, బీజేపీలు గుంజుకుంటున్నాయి. ఎంపీలు కొందరిని బీజేపీ లాగితే ఎమ్మెల్యేలు ఇంతవరకు పదహారు మందిని కాంగ్రెస్ లాగేసినట్లేనని చెబుతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి మద్దతు ఇస్తున్నారట. అందువల్లే తన ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన ఉన్నారు. పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ ధోరణులేనని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. కానీ అప్పట్లో ఈ రకంగా దాడులు జరగలేదు. వారిని ప్రలోభపెట్టి ఆకర్షించుకున్నారు. అయినా అది కూడా విమర్శలకుగురి అయింది. ఇప్పుడు దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది. నైతికంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దానిని తప్పు పట్టలేని దైన్యంలో కేసీఆర్ పడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న గేమ్‌లో బీఆర్ఎస్ బలి అవుతుందా అన్న సందేహం వస్తుంది. అయితే కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయజాలం. ఆయన పలు డక్కీలు తిన్నవాడే. వీటన్నిటిని ఎలాంటి వ్యూహాలతో తిప్పి కొట్టి బీఆర్ఎస్ను సురక్షితంగా నిలబెట్టుకుంటారో చూడాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేమాదిరిగా చిత్తశుద్దితో కాకుండా ప్రత్యర్ధులను లొంగదీసుకునే వ్యూహాలనే అమలు చేస్తే ఏదో ఒక రోజు దెబ్బతింటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎన్నికల వ్యూహాలపై...నేడు బీజేపీ కీలక భేటీలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... ఆది వారం బీజేపీకి సంబంధించి రెండు ము ఖ్యమైన సమావేశా లు జరగనున్నాయి. ఈ భేటీల్లో పార్టీ పరంగా ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు, ప్రచార వ్యూహం, లేవనెత్తా ల్సిన అంశాలు, లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న భేటీలో... పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం విడిగా రాష్ట్రపార్టీ ముఖ్యనేతల సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రపార్టీ ఇన్చార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్ ఇతర నాయ కులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను రూపొందించడం, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగట్టడంతోపాటు హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి రాజీనామా
సాక్షి ప్రతినిధి నల్లగొండ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శనివారం ఆ పారీ్టకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన రోజే ఆయన రాజీనామా చేయ డం గమనార్హం. రాజీనామా లేఖలో ఈనెల 18న రాజీనామా చేసినట్లు పేర్కొనగా, చిన్నపరెడ్డి ఈ రోజే రాజీనామా చేశారని, టైపింగ్ ఎర్రర్ వల్ల అలా వచ్చిందని ఆయన అనుచరులు పేర్కొన్నారు. నల్ల గొండ ఎంపీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో నిల పాలని మొదట్లో బీఆర్ఎస్ భావించింది. అయితే ఆయన బీజేపీకి టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది. కానీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, టికెట్ తనకే వస్తుందని చిన్నపరెడ్డి రెండ్రోజుల కిందట చెప్పారు. బీఆర్ఎస్ అధిష్టానం అనూహ్యంగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అధిష్టానం హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించింది. 15 రోజులు గడవక ముందే ఆయన్ను మార్చి చిన్నపరెడ్డికి టికెట్ ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. కంచర్ల కృష్ణారెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.