గడ్డాలు పెంచుకుంటే సీఎంలు కారు.. | Minister KTR comments on Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

గడ్డాలు పెంచుకుంటే సీఎంలు కారు..

Nov 3 2016 12:40 PM | Updated on Sep 19 2019 8:44 PM

గడ్డాలు పెంచుకుంటే సీఎంలు కారు.. - Sakshi

గడ్డాలు పెంచుకుంటే సీఎంలు కారు..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీసుకోబోనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనను పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఎద్దేవా చేశారు.

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
- ఎక్కువలో ఎక్కువగా సన్నాసుల్లో కలుస్తారు
- ఎవరు ఎక్కడుండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు

 
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీసుకోబోనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనను పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. ‘గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రు లు కారు. ఎక్కువలో ఎక్కువగా సన్నాసులలో కలుస్తారు’ అని వ్యాఖ్యానించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) చైర్మన్‌గా నియమితులైన మర్రి యాదవరెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం హన్మకొండలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు... తెలంగాణ ఇయ్యూలని, లేకుంటే  వీపు పగలగొడ్తమంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. 

ఏ పార్టీ ఎక్కడ ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఉద్యమ నేత కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ఎన్డీయే అధికారంలో ఉన్న 2000 సంవత్సరంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు ఇంకా కుదురుకోలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న కూడా కొత్త కార్యాలయాలు ప్రారంభించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు ఇంకా కాలే దు. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధితో ముందుకు వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని సర్వేల్లోనూ తెలంగాణ అగ్ర రాష్ట్రంగా గుర్తింపు పొందుతోంది. పక్కవాళ్లు పంచాయతీలు పెడుతున్నా, సశేషం గా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకుపోతున్నాం. ప్రజలకు పరిపాలన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో జిల్లాల పునర్విభజన చేశాం. అధికార వికేంద్రీకరణ జరి గింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వా త ఇంత తొందరగా కుదురుకుంటుంటే కొందరికి మింగుడుపడటంలేదు.

కాంగ్రెస్ అధికారంలోకి  వచ్చే వరకు గడ్డం గీసుకోబోనని ఒకాయన ప్రకటించిండు. గడ్డాలు పెంచుకుంటే సీఎంలు కారు. అంతకుముం దు కాంగ్రెస్‌కు ఆశలు ఉండేవి. కాంగ్రెస్ ఆశలను వరంగల్ జిల్లా ప్రజలే పటాపంచలు చేశారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చారు. వరంగల్ నగరం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. విద్య అవకాశాలకు వరంగల్ ఇప్పటికే కేంద్రంగా ఉంది. ఇక్కడ చదువుకున్న వారికి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ సహా అన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే సెనైట్ ఐటీ కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ 1,500 మంది ఉద్యోగులతో త్వరలోనే ఇక్కడి నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టనుంది’ అని కేటీఆర్ వివరించారు.
 
 త్వరలో తెలంగాణ టెక్స్‌టైల్ పాలసీ
 తెలంగాణ రాష్ట్ర టెక్స్‌టైల్ పాల సీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించే టెక్స్‌టైల్ పార్కులో వరంగల్ నగరం కీలకమవుతుందని అన్నారు. ‘దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి తెలంగాణలో ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో ఏటా 65 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతోంది. కేవలం 10 లక్షల టన్నులే ఇక్కడ విని యోగమవుతోంది. సంగెం, గీసుగొండ మండలాల్లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకాబోతోంది. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ముందుండి నడిచింది. కాకతీయులస్ఫూర్తితో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ   చేపట్టారు. ఇది అపురూపమైన కార్యక్ర మం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలసి నడిచి, కేసీఆర్‌కు అండగా నిలిచిన వారిలో ఎక్కువ మంది వరంగల్ జిల్లా వారు ఉన్నారు. నామినేటెడ్, పార్టీ పదవుల్లో అందరికీ అవకాశాలు వస్తాయి’ అని కేటీఆర్ అన్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, దయూకర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement