ఇంత అప్రజాస్వామికమా?: ఉత్తమ్ | Uttam Kumar Reddy fires on KTR | Sakshi
Sakshi News home page

ఇంత అప్రజాస్వామికమా?: ఉత్తమ్

Nov 3 2016 3:43 AM | Updated on Sep 19 2019 8:44 PM

ఇంత అప్రజాస్వామికమా?: ఉత్తమ్ - Sakshi

ఇంత అప్రజాస్వామికమా?: ఉత్తమ్

సైనికులకు ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్(ఓఆర్‌ఓపీ) పథకాన్ని సరిగా అమ లు చేయడం లేదంటూ ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికాధికారి సుబేదార్ రాంకిషన్ గ్రేవాల్ కుటుంబ

- ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడి కుటుంబాన్ని అదుపులోకి తీసుకుంటారా?
- కేంద్రంపై టీపీసీసీ చీఫ్ మండిపాటు  
- మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందన
 
 సాక్షి, హైదరాబాద్: సైనికులకు ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్(ఓఆర్‌ఓపీ) పథకాన్ని సరిగా అమ లు చేయడం లేదంటూ ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికాధికారి సుబేదార్ రాంకిషన్ గ్రేవాల్ కుటుంబ సభ్యులతోపాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పోలీ సులు అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామిక చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో ఎమ్మె ల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, కొనగాల మహేశ్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. 2014లో పార్లమెంట్‌లో ఆమోదించిన ఓఆర్‌ఓపీ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు.

అందులో పేర్కొన్న వాటిలో 50 నుంచి 60 శాతం మాత్రమే అమలు చేస్తున్నారని, సైనికుల గురించి పదేపదే మాట్లాడే మోదీ ప్రభుత్వం వారిపట్ల చూపుతున్న శ్రద్ధ ఏమిటో దీనిద్వారా తేటతెల్లమవుతోందన్నారు. రాంకిషన్ మానసిక పరిస్థితి బాగోలేదంటూ కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని, దీనినిబట్టి మంత్రి మానసిక పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని అన్నారు. కాగా, గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రి కాలేరంటూ మంత్రి కేటీఆర్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. ‘‘జీహెచ్‌ఎంసీలో వంద కోట్ల అవినీతికి పాల్పడిన వారికి నాపై విమర్శలు చేసే నైతికత లేదు. జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పనులు చే స్తున్న వారంతా ఎవరి బంధువులు, కుటుంబ సభ్యులో కేసీఆర్ చెప్పాలి. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలి’’అని వ్యాఖ్యానించారు. సుబేదార్ రాంకిషన్ ఆత్మహత్య సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 మోదీ దిష్టిబొమ్మ దహనం
 రాహుల్‌గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బుధవారం గాంధీభవన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బంజారా హిల్స్‌లో కూడా కాంగ్రెస్ నేతలు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement