‘ఆప్’ గాలి! | increased Craze in Aam Aadmi Party | Sakshi
Sakshi News home page

‘ఆప్’ గాలి!

Dec 13 2013 2:10 AM | Updated on Apr 4 2018 7:42 PM

దేశ రాజధానిలో రికార్డు సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఢిల్లీలో సత్తా చాటిన కేజ్రీవాల్‌కు రాష్ట్రంలోనూ క్రేజ్ పెరుగుతోంది.

సాక్షి, చెన్నై : దేశ రాజధానిలో రికార్డు సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఢిల్లీలో సత్తా చాటిన కేజ్రీవాల్‌కు రాష్ట్రంలోనూ క్రేజ్ పెరుగుతోంది. ఆ పార్టీని ఇక్కడ బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వానికి నాయకులు శ్రీకారం చుట్టారు. దరఖాస్తు రుసుంగా రూ.పది నిర్ణయించారు. అవినీతి నిర్మూలనాస్త్రంతో సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఐఆర్‌ఎస్ అధికారి కేజ్రీ వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నా హజారేకు ఇక్కడ ఏ మేరకు అభిమానులు ఉన్నారో, అదే అభిమానం కేజ్రీవాల్ మీద కూడా ఉంది. అన్నా బృందం జాతీయ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా, తాము సైతం అంటూ ఇక్కడున్న అభిమానులు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కే జ్రీ వాల్ రాజకీయ అరంగేట్రం చేయడంతో ఆయనకు మద్దతుగా ఇక్కడి అభిమానులు కూడా నిలిచారు. 
 
 ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో రికార్డు సృష్టించడం ఇక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపింది. ఢిల్లీలో 28 సీట్లను తమ పార్టీ కైవశం చేసుకోవడంతో ఇక్కడున్న వాళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ విజయం స్ఫూర్తితో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయించారు. రాష్ట్రంలోనూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. బలోపేతం:  ఆమ్ ఆద్మీ రాష్ట్ర కన్వీనర్‌గా నగరానికి చెందిన కృష్ణ స్వామి వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ ఆదర్శంతో రాష్ట్రంలో సభ్యత్వ నమోదుకు కృష్ణ స్వామి బృందం శ్రీకారం చుట్టింది. అన్ని జిల్లాలకు ప్రతినిధుల్ని పంపించి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించారు. సభ్యత్వ రుసుంగా రూ.10 చెల్లించి దరఖాస్తు స్వీకరించాలి. ప్రజల్ని ఆకర్షించే విధంగా వినూత్న రీతిలో కరపత్రాల్ని ముద్రించి పంచి పెట్టే పనిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. 
 
 అవినీతిని నిర్మూలించాలా..? అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలా..? న్యాయం కోసం ఎదురు చూస్తున్నారా..? మౌళిక వసతులు, హక్కుల్ని పరిరక్షించుకోవాలా..? మానవ హక్కులకు భంగం కలగకుండా ఉండాలా..?, సమాచార హక్కు చట్టం దరిచేరాలా..?రూ. అయితే, చేతులు కలపండి, ఆమ్ ఆద్మీలో చేరండి అన్న నినాదాల్ని ఆ కరపత్రాల్లో పొందు పరచారు. అందులో ఫోన్ నెంబర్లను పొందు పరుస్తూ, రూ.పది చెల్లించి సభ్యత్వాన్ని తీసుకోండి అని పిలుపునిస్తున్నారు. ఈ విషయమై సేలంకు చెందిన ఆమ్ ఆద్మీ నాయకుడు సేలం భారతి పేర్కొంటూ, రాష్ట్ర యువతలో చైతన్యం వచ్చిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా యువత గళమెత్తుతున్నారని చెప్పారు. కేజ్రీవాల్‌ను ఆదర్శంగా తీసుకుని యువతీ, యువకులు, పట్టభద్రులు అవినీతి నిర్మూలన లక్ష్యంగా తమ పార్టీలోకి రావాలని పిలుపు నిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement