ప్రభుత్వం ఏర్పాటుచేయబోమని, తాజా ఎన్నికలకు సిద్ధమని బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ మళ్లీ ప్రజలముందుకు వెళ్లేందుకు కొందరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటుచేయబోమని, తాజా ఎన్నికలకు సిద్ధమని బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ మళ్లీ ప్రజలముందుకు వెళ్లేందుకు కొందరు ఎమ్మెల్యేలు వెనుకంజ వేస్తున్నారు. తాము మళ్లీ గెలుస్తామో లేదో అన్న భయం ఆప్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కనబడుతోంది. ఈ భయంతోనే ఆప్ ఎమ్మేల్యేలలో కొందరు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు. ఒక్క సంకేతం అందినా ఆప్‌ను వదిలి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఉత్సాహపడుతున్నారు. ఆప్ నుంచి ఇప్పటికే బహిష్కృతుడైన లక్ష్మీనగర్ ఎమ్మెల్యే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని గతంలోనే ప్రకటించారు. అయితే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ సుముఖంగా లేరని గుర్తించి ఊరుకున్నారు. అందు కే బిన్నీ ఇప్పుడు ఢిల్లీలో కిరణ్ బేడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. బేడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తాను ఆప్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా లేఖలు కూడా రాశారని ప్రకటించారు.