'మెక్‌గ్రాత్‌ గుర్తుంచుకో.. నేనింకా క్రీజులోనే ఉన్నా'

Watch How Sachin Tendulkar Countered Glenn McGrath in 1999 Test Match - Sakshi

ముంబై : క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్‌కు మధ్య జరిగే సన్నివేశాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తన బౌలింగ్‌లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్‌ను చూస్తూ గేలి చేయడం బౌలర్‌ నైజమైతే.. అదే బౌలర్‌ మళ్లీ బౌలింగ్‌ను వచ్చినప్పుడు బౌండరీలు బాది బ్యాట్స్‌మన్‌లు ధీటుగా బదులిస్తారు. అలాంటి ఘటనలు క్రికెట్‌లో చాలానే చూశాం. టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఆసీస్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌లు ఈ కోవకే చెందినవారే. వీరిద్దరు పరస్పరం తలపడినప్పుడు వారి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
('రసెల్‌తో ఆడితే హైలెట్స్‌ చూస్తున్నట్లే అనిపిస్తుంది')

90 వ దశకం నుంచి 2003 సంవత్సరం వరకు తీసుకుంటే వీరిద్దరు ఎదురుపడినప్పుల్లా మ్యాచ్‌ సంగతి పక్కన పెట్టి అభిమానులు వీరిపై దృష్టి సారించేవారు. 1999 టెస్టు సిరీస్‌, కెన్యాలో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపీ, 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లనే ఉదాహరణగా చెప్పొచ్చు. తాజాగా సచిన్‌ టెండూల్కర్‌ మెక్‌గ్రాత్‌తో జరిగిన ఒక సంఘటనను ఒక వీడియో చాట్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియోనూ బీసీసీఐ తమ అధికార ట్విటర్‌లో షేర్‌ చేసింది. 1999లో భారత జట్టు ఆసీసీలో పర్యటించింది. అడిలైడ్‌ టెస్టు సందర్భంగా గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ తనను ఎంతగా విసుగు తెప్పించాడనేది సచిన్‌ గుర్తు చేశాడు.

' 1999.. అడిలైడ్‌లో మొదటి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాము. ఇంకా 40 నిమిషాల పాటు ఆడితే మొదటి రోజు ఆట ముగుస్తుంది. అప్పటికే నాకు మెక్‌గ్రాత్‌ ఐదు ఓవర్లు మెయిడిన్‌ వేసి చికాకు తెప్పించాడు. వాళ్లు (ఆసీస్‌ ఆటగాళ్లు) నాకు విసుగు తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు 70 శాతం బంతులను గిల్‌క్రిస్ట్‌ చేతుల్లో పడాలని, 10 శాతం బంతులను మాత్రమే సచిన్‌ బ్యాట్‌కు తగిలేలా వేయాలని మెక్‌గ్రాత్‌కు వివరించారు. మెక్‌గ్రాత్‌ అదే విధంగా బౌలింగ్‌ చేస్తుంటే చాలా బంతుల్ని వదిలేశాను. అయితే మంచి బంతులను మాత్రం నా స్టైల్లో ఆడాను. ఆట ముగిసిన తర్వాత మెక్‌గ్రాత్‌ను ఉద్దేశించి.. బాగానే బౌలింగ్ చేశావు.. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్లి మళ్లీ బౌలింగ్‌ చేయ్‌.. ఎందుకంటే నేనింకా క్రీజులోనే ఉన్నా అంటూ కౌంటర్‌ ఇచ్చా. తర్వాతి రోజు బ్యాటింగ్‌ దిగినప్పుడు మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో కొన్ని బౌండరీలు సాధించినా కొన్ని బంతులు మాత్రం బాగానే ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే తర్వాతి రోజు ఇద్దరం సమానస్థాయిలో ఉన్నాం. కానీ వాళ్లు మాత్రం నన్ను విసిగించే పనినే టార్గెట్‌గా పెట్టుకున్నారంటూ ' సచిన్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top