
లీడ్స్: చహల్ టీవీ పేరుతో భారత క్రికెటర్లను ఇంటర్వ్యూలు చేయడం స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌కు పరిపాటి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సైతం చహల్ ఇంటర్వ్యూలు చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించాడు చహల్. రాహుల్ ఒంటరిగా ఉన్న సమయంలో చహల్ ఇంటర్య్వూ చేయడం కెప్టెన్ విరాట్ కోహ్లి కంటపడింది. దీన్ని గమనించిన చహల్.. ‘చూశావా.. కోహ్లి కూడా చహల్ టీవీలో కనిపించాలని తహతహలాడుతున్నాడు. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావ్ కదా కోహ్లి భయ్యా. చహల్ టీవీలో కనిపించాలనే కదా నీకు ఆత్రం. చహల్ టీవీలో కనబడటానికి ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారో చూశావా’ అంటూ జోకులు పేల్చాడు.
దీనికి పగలబడి నవ్విన కోహ్లి.. ‘నేను కావాలని ఇక్కడికి రాలేదు. రాహుల్ పిలిస్తేనే వచ్చా’ అంటూ సమాధానమిచ్చాడు. దీనికి సంబంధింని వీడియోను బీసీసీఐ తన ట్విటర్ అకౌంట్ పోస్ట్ చేసింది. ఇందుకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘ఎడ్జ్‌బాస్టన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌పై రాహుల్-చహల్ సమీక్షిస్తున్నారు. ఈ తాజా ఎపిసోడ్‌కు కోహ్లి ఒక ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చాడు’ అని పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.