‘బంగారు’ బానిసలు!

‘బంగారు’ బానిసలు! - Sakshi


ఆఫ్రికన్‌ అథ్లెట్ల విషాదం  

పతకాల వేటలో ధనిక దేశాల దుర్మార్గం

ఆశ చూపించి తమ దేశం తరఫున బరిలోకి 

ఆపై అథ్లెట్లకు వేధింపులు   




ఒలింపిక్స్‌లో తమకు పతకం కావాలి... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమ దేశం జెండా ఎగరాలి... ఎలాగైనా, ఏం చేసైనా సరే! అందుకు డబ్బున్న దేశాలు ఎంచుకున్న మార్గం పేద దేశాల అథ్లెట్లను తీసుకొచ్చి తమ దేశం తరఫున ఆడించడం. వారికి ధన కనకాదుల ఆశ చూపించి తమ లక్ష్యం   నెరవేర్చుకోవడం. బహ్రెయిన్, టర్కీ, అజర్‌బైజాన్, కజకిస్తాన్‌... దేశం పేరు ఏదైనా అందరి ఆలోచనలు ఒకటే. అద్దె ఆటగాళ్లు... అద్భుత ఫలితాలు, పతకాల పట్టికలో తమకు స్థానం.



సొంత దేశంలో చాలీ చాలని డబ్బు... దేవుడిచ్చిన  బలమైన శరీరం తప్ప ఆటతో సొమ్ములు చేసుకునే  అవకాశం లేదు. ఇలాంటి స్థితిలో తమ జీవితం    మారిపోతుందనే నమ్మకంతో పరాయి దేశానికి వెళ్లేందుకు ఆఫ్రికా దేశాల అథ్లెట్లు సిద్ధమైపోతున్నారు. కానీ అక్కడ అడుగు పెట్టిన తర్వాత గానీ తమ జీవితం మున్ముందు ఎలా ఉండబోతోందో వారికి తెలియడం లేదు. ఇస్తామన్న డబ్బులు, సౌకర్యాలు లేవు... పైగా దుర్భర   పరిస్థితుల్లో వసతి, డోపింగ్‌ చేసేందుకు ఒత్తిడి... ఇదీ అక్కడి అసలు పరిస్థితి.  



సాక్షి క్రీడా విభాగం : అథ్లెటిక్స్‌ ప్రపంచానికి సంబంధించి ఇదో చీకటి కోణం... ఆఫ్రికా దేశంలో పుట్టి ఎక్కడో మరో దేశం తరఫున పోటీ పడుతున్న ఆటగాళ్లపై జాలిని, సానుభూతిని పెంచే విషాద గాథ ఇది. దేశాలు మారినా, ఖండాలు దాటినా పేదవారి గురించి పెద్దల వ్యవహార శైలి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని కళ్లకు కనిపించే వాస్తవం. విజయం సాధించే ఆటగాడికి ప్రపంచం జేజేలు కొట్టినా... వారి దృష్టిలో మాత్రం వారు ‘క్రీడా బానిసలు’ మాత్రమే. ఏ కొందరో తప్ప ఎక్కువ మంది ఆఫ్రికన్లకు ఇదే అనుభవం ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇథియోపియా అథ్లెట్‌ లిలీ అబ్దుల్లాయెవా వెల్లడించింది. నాలుగేళ్ల పాటు యూరోప్‌ దేశం అజర్‌బైజాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె... అక్కడి పరిస్థితులను ప్రపంచం ముందుంచింది.  వివరాలు లిలీ మాటల్లోనే...



‘నేను అథ్లెటిక్స్‌లో రేస్‌లు గెలిస్తే మంచి జీతంతో పాటు ఇల్లు కొనిస్తామని, ఖరీదైన కార్లు కూడా ఇస్తామని అజర్‌బైజాన్‌ అధికారులు నాకు హామీ ఇచ్చారు. కానీ నాకు అందులో ఒక్కటీ దక్కలేదు. నా ప్రైజ్‌మనీని దొంగలు దోచుకెళ్లారు. బలవంతంగా డ్రగ్స్‌ను వాడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను బానిసగా చూశారు. ఆరంభంలో నెలకు 300 డాలర్ల ఇస్తామని, మంచి ఫలితం సాధిస్తే 1000 డాలర్లకు దానిని పెంచుతామని చెప్పారు. నేను యూరోపియన్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాను. కానీ ఎప్పుడూ నెలకు 150 డాలర్లకు మించి ఇవ్వలేదు. ఎనిమిది నెలల తర్వాత నేను కోచ్‌ను నిలదీస్తే అతనే మిగిలిన డబ్బు ఉంచుకుంటున్నాడని తెలిసింది. 2011 యూరోపియన్‌ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ పరుగులో నేను కాంస్యం సాధించాను.



ఆ తర్వాత 2012 లండన్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే సమయంలో కోచ్‌లు నాతో ఆటలు మొదలు పెట్టారు. 2011 స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ సమయంలో నేను గాయపడ్డా ఎలాగైనా పరుగెత్తాలని బలవంతం చేశారు. ఒక రోజు కోచ్‌ నా దగ్గరకు వచ్చి నోరు తెరవమని చెప్పి నా నాలికపై ఒక టాబ్లెట్‌ పెట్టేశారు. దానిని నేను మింగేశాను. చివరకు ధైర్యం చేసి అడిగితే నీకు దీని వల్ల బలం వస్తుందని మాత్రమే చెప్పారు. ఆ ప్యాకెట్‌ను చూస్తే దానిపై ట్రిబ్యులస్‌ టెస్టోస్టెరాన్‌ అని రాసి ఉంది. దాని గురించి ఇంటర్‌నెట్‌లో వెతికితే ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్‌లు కనిపించాయి. పిల్లలు పుట్టకపోవడం కూడా అందులో ఒకటి. మంచి జీవితం కోసం వస్తే భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని నేను కోపం ప్రదర్శించినా వారు పట్టించుకోలేదు. మరోసారి జార్జియాలో ట్రైనింగ్‌ క్యాంప్‌లో కూడా అతను నాకు కొన్ని ఇంజెక్షన్‌లు ఇచ్చాడు.



ఒలింపిక్స్‌ పతకమే మన లక్ష్యమని, అందుకోసం బలంగా ఉండాలని కూడా చెప్పాడు (ఆ తర్వాత ఈ కోచ్‌పై జీవితకాల నిషేధం పడింది). చివరకు నాలుగేళ్ల తర్వాత నా విజయాలకు అక్కడి ప్రభుత్వం 25 వేల డాలర్లు మాత్రం ఇచ్చింది. అందులో 7 వేల డాలర్లు అక్కడి ఫెడరేషన్‌ అధ్యక్షుడే తీసేసుకున్నాడు. నేను ఇథియోపియాకు తిరిగొచ్చిన తర్వాత ఆ డబ్బు పంపిస్తానన్నాడు కానీ అది ఇప్పటికీ రాలేదు. అజర్‌బైజాన్‌ దేశం తరఫున బాగా ఆడేందుకు నేను ఎంతో శ్రమించాను. మంచి ఫలితాలు సాధించాను. కానీ వారు నన్ను మాత్రం చాలా హీనంగా చూశారు’.



వాళ్లవే పతకాలు...

ఆయిల్‌ సంపదలతో అలరారే దేశం బహ్రెయిన్‌. ఆ దేశపు ఒక్క దినార్‌ కెన్యా దేశపు 276 షిల్లింగ్స్‌ (రూపాయలు)తో సమానం! సహజంగానే ఈ డబ్బు అథ్లెట్లను ఆకర్షిస్తుంది. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో బహ్రెయిన్‌కు రెండు పతకాలు వచ్చాయి. మహిళల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌లో రూత్‌ జెబెట్‌ స్వర్ణం, మహిళల మారథాన్‌లో యూనిస్‌ కిర్వా రజతం సాధించారు. వీరిద్దరు కెన్యా దేశానికి చెందిన వారే. ఇథియోపియాకు చెందిన మర్యమ్‌ యూసుఫ్‌ జమాల్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో బహ్రెయిన్‌ తరఫున ఆడి 1500 మీటర్ల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు 2007, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఆమె స్వర్ణాలు గెలుచుకుంది. ప్రస్తుతం జరుగుతున్న లండన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మారథాన్‌లో బహ్రెయిన్‌కు బంగారం తెచ్చి పెట్టిన రోజ్‌ చెలిమో కెన్యా దేశస్థురాలు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌ సమయంలో తమకు దేశం మారేందుకు అనుమతి కావాలంటూ ఐఏఏఎఫ్‌కు ఒక్క రోజులో ఏకంగా 25 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లో ఆరుగురు కెన్యా అథ్లెట్లు టర్కీ తరఫున పతకం సాధించారు.



నా పరిస్థితి కూడా అదే...

ముచెరు మైనా అనే కెన్యా అథ్లెట్‌ బహ్రెయిన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ‘నాది కూడా బానిస బతుకు అనిపించింది. వారు బహ్రెయిన్‌లో అడుగు పెట్టగానే మా పాస్‌పోర్ట్‌ తీసుకున్నారు. బయట ఎక్కడా తిరగనివ్వలేదు. ఇంటికి డబ్బులు పంపేందుకు కూడా హోటల్‌ నుంచి బయటకు పోనివ్వలేదు. అక్కడి పౌరసత్వం తీసుకుంటూనే కాంట్రాక్ట్‌ దక్కుతుందని హెచ్చరించారు. 2006లో నేను గాయపడితే ఏడాది పాటు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పెద్దగా చదువుకోని మా ఆటగాళ్లను ఏజెంట్లు మభ్యపెట్టి వేరే దేశాలకు తీసుకెళతారు. కానీ కాంట్రాక్ట్, డబ్బు వివరాలు ఏవీ స్పష్టంగా చెప్పరు. మా డబ్బులు లాక్కున్నా అడిగే దిక్కు లేదు. సరైన నిబంధనలు రూపొందించని అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌)కు కూడా ఈ పాపంలో భాగం ఉంది’ అని అతను చెప్పాడు.



ఇది చాలా పెద్ద సమస్య. అథ్లెట్లు అంటే వ్యాపార వస్తువులు కాదు. వారూ మనుషులే. ఆటగాళ్ళు పెద్ద వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని మేం చూస్తాం. కానీ చీకట్లో వారి అమ్మకాలు, కొనుగోలు అనేది దుర్మార్గం. ఈ అంశంపై మేం ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఏడాది చివరిలోగా దీనికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు రూపొందించి ఆటగాళ్లకు తగిన  గౌరవం దక్కేలా చేస్తాం.

–సెబాస్టియన్‌ కో, ఐఏఏఎఫ్‌ అధ్యక్షుడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top