బ్లూ+ఆరెంజ్‌ 

Team India Orange Jersey Officially Unveiled - Sakshi

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కొత్త జెర్సీతో బరిలోకి భారత్‌

బర్మింగ్‌హామ్‌ : ప్రపంచకప్‌లో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులో భారత జట్టు ధరించే ‘అవే’ జెర్సీని శుక్రవారం బీసీసీఐ విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో కనిపించేలా ఈ జెర్సీని ‘నైకీ’ సంస్థ డిజైన్‌ చేసింది. కొన్నాళ్ల క్రితం భారత్‌ ఉపయోగించిన ప్రాక్టీస్‌ డ్రెస్‌ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. రేపు ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఫుట్‌బాల్‌ తరహాలో హోం, అవే మ్యాచ్‌లకు వేర్వేరు జెర్సీలను వేసుకునే సంప్రదాయాన్ని ఐసీసీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్‌లో ప్రవేశపెట్టింది. భారత్, ఇంగ్లండ్‌ రెండు జట్లూ నీలి రంగునే వాడుతుండటంతో వాటి మధ్య తేడా చూపించేందుకు టీమిండియా ఆటగాళ్లు నారింజ రంగు జెర్సీని వేసుకోబోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ‘హోమ్‌’ టీమ్‌ కాగా, భారత్‌ను ‘అవే’ జట్టుగా నిర్ధారించారు.

రంగు మార్చడం అవసరమా..!
ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు చూసిన తర్వాత సగటు క్రికెట్‌ అభిమానికి వేర్వేరు జట్ల జెర్సీలు మనసులో ముద్రించుకుపోయే ఉంటాయి. భారత్, ఇంగ్లండ్‌ టీమ్‌ రంగులు పేరుకు ‘బ్లూ’ అయినా వీటి మధ్య ఎంతో తేడా ఉంది. అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. పైగా ఫుట్‌బాల్‌ తరహాలో ఆటగాళ్ల మధ్య గందరగోళానికి కారణమయ్యే ‘కలర్‌ క్లాషెస్‌’ క్రికెట్‌లో కనిపించదు. ఫుట్‌బాల్‌లో 22 మంది ఒకేసారి మైదానంలో ఉండటంతో పాటు సహచరుడికి పాస్‌లు అందిం చడం అతి కీలకమైన అంశం. కాబట్టి ఇబ్బంది లేకుండా పూర్తిగా భిన్నమైన రంగు జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. క్రికెట్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ కూడా పిచ్‌ వదిలి రారు. ఎదురుగా కనిపించే సహచరుడితో సమన్వయం ఉంటే సరిపోతుంది. ఫీల్డింగ్‌ జట్టు దృష్టి కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌పైనే ఉంటుంది తప్ప ఇతర ఆటగాళ్లతో గందరగోళానికి తావు లేదు. మొత్తంగా ఈ జెర్సీ రంగు మార్పు వ్యవహారం పటాటోపం, హంగామా కోసం చేసినట్లనిపిస్తుంది. ఏదో ఒక సాకుతో కాస్త ఆకర్షణ తెచ్చే ప్రయత్నం చేయడం తప్ప వాస్తవంగా చూస్తే ఈ మార్పుకు ఎలాంటి అర్థం లేదు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top