విజయంతో ముగించాలని...

Sunil gavaskar match analysis - Sakshi

 సునీల్‌ గావస్కర్‌ 

ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించినపుడు కొన్ని జట్లు తమ తొలి మ్యాచ్‌ ఏ జట్టుతో, ఏ వేదికపై జరగనుందో తెలుసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించాయి. అయితే కొన్ని జట్ల కెప్టెన్‌లు, కోచ్‌లు మాత్రం తమ చివరి రెండు మ్యాచ్‌లు ఎక్కడ, ఎవరితో జరగనున్నాయో అనే అంశంపై దృష్టి పెట్టారు. ఒకవేళ సొంత మైదానంలో మ్యాచ్‌లు ఉంటే పరిస్థితులకు తగ్గట్టు పిచ్‌లు రూపొందించుకోవడంతోపాటు జట్టు ఎంపికలో సమతుల్యం ఉండేలా చూసుకుంటారు. అంతేకాకుండా ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించాలంటే రన్‌రేట్‌ ఎంత ఉండాలనే దానిపై కూడా అవగాహన ఉంటుంది. తుది జట్టు ఎంపిక సరిగ్గా లేకపోవడంతో ఢిల్లీ జట్టు మిగతా జట్ల కంటే ముందుగానే ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది. దేశవాళీ ఆటగాళ్ల ఆటతీరుపై సరైన అవగాహన లేని కోచ్‌ ఉన్నందుకు ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. తమ ప్లే ఆఫ్‌ అవకాశాలకు తెరపడిన తర్వాత అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యుడైన అభిషేక్‌ శర్మను తుది జట్టులో ఆడించారు.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభిషేక్‌ అద్భుత ఆటతో అదర గొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఆరంభం నుంచి బాగా ఆడి ఉంటే ఢిల్లీ పరిస్థితి మరోలా ఉండేది. మరోవైపు బెంగళూరు జట్టుకు ఏబీ డివిలియర్స్‌లాంటి ఆటగాడు ఉండటం అదృష్టం. తన ఆటతో అందరిలో నూతనోత్సాహం తెప్పించే డివిలియర్స్‌ మళ్లీ మెరిసి తమ జట్టును ప్లే ఆఫ్‌ బెర్త్‌ అందిస్తాడని ఆశిస్తున్నారు. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో బట్లర్, బెన్‌ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌ ఆకట్టుకున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయినా వారి ఛేజింగ్‌ ఉత్కంఠ కలిగించింది.  కెప్టెన్‌ విలియమ్సన్‌ క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సొంత మైదానంలో చివరి మ్యాచ్‌ ఆడనున్న సన్‌రైజర్స్‌ లీగ్‌ దశను విజయంతో ముగించాలని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. దినేశ్‌ కార్తీక్, కుల్దీప్‌ యాదవ్‌ మళ్లీ రాణించి కోల్‌కతాకు ప్లే ఆఫ్‌ బెర్త్‌ ఖాయం చేస్తారని అనుకుంటున్నాను.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top