'దినేశ్‌ కార్తీక్‌కు స్వాగతం'

 Shah Rukh Khan welcomes Kolkata Knight Riders new captain Dinesh karthik - Sakshi

న్యూఢిల్లీ: రాబోవు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త కెప్టెన్‌గా ఎంపికైన దినేశ్‌ కార్తీక్‌ను ఆ జట్టు సహ యజమాని, బాలీవుడు నటుడు షారుఖ్‌ ఖాన్‌ అభినందించారు. 'సరికొత్త సీజన్‌లో అడుగు పెడుతున్న సందర్భంగా మా సారథిగా దినేశ్‌కు స్వాగతం పలుకుతున్నాం. గత మా కెప్టెన్ల మాదిరిగానే మీరూ మా జట్టును ముందుకు తీసుకెళతావని తెలుసు' అని షారుఖ్ ట్వీట్‌ చేశారు. వచ్చే ఐపీఎల్‌కు గాను దినేశ్‌ కార్తీక్‌ను కేకేఆర్‌ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా పనిచేసిన గౌతం గంభీర్‌ను వదిలేసుకున్న ఆ జట్టు.. ఈ సీజన్‌లో ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పాలి అనే దానిపై లోతుగా విశ్లేషించింది. ఈ  క్రమంలోనే కార్తీక్‌తో పాటు రాబిన్‌ ఉతప్ప,  సునీల్‌ నరైన్‌ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే దినేశ్‌ కార్తీక్‌నే సారథిగా నియమించడానికి కేకేఆర్‌ మొగ్గుచూపింది.

గత ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌కు ఆడిన దినేశ్‌ కార్తీక్‌.. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి చివరి నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కార్తీక్‌కు రూ. 7.4 కోట్లు చెల్లించి కేకేఆర్‌ దక్కించుకుంది. గత సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌.. 14 మ్యాచ్‌ల్లో 361 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 152 మ్యాచ్‌ల ఐపీఎల్‌ అనుభవం ఉన్న దినేశ్‌ కార్తీక్‌.. 2,903 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్‌ సెంచరీలున్నాయి. ఇతనొక నమ్మకదగిన బ్యాట్స్‌మన్‌ కావడంతో పాటు వికెట్‌ కీపర్‌గా కూడా ప్రభావం చూపే క్రికెటర్‌. దాంతో దినేశ్‌ కే జట్టు పగ్గాలు అప్పచెప్పేందుకు ఆసక్తికనబరించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top