
రాజ్‌కోట్: లెఫ్టార్మ్ స్పిన్ ‘జడేజా’ ద్వయం చెలరేగడంతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మూడో రోజే సౌరాష్ట్ర ఇన్నింగ్స్, 212 పరుగుల తేడాతో జమ్మూ కశ్మీర్‌పై ఘన విజయం సాధించింది. రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా దెబ్బకు కశ్మీర్ ఒకే రోజు 16 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 103/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కశ్మీర్ 156 పరుగులకు ఆలౌటైంది. శుభమ్ ఖజూరియా (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధర్మేంద్ర జడేజా 6, రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఫాలోఆన్ ఆడిన కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 256 పరుగులకు ఆలౌటైంది. రామ్ దయాళ్ (56), పునీత్ బిస్త్ (55) అర్ధసెంచరీలు చేశారు.
వందిత్ 6 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 3 వికెట్లు లభించాయి. రవీంద్ర జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చండీగఢ్‌లో మూడో రోజే ముగిసిన మరో మ్యాచ్‌లో విదర్భ ఇన్నింగ్స్, 117 పరుగుల తో పంజాబ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు వెనుకబడి సోమవారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పంజాబ్ 227 పరుగులకే కుప్పకూలింది. వోహ్రా (51), యువరాజ్ సింగ్ (42) ఫర్వాలేదనిపించారు. అక్షయ్ కర్నెవర్ (6/47), అక్షయ్ వాఖరే (4/83) పంజాబ్‌ను దెబ్బ తీశారు.