గేల్ దుమారం.. కోహ్లి మెరుపులు

గేల్ దుమారం.. కోహ్లి మెరుపులు - Sakshi


రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన బ్యాటింగ్ లో పవర్ చూపెట్టింది. మంగళవారం ఇక్కడ గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పంజావిసిరింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఆది నుంచి దూకుడును కొనసాగించి 214 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధికి నిర్దేశించింది. ఆర్సీబీ ఓపెనర్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లిలు బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయారు. ముఖ్యంగా గేల్ మాత్రం మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించాడు. 


 


గేల్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. తద్వారా ఈ సీజన్ లో తొలి హాఫ్ సెంచరీని గేల్ సాధించాడు. మరొకవైపు కోహ్లి కూడా క్లాస్ టచ్ ఇచ్చాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 64 పరుగుల్ని కోహ్లి నమోదు చేశాడు. ఈ జోడి తొలి వికెట్ కు 122 పరుగుల్ని జోడించిన తరువాత గేల్ అవుటయ్యాడు.ఆ తరువాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి జోరును మరింత పెంచే క్రమంలో రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అయితే చివర్లో ట్రావిస్ హెడ్(30 నాటౌట్;16 బంతుల్లో 2 సిక్సర్లు,1 సిక్స్), కేదర్ జాదవ్(38 నాటౌట్; 15 బంతుల్లో 5 ఫోర్లు2 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.



గేల్ కొత్త చరిత్ర..



ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్ లో పది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. గుజరాత్ మ్యాచ్ ద్వారా మూడు పరుగుల్ని పూర్తి చేసుకున్న తరువాత గేల్ ఈ రికార్డును సాధించాడు. గుజరాత్ బౌలర్ బాసిల్ తంపి వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి పదివేల పరుగుల్ని గేల్ పూర్తి చేసుకున్నాడు.

 


మెకల్లమ్ బ్యాడ్ లక్



ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ కు అదృష్టం కలిసి రాగా,  గుజరాత్ ఫీల్డర్ మెకల్లమ్ ను దురదృష్టం వెంటాడింది.గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు. దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్  గేల్ ను రక్షించింది.థర్డ్ అంపైర్  రివ్యూలో క్యాప్ బౌండరీ కి తగలడంతో గేల్ నాటౌట్ గా ప్రకటించాడు. అదే సమయంలో అది సిక్సర్ అయ్యింది. మెకల్లమ్ క్యాప్ పెట్టుకోకున్నా గేల్ అవుటయ్యే వాడని లయన్స్ జట్టు సభ్యులు చింతించారు. గేల్ మాత్రం ఆ క్యాప్ కు ధన్యవాదాలు అన్నట్లు సైగ చేశాడు. ఇక జడేజా మాత్రం ఆ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తరువాత ఇదే జోరును కొనసాగించిన గేల్ 23 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top