బెయిల్స్‌ ఎంత పనిచేశాయి!

Netizens Surprised When Ball Hits Stumps But Bails Don't Come Off In RR VS KKR Match - Sakshi

జైపూర్‌ : ఐపీఎల్‌ సీజన్‌12లో భాగంగా సొంతగడ్డపైనే రాజస్తాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నాలుగో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన కేకేఆర్‌.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా ఓపెనింగ్‌ జోడి (నరైన్‌- క్రిస్‌లిన్‌)ని విడదీసేందుకు రాయల్స్‌ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పది ఓవర్లు కూడా పూర్తికాక ముందే కేకేఆర్‌ స్కోరు వందకు చేరింది. ముఖ్యంగా ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి అభిమానులకు వినోదాన్ని పంచాడు. అయితే ‘బెయిల్స్‌’ కారణంగానే అతనికి లైఫ్‌ లభించిందని.. లేదంటే నాలుగో ఓవర్లలోనే అతడి ఆట ముగిసేదని రాయల్స్‌ అభిమానులు, క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
ఛేజింగ్‌లో భాగంగా నరైన్‌తో పాటు ఓపెనర్‌గా రంగంలోకి దిగిన క్రిస్‌ లిన్‌.. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాయల్స్‌ బౌలర్‌ ధవల్‌ కులకర్ణి నాలుగో ఓవర్‌ రెండో బంతి(ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌) ద్వారా లిన్‌ ఆట కట్టించాలని ప్రయత్నించాడు. అతడు అనుకున్నట్టుగానే బంతి వికెట్లను తాకగానే.. లైట్స్‌ కూడా వెలిగాయి. కానీ బెయిల్స్‌ మాత్రం కిందపడలేదు. అంతేకాదు బంతి బౌండరీ దాటడంతో కోల్‌కతాకు నాలుగు పరుగులు లభించగా.. అంపైర్‌ క్రిస్‌లిన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న క్రికెట్‌ అభిమానులు.. ‘ ఎవరైనా కాస్త చెక్‌ చేయండిరా బాబు.. ఎవరైనా ఫెవికాల్‌తో బెయిల్స్‌ను అంటించారేమో. స్టంప్స్‌ను బాల్‌ గట్టిగా తాకినప్పటికీ బెయిల్స్‌ కిందపడకపోవడం ఏమిటి. అస్సలు నమ్మలేకపోతున్నాం.  ఐపీఎల్‌లో వాడుతున్న బెయిల్స్‌ ఫెవికాల్‌ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉంది’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా కులకర్ణి బౌలింగ్‌లో లైఫ్‌ పొందిన క్రిస్‌లిన్‌.. దూకుడుగా ఆడి 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో లిన్‌ ఔటయినప్పటికీ రాబిన్‌ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (6 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడటంతో 13.5 ఓవర్లలోనే కేకేఆర్‌ లక్ష్యం(140 పరుగులు) పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన హ్యారీ గర్నీ 2 వికెట్లు తీసి..‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  దక్కించుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top